Teachers: పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు ఆదేశాలు జారీ, 18లోపు పూర్తికావాలి
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆగస్టు 14న ఆదేశాలు జారీ చేసింది.
ఏపీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్ ఆగస్టు 14న ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ, జిల్లా పరిషత్ ప్రైమరీ, మండల పరిషత్ ప్రైమరీ, మున్సిపల్ పాఠశాలల్లో మిగులు ఉపాధ్యాయులు, అవసరమైన ఉపాధ్యాయుల జాబితాను జులై 31వ తేదీ విద్యార్థుల ఎన్‌రోల్‌మెంట్ ఆధారంగా జిల్లా విద్యాశాఖకు అందించాలని తెలిపారు. 84, 85, 117, 128, 47, 60 జిఓల ఆధారంగా ఉపాధ్యాయుల సర్దుబాటు ఉండాలని సూచించారు.
ఐటీడీఏ, గిరిజన ప్రాంతాల నుంచి మైదాన ప్రాంతాలకు సర్దుబాటు చేయొద్దని ఆదేశించింది. ప్రభుత్వ, ఎంపీపీ, జడ్పీ పాఠశాలల నుంచి పురపాలక పాఠశాలలకు మార్పు చేసేందుకు అవకాశం కల్పించింది. కమిటీ ఛైర్మన్‌గా జిల్లా కలెక్టర్, కో ఛైర్మన్‌గా కొత్త జిల్లా కలెక్టర్లు, ఉమ్మడి జిల్లా విద్యాశాఖ అధికారి కన్వీనర్‌గా, కొత్త జిల్లా విద్యాశాఖ అధికారులు సభ్యులుగా ఉండే కమిటీ అనుమతితో ఈనెల 18లోపు ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించింది.
ఆంధ్రప్రదేశ్‌లో గతంలో నిర్వహించిన హేతుబద్ధీకరణ ఆధారంగా అవసరమైన చోట ఉపాధ్యాయుల్ని సర్దుబాటు చేయనున్నట్లు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యానారాయణ తెలిపారు. ఆగస్టు 8న ఉపాధ్యాయ సంఘాల నాయకులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో మంత్రి ఈ మేరకు వెల్లడించారు. రాష్ట్రంలో మొదట స్కూల్ కాంప్లెక్స్, మండలం, డివిజన్ ఇలా ప్రాధాన్య క్రమంలో టీచర్లను సర్దుబాటు చేయనున్నారు. పురపాలక పాఠశాలల్లో అవసరానికి మించి ఉన్న ఉపాధ్యాయులను పురపాలక లేదా దగ్గర్లోని ఇతర యాజమాన్య పాఠశాలల్లోనూ సర్దుబాటు చేస్తారు. అవసరం, అదనం ఆధారంగా ఈ సర్దుబాటు ఉంటుంది.
మున్సిపాలిటీ పరిధిలోని టీచర్లకు సర్వీసు నిబంధనలు లేనందున పెండింగ్‌లో ఉన్న మెడికల్ బిల్లుల గడువును పొడిగించనున్నట్లు మంత్రి బొత్స సత్యనారాయణ వారికి హామీ ఇచ్చారు. పదోన్నతులు, బదిలీల కారణంగా రెండు నెలల నుంచి జీతాలు రాని ఉపాధ్యాయులకు వారంలోపు జీతాలు ఇప్పిస్తామని తెలిపారు. ఎంఈఓ-1, ఎంఈఓ-2 జాబ్ ఛార్ట్‌పై వచ్చే వారం మరోసారి సమావేశం నిర్వహిస్తామని, ఇటీవల బదిలీ పొంది రిలీవ్ కాని 450 మంది ఉపాధ్యాయులను త్వరలో రిలీవ్ చేస్తామని మంత్రి బొత్స తెలిపారు.
ఉపాధ్యాయులపై పనిభారం పెంచడం, సెక్షన్ పరిమాణాన్ని 50 శాతానికి పైగా పెంచడం వల్ల ఉపాధ్యాయ పోస్టులు తగ్గాయని, హేతుబద్ధీకరణ ఉత్తర్వులను రద్దు చేస్తేనే విద్యావ్యవస్థకు మేలు జరుగుతుందని నవ్యాంధ్ర టీచర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మాగంటి శ్రీనివాసరావు విన్నవించారు. ఎంఈఓలు ఇద్దరికీ సమానంగా అధికారాలు కల్పించాలని ఎస్టీయూ కోరింది. అంతర్ జిల్లాల బదిలీలు, డీఎస్సీ-2003, పాత పింఛన్ అమలుపై ఏపీ ఉపాధ్యాయ సమాఖ్య విన్నవించింది.
ALSO READ:
నవోదయ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 17 వరకు అవకాశం కల్పించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఆగస్టు 9న ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.
ప్రవేశాలు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..
APPSC: ఆర్‌ఐఎంసీలో 8వ తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్, వివరాలు ఇలా!
డెహ్రాడూన్‌లోని రాష్ట్రీయ ఇండియన్ మిలిటరీ కాలేజ్(ఆర్‌ఐఎంసీ)లో ఎనిమిదో తరగతి (2024 జులై సెషన్) ప్రవేశాలకు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్థానిక బాలురు, బాలికలు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష, వైవా, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ప్రవేశాలు కల్పిస్తారు. సరైన అర్హతలున్న విద్యార్థులు అక్టోబరు 15 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. వీరికి డిసెంబరు 2న ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు.
ప్రవేశాల పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి..