AP Inter First Year Results: ఏపీ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం డైరెక్ట్ లింక్ ఇదే
Inter Results: ఏపీలో ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు.
APBIE Inter Results: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ ప్రథమ సంవత్సరం (Inter First Year Results) పరీక్షల ఫలితాలు శుక్రవారం (ఏప్రిల్ 12) విడుదలయ్యాయి. తాడేపల్లిలోని ఇంటర్మీడియట్ బోర్డు కార్యాలయంలో ఉదయం 11 గంటలకు అధికారులు ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించిన ఫలితాలను ఒకేసారి విడుదల చేశారు. రెగ్యులర్ విద్యార్థులతోపాటు ఒకేషనల్ కోర్సుల విద్యార్థులకు సంబంధించిన ఫలితాలను కూడా వెల్లడించారు. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలను అందుబాటులో ఉంచారు. ఇతర వెబ్‌సైట్లలోనూ ఫలితాలు చూసుకోవచ్చు. విద్యార్థులు తమ రోల్ నంబర్, పుట్టిన తేదీ వివరాలు నమోదుచేసి అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఫలితాలను తెలుసుకోవచ్చు. పరీక్షలు పూర్తయిన 22 రోజుల్లోనే రికార్డుస్ధాయిలో ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించడం విశేషం.
ఇంటర్ ఫస్టియర్‌లో 67 శాతం, సెకండియర్‌లో 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో కృష్ణా జిల్లా 84 శాతంతో మొదటి స్థానంలో నిలవగా, 81 శాతంతో గుంటూరు జిల్లా రెండో స్థానంలో, 79 శాతంతో ఎన్టీఆర్ జిల్లా మూడోస్థానంలో నిలిచాయి. ఫలితాలతో పాటు ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను, ఫీజువివరాలను అధికారులు వెల్లడించారు.
ఫలితాల్లో బాలికలదే హవా...
ఇంటర్ ఫలితాల్లో భాలికల హవా కొనసాగింది. జనరల్ విభాగంలో మొదటి సంవత్సరం 71 శాతం బాలికలు అర్హత సాధించగా.. బాలురు 64 శాతం మాత్రమే అర్హత సాధించారు. ఇక ఒకేషనల్ ఫలితాల్లోనూ బాలికలే పైచేయి సాధించారు. మొదటి సంవత్సరంలో 47 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 70 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు. ఇక సెకండియర్‌లో సంవత్సరంలో 59 శాతం బాలురు ఉత్తీర్ణులైతే, 80 శాతం బాలికలు ఉత్తీర్ణులయ్యారు.
ఈ ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 1,559 సెంటర్లలో మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. మార్చి 1 నుంచి 19 వరకు మొదటి సంవత్సరం విద్యార్థులకు, మార్చి 2 నుంచి 20 వరకు రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించారు.
➥ ఈ ఏడాది ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు సంబంధించి మొత్తం 10,02,150 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఇందులో ప్రథమ సంవత్సరం నుంచి 4,99,756 మంది హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 4,61,273 మంది; ఒకేషనల్ విద్యార్థులు 38,483 మంది ఉన్నారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరానికి సంబంధించి మొత్తం 5,02,394 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. అందులో జనరల్ విద్యార్థులు 3,93,757 మంది; ఒకేషనల్ విద్యార్థులు 32,339 మంది; ప్రైవేటు విద్యార్థులు 76,298 మంది ఉన్నారు.
➥ ఇంటర్ ఫలితాలకు సంబంధించి జనరల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 4,61,273 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 3,10,875 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 67 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 3,93,757 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 3,06,528 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 78 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.
➥ ఇక ఇంటర్ ఒకేషనల్ విభాగంలో ప్రథమ సంవత్సరం నుంచి 38,483 మంది పరీక్షలకు హాజరుకాగా.. వీరిలో 23,181 మంది ఉత్తీర్ణత సాధించారు. మొత్తం 60 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇక ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి 32,339 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా.. 23,000 మంది పరీక్షలో అర్హత సాధించారు. మొత్తం 80 శాతం విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు.