CBSE Exams : సీబీఎస్‌ఈ సంచలన నిర్ణయం -ఏడాదికి రెండుసార్లు బోర్డు పరీక్షలు- 2026 నుంచి అమలు
CBSE Exams :సిబిఎస్ఇ కీలక నిర్ణయం తీసుకుంది. 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షలను ఏడాదికి రెండుసార్లు నిర్వహించనుంది. దీని వల్ల విద్యార్థులపై ఒత్తిడి తగ్గుతుందని భావిస్తోంది.

CBSE Exams: సీబీఎస్ఈలో చదువుతున్న విద్యార్థులకు బిగ్ అలర్ట్. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) ఎగ్జామ్ పేట్రన్‌లో కీలక మార్పులు చేసింది. 2026 నుంచి 10వ తరగతి బోర్డు పరీక్షల విధానంలో కొత్త మార్పులు వస్తున్నట్టు ప్రకటించింది. ఇకపై విద్యార్థులు సంవత్సరానికి రెండుసార్లు పరీక్షలు రాసే అవకాశం ఉంటుంది. విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించడానికి ఈ ప్రయత్నాలు చేస్తోంది. మెరుగైన పనితీరును కనబరచడానికి వారికి రెండో అవకాశం ఇస్తారు.
కొత్త నియమం ఏమిటి?
CBSE పరీక్షల కంట్రోలర్ సంయమ్ భరద్వాజ్ సమాచారం ప్రకారం, ఇప్పుడు 10వ తరగతి బోర్డు పరీక్షలు రెండు దశల్లో జరుగుతాయి. మొదటి దశ ఫిబ్రవరిలో జరిగితే రెండో దశ పరీక్షలు మే నెలలో నిర్వహిస్తారు.
ఇందులో ఒక ప్రత్యేకత ఏమిటంటే, మొదటి పరీక్షకు హాజరు కావడం తప్పనిసరి. రెండో పరీక్ష హాజరు కావడం కాకపోవడం అనేది విద్యార్థి ఇష్టంపై ఆధారపడి ఉంటుంది. అంటే మేలో జరిగే పరీక్ష పూర్తిగా ఐచ్ఛికం అన్నమాట. అంటే, ఒక విద్యార్థి తన మొదటి ప్రయత్నంలో వచ్చిన మార్కులతో సంతృప్తి చెందకపోతే, ఆ విద్యార్థి రెండో సారి అంటే మేలో జరిగే పరీక్షకు హాజరు కావచ్చు.
ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు?
CBSE ఈ నిర్ణయం కొత్త జాతీయ విద్యా విధానం (NEP 2020) సిఫార్సులకు అనుగుణంగా తీసుకుంది. దీని లక్ష్యం విద్యార్థులకు సౌకర్యవంతమైన ఒత్తిడి లేని విద్యా వాతావరణాన్ని అందించడం. తద్వారా వారు తమ తప్పుల నుంచి నేర్చుకుని మెరుగుపరచుకోగలరు. ఒకేసారి పరీక్ష రాయడం ద్వారా విద్యార్థి ప్రతిభను పూర్తిగా అంచనా వేయలేమని బోర్డు భావిస్తోంది.





















