Visakha News : కళ్యాణ మండపంలో ప్రియుడి పెళ్లి, బయట పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్!
Visakha News : విశాఖ షీలానగర్ లోని ఓ కళ్యాణ మండపం వద్ద పెట్రోల్ బాటిల్ తో యువతి హల్ చల్ చేసింది. యువకుడు తనను మోసం చేసి మరొకరిని పెళ్లి చేసుకున్నాడని యువతి ఆరోపిస్తుంది.
Visakha News : విశాఖలోని ఓ కళ్యాణ మండపం వద్ద హైడ్రామా నెలకొంది. ప్రేమ పేరుతో యువకుడు మోసం చేశాడంటూ కళ్యాణ మండపం వద్ద యువతి పెట్రోల్ బాటిల్ తో హల్ చల్ చేసింది. ప్రియాంక అనే యువతి ఆరు నెలల క్రింత పెళ్లి కొడుకు భగత్ పై దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసిన పోలీసులు భగత్ ను రిమాండ్ కి పంపించారు. మూడు నెలల తర్వాత జైలు నుంచి విడుదైన భగత్, ఇవాళ గాజువాక షీలానగర్ లో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అయితే విషయం తెలుసుకున్న ప్రియాంక కళ్యాణ మండపం వద్ద పెట్రోల్ తో ఆత్మహత్యకు సిద్ధమైంది. పోలీసులకు సమచారం అందించడంతో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రియాంకను ఆపారు. అయితే అప్పటికే పెళ్లి అయిపోవడంతో భగత్ అక్కడి నుంచి జారుకున్నాడు. కోర్టులో కేసు ఉండగా పెళ్లి ఆపే హక్కు తమకు లేదని పోలీసులు తెలిపారు.
ఆత్మహత్య కేసు ట్విస్ట్
తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం రెడ్డివారిపల్లి గ్రామానికి చెందిన యువతి మోహన కృష్ణ (19) ఆత్మహత్య కేసులో మరో ట్విస్ట్ వెలుగుచూసింది. పోస్టుమార్టం రిపోర్టులో యువతి ఆత్మహత్య చేసుకోలేదని, ఎవరో గొంతు నులిమి హత్య చేశారని తేలింది. దీంతో చంద్రగిరి పోలీసులు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. తిరుపతి జిల్లా రెడ్డివారిపల్లెకు చెందిన ముని రాజా కుమారై మోహన కృష్ణ స్థానికంగా ఉన్న కాలేజీలో ఇంటర్ చదువుతోంది. అయితే ఆంజనేయపురానికి చెందిన వికాస్ అనే యువకుడితో ఆమె ప్రేమలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి కులాలు వేరు కావడంతో వీరి పెళ్లికి రెండు కుటుంబాల పెద్దలు ఒప్పుకోలేదు. ఈ విషయంపై పోలీసుల సమక్షంలో పంచాయితీ, విద్యార్థులకు కౌన్సెలింగ్ కూడా జరిగింది. దీంతో యువతీ యువకులను వాళ్ల కుటుంబసభ్యులు దూరంగా ఉంచారు. ఉన్నట్టుండి జులై 7న యువతి మోహన కృష్ణ ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం వచ్చింది. ప్రేమ వివాహానికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో యువతి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు తెలిపారు. అయితే యువతి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఎస్వీ మెడికల్ కాలేజీకి తరలించారు. పోస్టుమార్టం రిపోర్టులో యువతిది హత్యగా తేలడంతో పోలీసులు హత్య కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పరువు హత్య కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
పెళ్లి పేరుతో మోసం
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఇటీవల దారుణం జరిగింది. ఓ యువతిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆపై అత్యాచారం చేశాడు. ముందుగా ప్రేమ, పెళ్లి పేరుతో దగ్గరైన మహమ్మద్ అలీ... ఆమెతో స్నేహం సాగించాడు. కొన్నాళ్ల తర్వాత మాయ మాటలు చెప్పి శారీరకంగా లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత నుంచి మహమ్మద్ అలీ కనిపించకుండా పోయాడు. విషయం తెలియని బాధితురాలు అతడికి ఫోన్ చేసింది. ఫోన్ స్విచ్ఛాఫ్ రావడం, అతను కనిపించకుండా పోవడంతో మోసపోయినట్లు గ్రహించింది. వెంటనే రాజేంద్ర నగర్ పోలీసులను ఆశ్రయించింది. తనను పెళ్లి చేసుకుంటానని మాయ మాటలు చెప్పి, తనపై అత్యాచారానికి పాల్పడినట్లు తెలిపింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మహమ్మద్ అలీ గురించి గాలిస్తున్నారు.