Mulugu News: పురుషుడికి శీల పరీక్ష- నిప్పుల్లో కాలుతున్న గడ్డపార తీసినా ఆగని వేధింపులు!
Mulugu News: పురుషుడు శీలానికి అగ్నిపరీక్ష పెట్టారు కులపెద్దలు. నిప్పుల్లో కాలుతున్న గడ్డపారను చేతులతో తీయిచారు. అయినా నువ్వు తప్పు చేశావంటూ వేధించారు. బాధితుడి వద్ద నుంచి 11 లక్షలు వసూలు చేశారు.
Mulugu News: గ్రామాల్లో పంచాయీతీల పేరుతో కొందరు దుర్మార్గంగా ప్రవరిస్తుంటారు. ఇలాంటి తీర్పులు వేర్వేరు రాష్ట్రాల్లో చూస్తుంటాం. అప్పుడప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా కొన్ని వింత తీర్పులు గురించి వింటూ ఉంటాం. ఇప్పుడు చెప్పబోయేది కూడా అలాంటిదే.
ములుగు జిల్లాలో ఓ వ్యక్తికి గ్రామ పెద్దలు శీల పరీక్ష పెట్టారు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే ఆరోపణలతో కుల పెద్దలు ఈ తీర్పు చెప్పారు. అందులో ఫెయిల్ అయ్యాడని అతనితో జరిమానా కూడా కట్టించారు. నిప్పుల కొలిమిలో మండుతున్న గడ్డపారను చేతులతో తీసుకొని... మరో మహిళతో తనకు సంబంధం లేదని నిరూపించుకున్నాడు. ఏం కాకుండ బయటకు వచ్చిన అతడిని మాత్రం నిందితుడుగానే చూశారు. అగ్ని పరీక్షలో అతను నెగ్గినప్పటికీ కుల పెద్దలు అంగీకరించలేదు. ఆ మహిళతో సంబంధం పెట్టుకున్నావ్, తప్పు చేశావ్.. ఒప్పుకో అంటూ వేధించారు. అగ్నిపరీక్ష ఎదుర్కొన్న వ్యక్తి భార్య పోలీసులను ఆశ్రయించడంతో ములుగు జిల్లాలో మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
ఇరు వర్గాల నుంచి పదకొండు లక్షల చొప్పున డబ్బులు వసూలు
ములుగు మండలం బంజరు పల్లికి చెందిన జగన్నాథం గంగాధర్ కు పెళ్లి అయింది. భార్యా పిల్లలతో కలిసి హాయిగా గ్రామంలోనే జీవిస్తున్నాడు. అయిేత కొంత కాలంగా అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి... తన భార్యతో గంగాధర్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడంటూ కులానికి చెందిన పెద్ద మనుషులను ఆశ్రయించాడు. మీరే ఎలాగైన న్యాయం చేయాలంటూ వారిని బతిమాలాడు.
గాంగాధర్ పై లేనిపోని మాటలు చెప్పి ఫిర్యాదు చేశాడా వ్యక్తి. దీంతో గ్రామంలో పంచాయితీ పెట్టిన పెద్ద మనుషులు గంగాధర్ చెబుతున్నది వినకుండానే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడారు. తాను తప్పు చేయలేదని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకుండా తప్పు ఒప్పుకొమ్మని వేధించారు. కానీ గంగాధర్ మాత్రం అస్సలే ఒప్పుకోలేదు. అయితే చాలా రోజులుగా ఈ విషయమై పంచాయితీ నడుస్తుండగా.. పంచాయితీ నిర్వాహణకు ఇరు వర్గాల నుంచి రూ.11 లక్షల చొప్పున నగదును డిపాజిట్‌గా తీసుకున్నారు.
తగ్గకపోవడం.. గంగాధర్ తప్పును చేయలేదని వాదించడంతో ఇటీవల ఆటవిక మార్గంలో నిర్ణయం తీసుకున్నారు. గంగాధర్ శీలానికి అగ్ని పరీక్ష పెట్టారు. నిప్పుల్లో కణకణా మండుతున్న గడ్డపారను చేతులతో తీసి పట్టుకొని తన నిజాయతీని నిరూపించు కోవాలని అన్నారు. దీనికి గంగాధర్ కూడా ఒప్పుకున్నాడు. అలాగైనా వారంతా తాను తప్పు చేయలేదని తెలుసుకుంటారని... ప్రాణాలకు తెగించి ఒప్పుకున్నాడు. దీంతో ఫిబ్రవరి 25వ తేదీన ఆ తీర్పును అమలు చేశారు.
స్నానం చేసి తడి బట్టలతో.. ప్రదక్షిణ చేసి మరీ అగ్నిపరీక్ష
దేవుడి ముందు అగ్ని గుండాలు తొక్కినప్పుడు చేసినట్లుగా కట్టెలను పేర్చి నిప్పు పెట్టారు. వాటిలోనే గడ్డపారను వేసి ఎర్రగా కాల్చారు. మంట మొత్తం అగ్ని గుండంగా మారిన తర్వాత బాధితుడు గంగాధర్ ను పక్కనే ఉన్న చెరువులో స్నానం చేసి రమ్మన్నారు. తడిబట్టలతో వచ్చిన అతనితో ఆ అగ్నిగుండం చుట్టూ మూడు ప్రదక్షిణలు చేయించారు. ఆపై అందరూ చూస్తుండగా.. కాలుతున్న గడ్డపారను చేతులతో తీయించారు. చేతుల్లోకి తీసుకున్న గంగాధర్ దాన్ని పడేశాడు. చేతులు కాలకపోవడంతో గంగాధర్ అగ్నిపరీక్షలో నెగ్గాడు.
కానీ కుల పెద్దలు మాత్రం తప్పు ఒప్పుకోవాలంటూ వేధిస్తూనే ఉన్నారు. తరచూ నీవు తప్పు చేశావంటూ ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో విసిగి వేసారిన గంగాధర్, ఆయన భార్య పోలీసులను ఆస్రయించారు. తాము డిపాజిట్‌గా ఇచ్చిన సొమ్ములో రూ.6 లక్షలను ఇప్పటికే ఖర్చు చేసుకొని.. అగ్ని పరీక్ష కూడా పెట్టి అందులో నెగ్గినా తమను వేధిస్తున్నారని గంగాధర్ దంపతులు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఎట్టి పరిస్థితులను నిందలు వేసి, డబ్బులు వసూలు చేసి, ఇలాంటి అటావిక చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రస్తుతం బాధితుడు ఆరోగ్యంగానే ఉన్నప్పటికీ మానసికంగా చాలా వేధనకు గురవుతున్నాడని వివరించారు.