Hyderabad: కన్నకూతుర్లపైనే కన్నేసిన తండ్రి. భార్యను కొట్టి తరిమేసి దారుణం! భయంతో అరుపులు
Vanasthalipuram: పీకల దాకా తాగి ఇంటికొచ్చే తండ్రి కన్న కూతుర్లనే చెరిచేందుకు యత్నించేవాడు. అతని ప్రయత్నాలను భార్య గమనించి ఎప్పటికప్పుడు నిరోధించేది.
Vanasthalipuram News: వనస్థలిపురంలో అత్యంత అమానవీయ ఘటన చాలా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తాగుడుకు అలవాటు పడి ఏకంగా కన్న కూతుర్లపైనే కామ వాంఛ పెంచుకున్నాడు. పీకల దాకా తాగి ఇంటికొచ్చి కన్న కూతుర్లనే చెరిచేందుకు యత్నించేవాడు. అతని ప్రయత్నాలను భార్య గమనించి ఎప్పటికప్పుడు నిరోధించేది. కానీ, చివరికి ఆమెనే తప్పించి పశువులా ప్రవర్తించేందుకు సిద్ధమయ్యాడు. చివరికి స్థానికుల సాయంతో కటకటాల పాలయ్యాడు. హైదరాబాద్‌లోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చాలా ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది.
వనస్థలిపురం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. నల్గొండ జిల్లా దేవరకొండలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తి తన కుటుంబంతో సహా వనస్థలిపురంలోని ఓ కాలనీలో ఉంటున్నాడు. ఇతను ఆటో డ్రైవర్. ఇతనికి భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. వారిలో ముగ్గురు అమ్మాయిలు. ఇద్దరు అబ్బాయిలు. కూతుర్ల వయసు 20, 13, 11 ఏళ్లుగా ఉంది. ఇతను ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ.. తాగుడుకు విపరీతంగా బానిస అయ్యాడు. ఈ క్రమంలోనే అతడి కన్ను ఎదిగిన కూతుర్లపై పడింది. రోజూ మందు తాగి వచ్చి వారిని లైంగికంగా వేధించేవాడు. అయితే, భర్త ప్రవర్తనను గమనించిన భార్య తన కుమార్తెలను అతని నుంచి ఎప్పటికప్పుడు కాపాడుకునేది. భర్త పశువులా ప్రవర్తించినప్పుడల్లా అతడి ప్రయత్నాలకు భార్య ప్రతిఘటిస్తూ వచ్చేది.
అయితే, ఈ నెలలో భార్యాభర్తలు ఇద్దరికీ గొడవ జరిగింది. గత 17వ తేదీన భార్యను కొట్టి ఇంటి నుంచి పుట్టింటికి పంపించివేశాడు. శుక్రవారం రాత్రి బాగా తాగి ఇంటికి వచ్చి తొలుత తన 13 ఏళ్ల కుమార్తెపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. అది చూసిన మిగతా కుమార్తెలు భయంతో గట్టిగా అరవడంతో భయపడిన అతడు బయటికి వెళ్లిపోయాడు. వెళ్లేటప్పుడు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయాడు. ఆ తర్వాత ఆ అక్కాచెల్లెళ్లు తప్పించుకుని షీ టీమ్‌కు పోలీసులకు ఫోన్ చేశారు. 2 గంటలైనా వారి నుంచి స్పందన లేకపోవడంతో తమను పోలీసులు కాపాడలేరని భావించిన వారు ఆత్మహత్య చేసుకునేందుకు దగ్గర్లోని చెరువు దగ్గరికి వెళ్లారు.
అదే సమయంలో అక్కడే ఉన్న మహిళ వారిని కాపాడి ఓ ఎన్జీవో సంస్థ ఫోన్ నంబరు ఇచ్చింది. ఆ ముగ్గురూ ఆ సంస్థ ప్రతినిధికి ఫోన్ చేసి సాయం పొందారు. అతను పోలీసులకు చెప్పగా వెంటనే చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి రక్షించారు. ఆ పిల్లల తండ్రిని వెతికి పట్టుకొని అరెస్టు చేశారు. కూతుర్లపై లైంగిక దాడికి పాల్పడ్డాడన్న ఆరోపణలపై నిందితుడిపై పోక్సో చట్టం కింద కేసు పెట్టి, శనివారం రాత్రి రిమాండ్‌కు తరలించారు.