UP Crime News: భర్తను ముక్కలుగా కోసి ఇంట్లోనే పాతిపెట్టిన మహిళ- నాలుగేళ్ల తర్వాత వెలుగులోకి దారుణం!
UP Crime News: ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకుంది. అడ్డుగా వస్తున్నాడని అతడితో కలిసి భర్తను చంపి.. ముక్కలు చేసి అతడి ఇంట్లోనే పాతి పెట్టింది. నాలుగేళ్ల తర్వాత ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
UP Crime News: ఆదివారం నాడు ఓ యువకుడు తన ప్రియురాలిని ముక్కలుముక్కలుగా చేసి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో వేసిన సంఘటన వెలుగు చూసింది. ఇది విన్న వాళ్లు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఇప్పుడు మరో దారుణం బయటపడింది. ఓ భార్య తన భర్తను చంపి ముక్కలు చేసి అదే ఇంట్లో పాతి పెట్టింది.
పొరుగింటి వ్యక్తితోనే ఓ మహిళ వివాహేతర సంబంధం పెట్టుకుంది. అంతేనా ఆ విషయం భర్తకు తెలిసి అడ్డొస్తున్నాడని అతడిని అంతమొందించాలనుకుంది. ప్లాన్ ప్రకారం ప్రియుడతో కలిసి భర్తను హత్య చేసింది. ఆపై అతని మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి.. ప్రియుడి ఇంట్లోనే పాతి పెట్టింది. అయితే చాలా రోజుల వరకు ఈ విషయం ఎవరికీ తెలియకపోవడంతో.. హాయిగా జీవనం గడిపారు. కానీ నాలుగేళ్ల తర్వాత వారి పాపం పండి విషయం వెలుగులోకొచ్చింది.
భర్తను కిడ్నాప్ చేశారని నాటకం.. మరిదిపై అనుమానం నటన!
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘాజియాబాద్ ప్రాంతానికి చెందిన ఓ మహిళ తన భర్త చంద్ర వీర్‌ను ఎవరో కిడ్నాప్ చేశారంటూ 2018లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కేసును తప్పుదోవ పట్టించేందుకు తన మరిది అంటే తన భర్త సోదరుడే కిడ్నాప్ చేశాడేమో అంటూ పోలీసుల ముందు వాపోయింది. అన్ని కోణాల్లో దర్యాప్తు చేసినప్పటికీ అప్పుడు ఆధారాలు లభించలేదు. ఇటీవలే ఈ కేసుకు సంబంధించిన కొన్ని కీలక ఆధారాలు పోలీసుల కంటబడ్డాయి. వాటి ఆధారంగానే కేసును మరోసారి దర్యాప్తు చేశారు. ఈ క్రమంలోనే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. చంద్రవీర్ భార్య.. ఇంటి పక్కనే ఉన్న అరుణ్ అనే యువకుడితో వివాహేతర సంబంధం నడిపింది. అయితే ఈ విషయం చంద్రవీర్ కు తెలియగా.. అతను మందలించాడు. మానుకోమని ఇద్దరినీ హెచ్చరించాడు.
తుపాకీతో కాల్చి చంపి, గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికి..!
తన వివాహేతర సంబంధానికి భర్త అడ్డుగా ఉన్నాడని.. అతడిని ఎలాగైనా సరే అడ్డు తొలగించికోవాలనుకొని ఓ మాస్టర్ ప్లాన్ వేసింది. ఇద్దరూ కలసి అతడిని చంపాలనుకున్నారు. ప్లాన్ ప్రకారమే మహిళ, ఆమె ప్రియుడు అరుణ్ కలిసి 2018లోనే చంద్రవీర్ ను తుపాకీతో కాల్చి చంపారు. ఆపై మృతదేహాన్ని గొడ్డలితో ముక్కలు ముక్కలుగా నరికారు. అనంతరం అరుణ్ ఇంట్లోనే ఏడడుగుల గుంతలో పాతి పెట్టారు. పైన సిమెంట్ ఫ్లోరింగ్ వేసి, అరుణ్ ఎప్పటిలాగే నివసించాడు. తాజాగా పోలీసులు గుంతను తవ్వి.. అస్థి పంజరాన్ని వెలికి తీశారు. హత్యకు ఉపయోగించిన తుపాకీ, గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. పథకం ప్రకారమే కొన్ని రోజుల ముందుగానే గొయ్యిని సిద్ధం చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దుర్వాసన రాకుండా ఉండేందుకు గానూ.. దాన్ని లోతుగా తవ్వినట్లు చెప్పారు. ఈ మేరకు నిందితులను అరెస్ట్ చేసి ఎస్పీ దీక్షా శర్మ తెలిపారు.
ధిల్లీలో వెలుగు చూసిన దారుణం
దిల్లీలో అత్యంత దారుణ ఘటన జరిగింది. ఆరు నెలల క్రితం జరిగిన శ్రద్ధ అనే యువతి హత్య కేసును ఛేదించినట్లు పోలీసులు ప్రకటించారు. ఈ కేసులో అఫ్తాబ్ అనే వ్యక్తిని అరెస్టు చేశామని దిల్లీ పోలీసులు సోమవారం తెలిపారు. అయితే ఈ కేసు దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి.
నరికేసి
నిందితుడు తనతో సహజీవనం చేసిన శ్రద్ధ అనే యువతిని చంపేసి, మృతదేహాన్ని 35 ముక్కలుగా నరికి నగరంలోని వివిధ ప్రదేశాలలో వాటిని పారేశాడని దర్యాప్తులో తేలింది.
ఇలా మొదలు
అఫ్తాబ్, శ్రద్ధ.. ముంబయిలోని ఓ కాల్ సెంటర్‌లో పనిచేశారు. అక్కడ వారు మొదట కలుసుకున్నారు. తరువాత డేటింగ్ ప్రారంభించారు. ఆమె కుటుంబం వారి సంబంధాన్ని ఆమోదించకపోవడంతో ఈ జంట దిల్లీకి పారిపోయి లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో జీవిస్తున్నారు.
అయితే శ్రద్ధా తల్లిదండ్రులు మాత్రం.. ఆమె సోషల్ మీడియా పోస్ట్‌ల ద్వారా తమ కుమార్తె యోగక్షేమాలను తెలుసుకుంటున్నారు. కానీ చాలా కాలంగా ఆమె సోషల్ మీడియా ఖాతాలో ఎటువంటి అప్‌డేట్ రాకపోవడంతో శ్రద్ధ తండ్రి దిల్లీకి వచ్చారు. తన కూతురు వివరాలు తెలియకపోవడంతో ఆమె తండ్రి దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అఫ్తాబ్‌పై అనుమానం
తన కుమార్తె ముంబయిలోని కాల్ సెంటర్‌లో పనిచేసేదని, అక్కడ అఫ్తాబ్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడిందని, వారి స్నేహం సన్నిహితంగా మారిందని శ్రద్ధ తండ్రి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిద్దరూ ఒకరినొకరు ఇష్టపడటం ప్రారంభించారని, అయితే కుటుంబం దానిని అంగీకరించలేదని శ్రద్ధా తండ్రి ఆరోపించారు. దీంతో అతని కూతురు, అఫ్తాబ్ ముంబయి వదిలి దిల్లీకి వచ్చి ఇక్కడి ఛతర్‌పుర్ ప్రాంతంలో ఉంటున్నట్లు తెలిపారు. ఆయన ఫిర్యాదు మేరకు దిల్లీ పోలీసులు దర్యాప్తు ప్రారంభించి నిఘా ద్వారా అఫ్తాబ్‌ను పట్టుకున్నారు.
అఫ్తాబ్‌ను ప్రశ్నించగా, అమ్మాయి తనను పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేస్తోందని, దీని వల్ల వారి మధ్య తరచూ గొడవలు జరగినట్లు తెలిపాడు. మే నెలలో శ్రద్ధాను దారుణంగా చంపి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా నరికి.. నగరంలోని పలు ప్రాంతాల్లో పారేసినట్లు ఒప్పుకున్నాడు.