(Source: ECI/ABP News/ABP Majha)
Engineering Seats: ఇంజినీరింగ్‌లో మరో 15 వేల సీట్లు, ఈ ఏడాది నుంచే అందుబాటులోకి!
తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏఐసీటీఈ నుంచి అనుమతి వచ్చిన తొలి ఏడాదే కళాశాలల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.
Engineering Colleges: తెలంగాణలో ఇంజినీరింగ్ కళాశాలల ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఏఐసీటీఈ అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఏఐసీటీఈ నుంచి అనుమతి వచ్చిన తొలి ఏడాదే కళాశాలల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ ప్రాంతంలో మరో క్యాంపస్ ప్రారంభించేందుకు అగ్రశ్రేణి కళాశాలలు ఆసక్తి చూపుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో లేని కళాశాలలతోపాటు పరిధిలోని కళాశాలలు పోటీపడుతున్నాయి. ఇప్పటివరకు జేఎన్‌టీయూహెచ్‌కు 6 కళాశాలలు దరఖాస్తు చేసుకున్నాయి. ఆలస్య రుసుముతో ఫిబ్రవరి 7 వరకు దరఖాస్తుకు గడువు ఉన్నందున ఆ సంఖ్య 10కి చేరే అవకాశముంది. రాష్ట్రంలో 156 ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీలతోపాటు ప్రభుత్వ కళాశాలల్లో కలిపి ప్రస్తుతం మొత్తం 1.20 లక్షల బీటెక్ సీట్లున్నాయి. ప్రైవేట్, డీమ్డ్ వర్సిటీల్లో మరో 8 వేల వరకు ఉన్నాయి. మొత్తానికి వచ్చే విద్యాసంవత్సరం (2024-25)లో కనీసం మరో 15 వేల సీట్లు పెరుగుతాయని అంచనా వేస్తున్నారు.
ఏఐసీటీటీ నిబంధనల ప్రకారం.. కళాశాలలను లీజు భవనంలో కూడా ఏర్పాటు చేసుకునేందుకు, 75 కిలోమీటర్ల దూరంలోపు ఉంటే అధ్యాపకులను రెండు కళాశాలల్లో బోధించేందుకు అనుమతి ఉండటంతో.. నగరానికి దూరంగా ఉన్న కాలేజీలు కూడా హైదరాబాద్‌లో ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. ఇప్పటివరకు డీమ్డ్ విశ్వవిద్యాలయాలకు మాత్రమే ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండేది. అయితే తాజాగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలకు సైతం ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు ఏఐసీటీటీ అనుమతి తెలిపింది.
వెరిఫికేషన్ తర్వాతే..
కొత్త క్యాంపస్‌ల ఏర్పాటు కోసం దరఖాస్తు గడువు పూర్తయిన తర్వాత, దరఖాస్తుల పరిశీలన అనంతరం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ(SBTET) ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి రాష్ట్ర స్థాయిలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. కళాశాలల్లో మౌలిక వసతులుంటే సీట్లు పెంచుకునే అవకాశాన్ని ఏఐసీటీఈ ఇవ్వడంతో ఈసారి పెద్ద సంఖ్యలో కళాశాలలు దరఖాస్తు చేస్తున్నాయి. ఎన్ని కళాశాలలు, ఎన్ని సీట్లన్నది తెలియాల్సి ఉంది. మహబూబ్‌నగర్‌లోని ఓ కళాశాల, ఘట్‌కేసర్ ప్రాంతంలోని మరో కళాశాల, జీడిమెట్ల సమీప ప్రాంతంలోని గ్రూపు సంస్థల యాజమాన్యం కూడా దరఖాస్తు చేసిన వాటిలో ఉన్నాయి. వీటితో పాటు మరో 3 ప్రముఖ కళాశాలలు కూడా దరఖాస్తు చేసుకున్నాయి.
బోధనా రుసుముల సంగతేంటి?
ఏఐసీటీఈ ఆమోదం ఇచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వకుంటే కళాశాలలు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నాయి. ఈ క్రమంలో ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినా.. వాటిలో చేరేవారికి ఫీజు రీయింబర్స్‌మెంట్ వర్తించదన్న షరతులతో అంగీకరించే అవకాశం ఉంది. గ్రామీణ ఇంజినీరింగ్ కళాశాలల సంఘం నేత రవికుమార్ సైతం ఇప్పటికే ఈ విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఒకవైపు ఇష్టమొచ్చినట్లు సీట్లు పెంచుకునే అవకాశం.. మరో వైపు ఆఫ్ క్యాంపస్‌లు ఇస్తే.. గ్రామీణ ప్రాంతాల్లోని కళాశాలల మనుగడ కష్టమని, తప్పదనుకుంటే గ్రామీణ జిల్లాల్లో ఉన్న కళాశాలలకే అనుమతి ఇవ్వాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
అధ్యాపకులు రెండు కళాశాలల్లో బోధించవచ్చు..
తెలంగాణలోని ఇంజినీరింగ్ కళాశాలల్లో బోధన చేసే అధ్యాపకులు ఇకపై రెండు కాలేజీల్లోనూ పాఠాలు బోధించే వెసులుబాటును ఏఐసీటీఈ కల్పించింది. ఇప్పటివరకు ఒక అధ్యాపకుడు ఒక ఇంజినీరింగ్ కళాశాలలో మాత్రమే పాఠాలు బోధించాలన్నది ఇప్పటివరకు ఉన్న నిబంధన ఉండేది. అయితే కొత్తగా ఆఫ్ క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే కళాశాలలు మాత్రం వారితో రెండుచోట్ల బోధన చేయించవచ్చు. ఉత్తమ పనితీరు కనబరిచే ఇంజినీరింగ్ కళాశాలలకు అఫిలియేషన్ విశ్వవిద్యాలయం పరిధిలో ఆఫ్ క్యాంపస్‌లు పెట్టుకోవచ్చని ఏఐసీటీఈ నిర్ణయించింది.
స్వయంప్రతిపత్తి హోదా ఉన్న కళాశాలలు, న్యాక్-ఏ గ్రేడ్ పొందిన కళాశాలలు 2024-25 విద్యాసంవత్సరం నుంచి ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. రాష్ట్రంలో కూడా కొన్ని కళాశాలలు ఆఫ్ క్యాంపస్‌ల ఏర్పాటుకు సమాయత్తమవుతున్నాయి. అయితే ఏఐసీటీఈ అనుమతుల నిబంధనావళిలో ఎన్ని ఆఫ్ క్యాంపస్‌లు అన్నదానిపై స్పష్టత రావాల్సి ఉంది. ప్రధాన కళాశాల ఏ వర్సిటీకి అనుబంధంగా ఉందో.. దాని పరిధిలో మాత్రమే వాటిని ఏర్పాటు చేసుకోవాలి.
జేఎన్‌టీయూహెచ్ అనుబంధంగా ఉండే కళాశాలలు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవచ్చు. అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీకి అనుబంధంగా ఉండే కళాశాలలు మాత్రం కేవలం హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఆఫ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. ఆఫ్ క్యాంపస్‌లను మొత్తం మూడు కేటగిరీలుగా ఏఐసీటీఈ విభజించింది. ప్రధాన క్యాంపస్‌కు 5 కి.మీ.లోపు దూరంలో ఉండే కళాశాలలు, 75 కి.మీలోపు ఉండే కళాశాలలు, ఆపైదూరంలో ఉండే కళాశాలలు అని మూడు కేటగిరీలను ఏర్పాటు చేయనున్నారు.
మొదటి కేటగిరీ కింద అధ్యాపకులతో పాటు ఆయా సదుపాయాలైన ప్రయోగశాలలు, క్రీడామైదానాలు లాంటివి రెండు క్యాంపస్‌లు వినియోగించుకోవచ్చు. అంటే ఒక అధ్యాపకుడు ఎక్కడ అవసరముంటే అక్కడ పాఠాలు బోధిస్తారు. ఇక రెండో కేటగిరీలో మాత్రం అధ్యాపకులను ఆఫ్ క్యాంపస్‌కు పంపొచ్చు. కాకపోతే ఒకేరోజు రెండింటిలో బోధించడానికి వీల్లేదు. ఒకరోజు ప్రధాన క్యాంపస్, మరుసటిరోజు ఆఫ్ క్యాంపస్‌లో పాఠాలు చెప్పొచ్చు. ఇక మూడో కేటగిరీ కింద అధ్యాపకులను, వసతులను పంచుకోవడానికి వీల్లేదు.