Crime News: ఏపీలో మరో దారుణం - గ్యాస్ డెలివరీ బాయ్ ఇంట్లో అనుమానాస్పదంగా మైనర్ మృతదేహం
Andhrapradesh News: నంద్యాల, విజయనగరం జిల్లాలోని ఘటనలు మరువక ముందే ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. గుంటూరు జిల్లా కొత్తరెడ్డిపాలేనికి చెందిన ఓ మైనర్ బాలిక ఓ ఇంట్లో అనుమానాస్పదంగా మృతి చెందింది.
Minor Suspicious Death In Guntur District: ఏపీలో మరో దారుణం వెలుగుచూసింది. గుంటూరు (Guntur) జిల్లా చేబ్రోలులోని (Chebrolu) కొత్తరెడ్డిపాలేనికి చెందిన మైనర్ (13) అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. ప్రభుత్వ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న బాలిక.. రోజూలానే సోమవారం ఉదయం తన అన్నయ్యతో కలిసి స్కూలుకు వెళ్లింది. బడి ముగియగానే బాలుడొక్కడే ఇంటికి తిరిగివచ్చాడు. చెల్లి ఏదని తల్లి ప్రశ్నించటంతో వెంటనే అన్న పాఠశాలకు వచ్చి ఉపాధ్యాయులను అడిగాడు. ఒంట్లో బాగోలేదని ఆమె మధ్యాహ్నం వెళ్లిపోయినట్లు వారు చెప్పారు. దీంతో తల్లి, కుమారుడు, బంధువులు కలిసి ఊళ్లో వెతికారు. ఈ క్రమంలో గ్యాస్ డెలివరీ బాయ్‌గా చేస్తోన్న నాగరాజు ఇంటి వద్ద చెల్లెలి చెప్పులు ఉండటాన్ని బాలిక అన్న గుర్తించాడు. కిటికీలో నుంచి చూస్తే చెల్లెలు మంచంపై విగతజీవిగా కనిపించింది. ఆమె మెడపై గాయాలున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు చెప్పడంతో వారు ఇంటి తాళం పగలగొట్టి, బాలికను బయటకు తీసుకొచ్చారు. అనంతరం గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సమాచారం అందుకున్న పోలీసులు దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పరారీలో నిందితుడు..
బాలికను నాగరాజు హతమార్చి ఉంటాడని ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు. నిందితున్ని కఠినంగా శిక్షించాలని.. అంతవరకూ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించబోమని ఆందోళనకు దిగారు. నాగరాజుకు పెళ్లైనా.. మూడేళ్లుగా ఇంట్లో ఒంటరిగానే ఉంటున్నాడని స్థానికులు తెలిపారు. వేరే ప్రాంతం నుంచి వచ్చి కొత్తరెడ్డిపాలెంలో గ్యాస్ గోడౌన్‌లో పని చేస్తున్నట్లు చెప్పారు. కూల్ డ్రింక్‌లో మత్తు మందు కలిపి బాలికను అపహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు. బాలికను ఒంటరిగా బయటకు పంపిన ఉపాధ్యాయులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం నిందితుడు పరారీలో ఉండగా.. పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.
కాగా, గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో వరుస ఘటనలు ఆందోళనలు కలిగిస్తున్నాయి. వారం రోజుల క్రితం నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం మచ్చుమర్రి పరిధిలోని ఎల్లాల గ్రామానికి చెందిన 8 ఏళ్ల బాలికపై ముగ్గురు మైనర్లు అత్యాచారానికి పాల్పడి మృతదేహాన్ని కాలువలో పడేశారు. అయితే, నిందితులు పూటకో మాట చెబుతుండడంతో బాలిక ఆచూకీ ఇంతవరకూ లభించలేదు. బాలిక మృతదేహాన్ని కనుగొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, పోలీసులతో గాలింపు కొనసాగుతోంది. అటు, విజయనగరం జిల్లా రామభద్రాపురం మండలం జీలుగువలసలో ఊయలలో ఉన్న 6 నెలల పసికందుపై వరుసకు తాత అయ్యే వ్యక్తి దారుణానికి ఒడిగట్టాడు. నిందితున్ని అరెస్ట్ చేసిన పోలీసులు పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అలాగే, తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం ఏర్పేడు మండలం మూలకండ్రిగ గ్రామంలోనూ బాలికపై దారుణం ఆలస్యంగా వెలుగుచూసింది. తల్లిదండ్రులు పొలం పనులకు వెళ్లగా ఇంట్లో ఒంటరిగా ఉన్న 6 ఏళ్ల బాలికపై చాక్లెట్ ఆశ చూపి 65 ఏళ్ల వృద్ధుడు దారుణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుని కోసం గాలిస్తున్నారు.
బాధిక కుటుంబాలకు అండగా ప్రభుత్వం
ఆడపిల్లల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తే అదే చివరి రోజు అయ్యేలా కఠిన చర్యలు తీసుకుంటామని హోంమంత్రి అనిత హెచ్చరించారు. మచ్చుమర్రిలో బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించాలని సీఎం ఆదేశించినట్లు చెప్పారు. విజయనగరం జిల్లాలో అత్యాచారానికి గురైన చిన్నారి పేరుతో రూ.5 లక్షలు ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు వెల్లడించారు. ప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేసి నిందితులకు వెంటనే శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.