(Source: ECI/ABP News/ABP Majha)
school holidays in Telangana: మేడారం జాతర ఎఫెక్ట్, విద్యాసంస్థలకు వరుసగా 5 రోజులు సెలవులు
మేడారం జాతర సందర్భగా ములగు జిల్లాలోని స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు నాలుగురోజులు ఫిబ్రవరి 25న ఆదివారం రావడంతో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి.
Medaram Jatara Holidays: తెలంగాణలో స్కూల్స్, కాలేజీలకు వరుసగా నాలుగు రోజులు సెలవులు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరుగాంచిన ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలంలోని శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర ఫిబ్రవరి 21వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఈ మేడారం జాతర ప్రసిద్ధి గురించి అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో మేడారం జాతర జరిగే ఫిబ్రవరి 21, 22, 23, 24 తేదీల్లో ములుగు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటిస్తూ ఆ జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అయితే రాష్ట్రంలోని అందరికి ఈ సెలవులు వర్తించవు. కొన్ని జిల్లాల వారికి మాత్రమే వర్తిస్తాయి.
జాతరకు సంబంధించి అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. రవాణా పరంగా ఆర్టీసీ 6వేల ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ఇటు మేడారం జాతరకు వచ్చే భక్తుల కోసం జంపన్న వాగు మరియు పరిసర ప్రాంతాల్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఉన్నటువంటి స్కూల్స్, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. నాలుగు రోజులపాటు సెలవులు ప్రకటిస్తూ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. నాలుగు రోజులపాటు జిల్లాలో ఉన్నటువంటి విద్యాసంస్థలను మూసివేయాలని ఆదేశించారు. ఆదివారం కూడా సెలవు కావడంతో వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను తెలంగాణ కుంభమేళాగా అభివర్ణిస్తారు. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించారు. అయితే మేడారం జాతరకు జాతీయ హోదా కల్పించాలంటూ ఎంతో కాలంగా డిమాండ్ వినిపిస్తుంది.
ఈసారి మేడారం జాతరకు కోటికి పైగా భక్తులు రానున్నట్ల సమాచారం. తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశ నలుమూలలు, వివిధ ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తారు. మేడారం జాతర నేపథ్యంలో ములుగు జిల్లాలో ఫిబ్రవరి 21,22,23,24 ప్రభుత్వ ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ కార్యాలయాలకు కూడా పనిచేయవని ఆదేశాలు జారీ చేశారు. ఫిబ్రవరి 25 ఆదివారం కూడా సెలవు.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు నడుపుతున్నందున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉందని అన్నారు. అందుకు తగ్గట్టుగా ప్రయాణికులు సహకరించాలని పొన్నం కోరారు.
హెలికాప్టర్‌లో మేడారానికి..
హైదరాబాద్, హనుమకొండ నుంచి హెలికాప్టర్‌లో వెళ్లి మేడారం సమ్మక్క సారలమ్మలను దర్శించుకునే వీలు కల్పిస్తున్నారు. దీనిలో భాగంగా హెలిటాక్సీ సంస్థ.. తెలంగాణ ప్రభుత్వం, బెంగళూరుకు చెందిన తుంబీ ఏవియేషన్ సహకారంతో హెలికాప్టర్ సేవలను అందించేందుకు రెడీ అయ్యింది. ఈనెల 21 నుంచి 25 వరకు ఈ సంస్థ హెలికాప్టర్ సేవలు అందించనుంది. అలానే ఈ జాతరకు ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే వారి కోసం పోలీస్ శాఖ రూట్ మ్యాప్‌ను ప్రకటించారు. ఎవరికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈజీగా మేడారం చేరుకునేందుకు ఈ రూట్ మ్యాప్‌ను వెల్లడించారు. వరుసగా నాలుగు రోజులు పాటు సెలవులు రావడంతో స్కూల్స్, కాలేజీల విద్యార్థులు ఆనందంతో ఉన్నారు. ఇప్పటికే తెలంగాణలోని చాలా జిల్లాల ప్రజలు మేడారం జాతరకు వెళ్లెందుకు రెడీ అవుతున్నారు.