Rajamahendravaram News : పదో తరగతి చదివి ఐపీఎస్ అధికారి అయిపోయాడు - రిసార్ట్ లో సూట్ రూం బుక్ చేసి బుక్కాయ్యాడు
Rajamahendravaram News: చదివింది పదో తరగతి అయినా ఐపీఎస్ అధికారిలా మారిపోయాడు. ఐపీఎస్ అధికారిలా డ్రెస్ వేసుకుని, పలువురు ఐపీఎస్ అధికారుల పేర్లు చెప్పి వసూళ్ల పర్వం మొదలుపెట్టాడు.
![Rajamahendravaram News : పదో తరగతి చదివి ఐపీఎస్ అధికారి అయిపోయాడు - రిసార్ట్ లో సూట్ రూం బుక్ చేసి బుక్కాయ్యాడు Rajamahendravaram Fake IPS officer arrested cheated locals upto RS 70 lakh Rajamahendravaram News : పదో తరగతి చదివి ఐపీఎస్ అధికారి అయిపోయాడు - రిసార్ట్ లో సూట్ రూం బుక్ చేసి బుక్కాయ్యాడు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/17/430a3b85a238558e99e00816046bbffd_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Rajamahendravaram News: చదివింది పదో తరగతి. కానీ ఐపీఎస్ అధికారి(IPS Officer) అయిపోయాడు. రిసార్ట్ లో మకాం వేసి సెటిల్ మెంట్స్ చేస్తున్నాడు. అతని హడావుడి చూసి హోటల్(Hotel) సిబ్బందికి అనుమానం వచ్చింది. పోలీసులకు సమాచారం ఇస్తే అసలు విషయం బయటపడింది. అతడిపై నిఘా పెట్టిన పోలీసులకు షాకింగ్ విషయాలు తెలిశాయి. సెటిల్ మెంట్స్ చేస్తూ రూ.70 లక్షలు పైగా వసూలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. అసలు విషయం బయటకు రావడంతో బాధితులు మోసం పోయామని పోలీసులను ఆశ్రయిస్తున్నారు.
నకిలీ ఐపీఎస్ అధికారి అరెస్టు
నకిలీ పోలీస్ అధికారిగా చలామణీ అవుతూ ఉద్యోగాలు ఇప్పిస్తానని అమాయకులను మోసం చేస్తున్న కేటుగాడు రాజమహేంద్రవరం(Rajamahendravaram) అర్బన్ జిల్లా పోలీసులకు అడ్డంగా బుక్కయ్యాడు. అర్బన్ ఎస్పీ ఐశ్వర్య రస్తోగి(SP Aishwarya Rastogi) మీడియాకు ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. నిందితుడు నుంచి రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రతో ఉన్న నకిలీ లెటర్ హెడ్స్, రూ.10.90 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడు బత్తుల శ్రీనివాస్ నల్లగొండ జిల్లా మఠంపల్లి గ్రామానికి చెందిన వ్యక్తి. అతడు పదో తరగతి వరకు చదువుకున్నాడు. గత నెల 27 నుంచి రాజమహేంద్రవరం నదీ తీరంలోని రిసార్టులో సూటు రూం అద్దెకు తీసుకున్నాడు. తానో ఐపీఎస్(IPS) అధికారినని పరిచయం చేసుకున్నాడు. అతడిని కలిసేందుకు పలువురు వస్తుండడంతో హడావుడిని చూసి హోటల్ సిబ్బంది స్థానిక రెండో పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. తమ శాఖకు చెందిన ఐపీఎస్ అధికారి రిసార్టులో ఉండడంపై స్థానిక సీఐ విజయ్ కుమార్ ఆరా తీశారు.
రూ.70 లక్షలు పైగా వసూలు
సీఐ నిఘా పెట్టి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. బుధవారం శ్రీనివాస్ ను అదుపులోకి తీసుకుని విచారించారు. నిందితుడు ఐపీఎస్ అధికారిగా చెప్పుకుంటూ నేరాలను పాల్పడినట్లు అంగీకరించాడు. అతని వద్ద మూడు జతల ఐపీఎస్ యూనిఫాం(IPS Uniform), హోదా సూచించే స్టార్లు, మూడు సెల్ఫోన్లు, ల్యాప్ టాప్, పోలీస్ క్యాప్స్ ఉన్నాయి. ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన అధికారుల వివరాలు సేకరించాడు. వారికి ఇతను తెలియక పోయినా పేర్లు చెబుతూ నిరుద్యోగులను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసినట్లు అంగీకరించాడు. రూ.70 లక్షలు పైనే వసూలు చేసి ఉంటాడని పోలీసులు చెబుతున్నారు. పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులోను, రాజమహేంద్రవరంలోని జాంపేట ప్రాంతంలోని కొందరు ఇతని చేతిలో మోసపోయారు. ఇతనిపై రాష్ట్ర వ్యాప్తంగా తొమ్మిది కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. ఇతను వాడుతున్న ఇన్నోవా వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)