AP TET 2024: జులై 1న 'ఏపీ టెట్-2024' కొత్త నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ ఎప్పటినుంచంటే?
AP TET Notification: ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో.. మరోసారి టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పాఠశాల విద్యాశాఖ జులై 1న 'టెట్ జులై-2024' నోటిఫికేషన్ విడుదల చేయనుంది.
AP TET (JULY)-2024 Notification: ఏపీలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి 16,347 పోస్టులతో మెగా డీఎస్సీ నోటిఫికేషన్ జారీచేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే డీఎస్సీతోపాటు టెట్ కూడా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు మొదట టెట్ నిర్వహించి, ఆ తర్వాత డీఎస్సీ నిర్వహణకు సమాయత్తమవుతోంది. ఇందులో భాగంగా జులై 1న 'AP TET (July)-2024' నోటిఫికేషన్ విడుదల కానుంది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్ కుమార్ జూన్ 30న ఒక ప్రకటనలో తెలిపారు.
అభ్యర్థుల ద్వారా జులై 2 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ వెల్లడించారు. ఏపీటెట్ నోటిఫికేషన్, ఇన్‌ఫర్మేషన్ బులిటిన్, షెడ్యూలు, సిలబస్‌తపాటు పరీక్షకు సంబంధించిన పూర్తి వివరాలు, విధివిధానాలు జులై 2 నుంచి అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నారు. ఒకవేళ ఏమైనా సందేహాలుంటే కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించవచ్చని సూచించారు.
టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ..
ఏపీలో గత వైసీపీ ప్రభుత్వం ఫిబ్రవరి 27 నుంచి మార్చి 6 వరకు టెట్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు మొత్తం 2.35 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా, వారిలో 1,37,903 మంది (58.46శాతం) మాత్రమే అర్హత సాధించారు. అయితే కొత్తగా అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం గత డీఎస్సీ నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. కొత్తగా 16,347 ఉపాధ్యాయ పోస్టులతో 'మెగా డీఎస్సీ' ప్రకటించింది. ఈ నేపథ్యంలో.. ఇటీవల బీఈడీ, డీఎడ్ పాసైన అభ్యర్థులతో పాటు, గత టెట్‌లో ఫెయిలైన వారికి అవకాశం కల్పిస్తూ కొత్తగా టెట్ నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీఎస్సీలో టెట్ మార్కులకు 20 శాతం వెయిటేజీ ఇవ్వనున్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు..
ఏపీలో డీఎస్సీ నోటిఫికేషన్‌తో పాటు టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TET) నిర్వహించడానికి చంద్రబాబు ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో గత ప్రభుత్వం విడుదల చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. ఈ మేరకు ఏపీ విద్యాశాఖ జూన్ 30న అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల తరువాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మెగా డీఎస్సీకి నిర్ణయం తీసుకోగా, ఆ దస్త్రంపైనే సీఎం చంద్రబాబు తొలి సంతకం చేశారు. ఆపై ఏపీ కేబినెట్ డీఎస్సీ నిర్వహణకు ఆమోదం తెలిపింది. 16,347 పోస్టులతో మెగా డీఎస్సీని నిర్వహిస్తామని ఏపీ మంత్రులు వెల్లడించారు.
పూర్తిసమాచారం కోసం క్లిక్ చేయండి..
ALSO READ:
తెలంగాణ డీఎస్సీ-2024 పరీక్షల పూర్తిస్థాయి షెడ్యూలు, పరీక్ష విధానం ఇలా
తెలంగాణలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న డీఎస్సీ-2024 (TG DSC) షెడ్యూలును పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. పరీక్షల షెడ్యూలును అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జులై 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఆయా తేదీల్లో ప్రతిరోజూ రెండు విడతల్లో పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 11,062 ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ వెలువడగా.. 2,79,956 మంది అభ్యర్థులు దరఖాస్తులు వచ్చాయి. ఒకే అభ్యర్థి సెకండరీ గ్రేడ్ టీచర్, స్కూల్ అసిస్టెంట్ పోస్టులతో పాటు స్కూల్ అసిస్టెంట్‌లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ వంటి వివిధ సబ్జెక్టులకు పోటీపడనున్న నేపథ్యంలో.. అభ్యర్థుల సంఖ్య సుమారు 2 లక్షల వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు పరీక్షలను వేర్వేరు తేదీల్లో పరీక్షలు నిర్వహించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
పూర్తివివరాల కోసం క్లిక్ చేయండి..