Kurnool News: పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన సంతానం పండగ పూట మృతి - ప్రాణం తీసిన డబ్బా !
Kurnool News: పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బాబు పండుగ రోజే చనిపోయాడు. నోట్లో మెంతో ప్లస్ బామ్ డబ్బా ఇరుక్కొని ఊపిరాడక ప్రాణాలు కోల్పోయాడు. ఇది చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.
Kurnool News: పాపం పెళ్లైన 20 ఏళ్ల వరకు వారికి సంతానం కల్గలేదు. ఇందుకోసం మొక్కని దేవుడు, తొక్కని ఆస్పత్రి గడపా లేదు. ఏ దేవుడి కరుణో తెలియదు కానీ వారికి పది నెలల క్రితమే సంతానం కల్గింది. ఇక ఓ బిడ్డకు జన్మనివ్వబోతున్నట్లు తెలుసుకున్నప్పటి నుంచి ఆమెపై తీసుకున్న జాగ్రత్తలు అన్నీ ఇన్నీ కాదు. బిడ్డ పుట్టాక కూడా బిడ్డపై అమితమైన ప్రేమను చూపిస్తూ.. ఆనందంగా గడుపుతున్నారు. ఈ క్రమంలోనే నూతన సంవత్సర వేడుకలను కూడా ఈ ఏడు సంతోషంగా జరుపుకోవాలనుకున్నారు. కానీ వారి కోరిక ఎంతో సేపు నిలవలేదు. పండుగ పూటే ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఇరవై ఏళ్ల తర్వాత పుట్టిన ఏకైక సంతానం తమకు దక్కకుండా పోయింది.
అసలేం జరిగిందంటే..?
కర్నూలు జిల్లా సి,బెళగల్ మండలం చింతమాను పల్లె గ్రామంలో కొత్త సంవత్సరం రోజున తీవ్ర విషాధం నెలకొంది. గ్రామానికి చెందిన నల్లమ్మ, సువర్ణ దంపతుల పది నెలల కుమారుడు ఉన్నాడు. ఆదివారం రోజు అతడు మెంతో ప్లస్ బామ్ డబ్బాతో ఆడుకుంటూ దాన్ని నోట్లో పెట్టుకున్నాడు. పొరపాటున మింగేయగా.. అది గొంతులో ఇరుక్కుపోయింది. విషయం గుర్తించిన తల్లిదండ్రులు డబ్బాను బయటకు తీసేందుకు చాలా ప్రయత్నించారు. అయినా లాభం లేకపోవడంతో ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. బాలుడు మృతి చెందాడు. విషయం గుర్తించిన కుటుంబ సభ్యులు బాబు మృతితో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాబు గొంతులో డబ్బా ఇరుక్కోవడంతో ఊపిరాడకనే మృతి చెందినట్లు వైద్యులు నిర్దారించారు. ఎన్నో దేవుళ్లకు పూజలు చేయగా, మరెన్నో ఆస్పత్రుల చుట్టూ తిరగ్గా.. పెళ్లైన 20 ఏళ్లకు పుట్టిన బిడ్డ ఇలా నూతన సంవత్సరం రోజే చనిపోవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. తల్లిదండ్రుల ఏడుస్తున్న తీరు చూసిన ప్రతీ ఒక్కరూ కన్నీరుపెడుతున్నారు.
ఇటీవలే కరెంటు షాకుతో మూడేళ్ల బాలుడు మృతి
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి మండలం పైడిమెట్ట గ్రామానికి జొన్నకూటి వినోద్ లారీ డ్రైవర్, భార్య చాందిని గృహిణి. వీరి పెద్ద కుమారుడు అక్షిత్ యూకేజీ చదువుతున్నాడు. రెండో కుమారుడు దర్శిత్ కు మూడేళ్లు. నవంబర్ 12వ తేదీన తల్లి భవనంపై దుస్తులు ఆరేయడానికి తల్లి వెళ్లగా.. ఆమెతో పాటే దర్శిత్ కూడా వెళ్లాడు. ఆమె పనిలో నిమగ్నం అవ్వగా.. చిన్నారి అక్కడున్న 33 కేవీ విద్యుత్తు తీగల సమీపానికి వెళ్లి విద్యుదాఘాతానికి గురై స్పృహ కోల్పోయాడు. అప్పటి వరకు ఆడుకుంటున్న కుమారుడు పడిపోవడంతో చాందిని ఆందోళనకు గురైంది. హుటాహుటిన స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్సకు కాకినాడలోని జీజీహెచ్ కు తీసుకెళ్లారు. నాలుగు రోజుల చికిత్స అనంతరం ఇన్ ఫెక్షన్ సోకడంతో బాలుడికి రెండు కాళ్లూ మోకాళ్ల కింది వరకు తొలగించారు వైద్యులు.
బాలుడికి మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తూ ఆరోగ్యంగా కోలుకునేలా వైద్యులు విశేష కృషి చేశారు. అయితే బాలుడి ఆరోగ్యం కొంతమేర మెరుగవుతుందన్న తరుణంలో బుధవారం అర్ధరాత్రి సమయంలో బాలుడు శ్వాస పీల్చుకోవడం కష్టతరం అవడంతో ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. దీంతో వైద్యులు హుటాహుటిన సర్జికల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి ప్రత్యేక వైద్య చికిత్స అందించారు. బాలుడి ఆరోగ్య పరిస్థితి మరింత విషమించడంతో గురువారం రాత్రి రెస్పిరేటరీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కు తరలించి వెంటిలేటర్ పై చికిత్స అందిచారు. కానీ అప్పటికీ సమస్య మరింత ఎక్కువ కావడంతో బాలుడు మృతి చెందాడు.