AP Inter Exams: అలర్ట్! ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా పడే ఛాన్స్ - కారణం ఏంటంటే
Inter Exams Postpone: ముందస్తు షెడ్యూలు ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి మొదలై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ బోర్డ్ పరీక్షలు (AP Inter Exams) వాయిదా పడే అవకాశం కనిపిస్తోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) మంగళవారం ప్రకటించిన జేఈఈ మెయిన్ ఎక్సామ్స్ (JEE Main) డేట్‌లు, గతంలో ప్రకటించిన ఇంటర్ పరీక్షల తేదీలు (Inter Exams Dates) ఒకే తేదీల్లో వస్తున్నాయి. దీంతో ఇంటర్ పరీక్షల వాయిదాపై అధికారులు ప్రయత్నిస్తున్నారు. కొద్ది రోజుల క్రితమే ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ షెడ్యూలు ప్రకారం ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి మొదలై 28వ తేదీతో పూర్తి కావాల్సి ఉంది. కానీ జేఈఈ మెయిన్స్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి.
జేఈఈ మెయిన్ మొదటి విడత పరీక్ష జరిగే 16న ఇంటర్ సెకండ్ ఇయర్ మాథ్స్, బోటనీ, సివిక్స్, 19న మాథ్స్-2బీ, జువాలజీ, హిస్టరీ పరీక్షలు ఉన్నాయి. జేఈఈ మెయిన్ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు 2 విడతలుగా నిర్వహిస్తారు. ఇంటర్ పరీక్షలు ఉదయం 9 నుంచి 12 వరకు ఉంటాయి. కాబట్టి, ఒకేరోజు విద్యార్థులు జేఈఈ మెయిన్, ఇంటర్ పరీక్షలు రాయడం అస్సలు కుదిరే పని కాదు. అందుకే ఇంటర్ పరీక్షలను మొత్తం వాయిదా వేయాలా? లేదంటే ఒకే తేదీన ఉన్నటువంటి పరీక్షల్ని వాయిదా వేస్తే సరిపోతుందా? అన్న కోణంలో అధికార యంత్రాంగం సమాలోచనలు జరుపుతోంది.
ఇంటర్ ఫస్టియర్ (Inter Exams Date) పరీక్షలను యథాతథంగా కొనసాగించి, రెండో ఏడాది వాయిదా వేస్తే ఎలాగుంటుందనే అంశంపైన కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇంటర్ పరీక్షలు వాయిదా పడితే ఆ ఎఫెక్ట్ 10వ తరగతి పరీక్షలపైన కూడా పడుతుంది. ఈ క్రమంలో సెకండరీ స్కూల్ బోర్డు (SSC Board) ఇంటర్ బోర్డు అధికారులు బుధవారం ప్రత్యేకంగా సమావేశం అవ్వనున్నారు.
జూన్‌లో ఈఏపీసెట్?
జేఈఈ మెయిన్, ఇంటర్మీడియట్ పరీక్షల వాయిదా కారణంగా ఇంజినీరింగ్, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈఏపీసెట్‌ను జూన్‌లో నిర్వహించే అవకాశం ఉంది. జేఈఈ మెయిన్ మొదటి విడత 16 నుంచి 21 వరకు, రెండోవిడత మే 24 నుంచి 29 వరకు ఉంది.
తెలంగాణలో (Telangana Inter) సాధారణంగానే..
తెలంగాణలో ఇంటర్ పరీక్షల (Telangana Inter Exams) విషయంలో ఎలాంటి సమస్యా లేదు. ఇక్కడ ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ 20 నుంచి మే 2 వరకు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు.. అలాగే ఏప్రిల్ 21 నుంచి మే 5 వరకు ఇంటర్ సెకండియర్ పరీక్షలు జరగనున్నాయి. అదేవిధంగా మార్చి 23 నుంచి ఏప్రిల్ 8 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు.