AICTE Calendar: ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ విడుదల, ఇంజినీరింగ్ తరగతుల ప్రారంభమయ్యేది ఎప్పుడంటే?
దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యాసంవత్సర ప్రణాళికను (AICTE Academic Calendar) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) విడుదల చేసింది.
Engineering Classes: దేశంలోని సాంకేతిక విద్యాసంస్థల్లో ఈ ఏడాది ఇంజినీరింగ్ విద్యాసంవత్సర ప్రణాళికను (AICTE Academic Calendar) అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) విడుదల చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 15 నాటికి ఇంజినీరింగ్ మొదటి సంవత్సర తరగతులు ప్రారంభించాలని కళాశాలలకు ఏఐసీటీఈ స్పష్టం చేసింది. ఈ మేరకు 2024-25 విద్యా సంవత్సర ప్రణాళిక తేదీలను ఖరారు చేసింది. ఇంజినీరింగ్ కళాశాలలకు జూన్ 30 నాటికి తుది అనుమతులు జారీ చేస్తామని, ఆయా విశ్వవిద్యాలయాలు, బోర్డులకు జులై 31లోపు అనుబంధ గుర్తింపు (Affiliation) ఇవ్వాలని ఆదేశించింది.
➥ ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ (టెక్నికల్ విద్యాసంస్థలకు)..
⫸ ఏఐసీటీఈ అనుమతుల మంజూరు, నిరాకరణకు చివరితేది: 10.06.2024.
⫸ సాంకేతిక విద్యాసంస్థలకు అనుమతుల మంజూరుకు చివరితేది: 30.06.2024.
⫸ యూనివర్సిటీ లేదా బోర్డుకు అనుమతుల మంజూరుకు చివరితేది: 31.07.2024.
⫸ సాంకేతిక విద్యాసంస్థలకు అనుమతుల మంజూరుకు చివరితేది: 30.06.2024.
⫸ పూర్తి ఫీజు రీఫండ్‌తో సీటు రద్దుకు చివరితేది: 11.09.2024.
⫸ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరంలో చేరేందుకు చివరితేది: 15.09.2024.
⫸ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం: 15.09.2024.
⫸ లేటరల్ ఎంట్రీ (సెకండియర్) ప్రవేశాలకు చివరితేది: 15.09.2024.
➥ ఏఐసీటీఈ అకడమిక్ క్యాలెండర్ (PGDM/PGCM విద్యాసంస్థలకు)..
⫸ అనుమతుల మంజూరు, నిరాకరణకు చివరితేది: 10.06.2024.
⫸ తుది అనుమతుల మంజూరుకు చివరితేది: 30.06.2024.
⫸ పూర్తి ఫీజు రీఫండ్‌తో సీటు రద్దుకు చివరితేది: 11.09.2024.
⫸ PGDM/PGCM కోర్సుల్లో చేరేందుకు చివరితేది: 15.09.2024.
⫸ ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం తరగతుల ప్రారంభం: 15.09.2024.
⫸ లేటరల్ ఎంట్రీ ప్రవేశాలకు చివరితేది: 15.09.2024.
బీబీఏ, బీసీఏ కోర్సులు, ఏఐసీటీఈ అనుమతులు తప్పనిసరి..
కొత్త విద్యాసంవత్సరం నుంచి డిగ్రీలో రెగ్యులర్ కోర్సులతో పాటు బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ ఆడ్మినిస్ట్రేషన్(BBA), బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్(BCA) కోర్సులు తప్పనిసరి చేయాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి (AICTE) నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇంజినీరింగ్ కళాశాలల్లోనూ వీటిని ప్రవేశపెట్టనుంది. అయితే కోర్సుల అనుమతులకు యూజీసీ నిబంధనలే వర్తిస్తాయని, ఆయా కోర్సులు అందించే కళాశాలలు తప్పనిసరిగా ఏఐసీటీఈ అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని అఖిల భారత సాంకేతిక విద్యామండలి(ఏఐసీటీఈ) స్పష్టం చేసింది.
ఏఐసీటీఈ అనుమతులపై ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్, పాలిటెక్నిక్ కళాశాలల ప్రతినిధులకు అవగాహన కల్పించేందుకు ఈ ఏడాది జనవరిలో ఓయూలో సదస్సు జరిగింది. బీబీఏ, బీసీఏ కోర్సులకు ఏఐసీటీఈ అనుమతి తీసుకోవాలని, ఇక వారి పరిధిలో ఉండదని యూజీసీ కూడా నోటిఫికేషన్ జారీ చేసింది. ఇకనుంచి మంచి పనితీరు కనబరిచే కళాశాలలకు కూడా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఇచ్చామని, సీట్ల సంఖ్యపై కూడా పరిమితి ఎత్తివేశామని తెలిపారు. ఈసారి నుంచి కళాశాలల ప్రతినిధులు ఏఐసీటీఈ కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదని, తామే కళాశాలల వద్దకు వస్తామని పేర్కొన్నారు.
మరోవైపు స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలు, న్యాక్-ఏ గ్రేడ్ పొందిన కళాశాలలు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కూడా కొన్ని కళాశాలలు ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఏఐసీటీఈ అనుమతుల నిబంధనావళిలో ఎన్ని ఆఫ్ క్యాంపస్‌లు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన కళాశాల ఏ వర్సిటీకి అనుబంధంగా ఉందో.. దాని పరిధిలో మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకోవాలి.