Fake Police: తెలంగాణలో మరో ‘దొంగ’ పోలీస్ - మొబైల్ చోరీ చేస్తూ అడ్డంగా దొరికి!
Telangana News: ఖాకీ డ్రెస్ వేసుకుని కొందరు సెటిల్మెంట్ చేస్తుంటే, మరికొందరు పోలీసులా చెలామణి అయి నగదు వసూలు వేస్తున్నారు. నిర్మల్ జిల్లాలో ఓ దొంగ పోలీస్ చోరీ చేస్తూ అడ్డంగా దొరికాడు.
Fake Police arrested at Kadem in Nirmal District: నిర్మల్: తెలంగాణలో ఇటీవల ఓ లేడీ నకిలీ ఎస్సైని గుర్తించారు. యూనిఫాం ధరించి తిరుగుతూ ఏడాదిన్నర నుంచి ఆమె స్థానికులతో పాటు బయటి వ్యక్తుల్ని మోసం చేసిందని అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో తాజాగా మరో ‘దొంగ’ పోలీస్ దొరికాడు. ప్రజలకు రక్షణ కల్పిస్తున్న పోలీసుల ఖాకీ డ్రెస్ ధరించి ఓ యువకుడు హల్ చల్ చేస్తు్న్నాడు.
పోలీస్ డ్రెస్ లో హల్‌చల్ చేసిన యువకుడు
రాజు అనే యువకుడు నిర్మల్ జిల్లా కడెం మండలంలో పోలీసు డ్రెస్ వేసుకొని దొంగతనాలకు పాల్పడుతున్నాడు. తాజాగా కరీంనగర్ కు చెందిన ఓ వ్యక్తి మొబైల్ ఫోన్ చోరీ చేశాడు. అనంతరం లక్కీ దాబాలో చోరీకి యత్నించగా, గ్రామస్తులు రాజును పట్టుకున్నారు. ఖాకీ డ్రెస్ వేసుకుని ఈ తిక్క పనులు చేస్తుండటంతో అనుమానం వచ్చి పట్టుకుని కట్టేశారు. ఫోన్లు చోరీ చేసి సెకండ్ హ్యాండ్ రేట్లకు విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నాడు.
నిందితుడిని పట్టుకున్న స్థానికులు ప్రశ్నించగా తన పేరు అలుసాని రాజు అని చెప్పాడు. తన వయసు 25 అని, తనకు ఖాకీ డ్రెస్ సోదరుడు ఇచ్చాడని తెలిపాడు. రాజు సోదరుడు కరీంనగర్ జిల్లాలో కానిస్టేబుల్ గా విధులు నిర్వర్తిస్తున్నాడని నిందితుడు చెప్పాడు. కానిస్టేబుల్ పోన్ నెంబర్ చెప్పాలని ప్రశ్నించగా నోరు విప్పడం లేదు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా వారు అక్కడికి చేరుకున్నారు. నిందితుడు రాజును పోలీస్ వాహనంలో ఎక్కించగా.. ఖాకీ డ్రెస్సులో పోలీసుల్లో ఒకడిగా కలిసి పోయాడంటూ అంతా నవ్వుకున్నారు. నిన్న ఓ యువకుడు కొత్త ఫోన్ కొనుగోలు చేయగా, అది చోరీ చేశాడు. మరో ఫోన్ చోరీకి యత్నించగా నిందితుడు రాజు అడ్డంగా దొరికిపోయాడు. నిందితుడి వద్ద నుంచి రికవరీ చేసుకున్న మొబైల్‌ను పోగొట్టుకున్న యువకుడికి ఇచ్చివేస్తామని పోలీసులు తెలిపారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వారి గురించి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలకు సూచించారు.