Odisha News: వ్యక్తిని హత్య చేసి 12 ముక్కలుగా నరికిన దుండగులు, ఆపై కవర్‌లో కుక్కి దారుణం
Odisha News: ఒడిశాలో ఓ యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హత్య చేశారు. 12 ముక్కలుగా నరికి పాలథీన్ కవర్లో కుక్కారు.
Odisha News: ఒడిశాలో దారుణం జరిగింది. ఓ యువకుడిని హత్య చేసిన దుండగులు.. అతడిని చంపిన ఆధారాలు ధ్వంసం చేసేందుకు కిరాతకంగా ప్రవర్తించారు. మృతదేహాన్ని మాయం చేస్తే ఆధారాలు లేకుండా చేసినట్లు అవుతుందని భావించి డెడ్ బాడీని 12 ముక్కలుగా నరికారు. ఆ శరీర భాగాలను ఓ పాలథీన్ కవర్ లో కుక్కి.. మృతుడి నివాసంలోనే ఉంచి వారు పారిపోయారు. ఒడిశాలోని బోలింగర్ జిల్లాలో ఈ దారుణ ఘటన వెలుగుచూసింది. ఈ హత్య ఘటనకు సంబంధించి వివరాలను పోలీసులు బుధవారం మీడియాకు వెల్లడించారు.
తల్లిదండ్రులకు కొట్టి ఒంటరిగా ఇంట్లో ఉంటున్న రింకు
బోలింగర్ జిల్లాలోని సలేపలి ప్రాంతంలో రింకు అనే వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు కిరాతకంగా హత్య చేశారు. సలేపలిలోని ఓ ఇంట్లో రింకూ తన తల్లిదండ్రులు, తమ్ముడితో కలిసి నివాసం ఉంటున్నాడు. 20 రోజుల క్రితం కుటుంబ కలహాల కారణంగా రింకూ తల్లిదండ్రులపై దాడికి దిగాడు. వారిని విచక్షణా రహితంగా కొట్టాడు. రింకు దాడిలో తీవ్రంగా గాయపడిన వారిని విషమ పరిస్థితుల్లో స్థానిక దవాఖానాకు తరలించి చికిత్స అందిస్తున్నారు. రింకు తమ్ముడు తల్లిదండ్రులు ఉన్న ఆస్పత్రి వద్దే వారికి తోడుగా ఉంటూ సహాయం చేస్తున్నాడు. ఇంటి వద్ద రింకు ఒక్కడే ఉంటున్నాడు. బుధవారం రింకు ఇంట్లో నుండి భరించలేని దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. సలేపలికి చేరుకున్న పోలీసులు రింకు ఇంటికి తాళం వేసి ఉండటాన్ని గమనించారు. తాళాన్ని పగులగొట్టి లోపలికి వెళ్లారు.
కుళ్లిపోయిన స్థితిలో రింకు శరీర భాగాలు
ఇంట్లో ఉన్న పాలథీన్ కవర్లలో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న శరీర భాగాలను గుర్తించారు. వాటిని స్వాధీనం చేసుకుని ల్యాబ్ కు తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. అనంతరం ఆ శరీర భాగాలు రింకువేనని నిర్ధారించారు. రింకు ను హత్య చేసిన గుర్తు తెలియని వ్యక్తులు ఆధారాలు చెరిపేసేందుకే ఇలా మృతదేహాన్ని ముక్కలు ముక్కలుగా నరికి కవర్లలో కుక్కినట్లు పోలీసులు తేల్చారు. రింకు హత్యకు చాలా పదునైన వస్తువులు ఉపయోగించారని ఫోరెన్సిక్ బృందం తేల్చింది. ముందుగా రింకును చంపేసి అనంతరం మృత దేహాన్ని 12 ముక్కలుగా నరికినట్లు స్పష్టం చేశారు. అంతకుముందు రింకు తల్లిదండ్రులను కొట్టి ఆస్పత్రి పాలు చేయడంతో రింకు హత్యకూ వారికీ ఏదైనా సంబంధం ఉన్నా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు మీడియాకు తెలిపారు. రింకు సోదరుడి పాత్రపైనా దర్యాప్తు చేయనున్నట్లు వెల్లడించారు. ఈ హత్య ఘటన వెనక ఎవరు ఉన్నా వారిని పట్టుకుని చట్ట పరంగా శిక్షిస్తామని పోలీసులు తెలిపారు. అన్ని కోణాల్లో విచారించి సాంకేతిక ఆధారాల సాయంతో త్వరలోనే హంతకులను పట్టుకుంటామన్నారు. ఈ హత్యోదంతంపై పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేపడతామని అధికారులు వెల్లడించారు. పక్కా పథకం ప్రకారమే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ దారుణ ఘటన వెలుగుచూడటంతో ఇది ఒడిశా రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.