కన్నతండ్రిని చంపిన కూతురు! 'దృశ్యం' చూసి ఎలా ఎస్కేప్ అవ్వాలో ప్లాన్, తల్లి నుంచి కూడా సపోర్ట్
Crime News: ప్రేమ పెళ్లికి అడ్డుగా ఉన్నాడని కన్న తండ్రిని చంపించింది ఓ యువతి. ఈ హత్యోదంతానికి తన తల్లి సహకరించింది.
Crime News: కన్న బిడ్డలను సరైన దారిలో పెడతారు తల్లిదండ్రులు. అమ్మ ప్రేమను నేర్పితే, నాన్న విలువలను, బాధ్యతను నేర్పిస్తాడని అంటారు. తెలిసీ, తెలియని వయస్సులో ఏదైనా తప్పుడు మార్గంలో వెళితే.. మంచి ఏదో చెడు ఏదో చెబుతారు. ఉజ్వల భవిష్యత్తు గురించి మార్గనిర్దేశం చేస్తారు. చాలా మందికి అమ్మ ప్రేమ తెలుస్తుంది కానీ, నాన్న ప్రేమ గురించి తెలియదు. పెళ్లి విషయంలో అయితే తండ్రులు చేసే కృషి అంతా ఇంతా కాదు. ముఖ్యంగా ఆడ పిల్లల తండ్రులు అయితే ఒకటికి పది సార్లు అబ్బాయి గురించి వారి కుటుంబ నేపథ్యం, ఆస్తిపాస్తులు సహా ఇలా చాలా విషయాలు గురించి ఆలోచిస్తారు. ప్రేమ పెళ్లి చేసుకోవాలనుకునే బిడ్డలను మంచి ఉద్దేశంతో కొద్దిగా గట్టి స్వరంతో వారికి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తారు. ప్రేమ పెళ్లి కాకుండా వారు చూసిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందమయంగా ఉంటుందని చెబుతారు.
హత్య చేసిన తల్లీకూతుళ్లు
కర్ణాటకలో ఓ యువతి ప్రేమ గురించి తన తండ్రికి తెలియగా.. ఆయన ఇలాగే తన బిడ్డకు చెప్పాడు. ప్రేమ పెళ్లి వద్దు బిడ్డా.. మేం చూసిన వారిని పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుంది. నువ్వు సుఖంగా బతుకుతావు అని ఒకటికి రెండు సార్లు చెప్పాడు. కానీ ఆ యువతి తన తండ్రి ప్రేమను అర్థం చేసుకోలేదు. తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడు అనుకుంది. ఆ అడ్డును తొలగించుకోవాలని ప్లాన్ వేసింది. తన తల్లికి చెప్పగా ఆమె కూడా సరే అంది. ఇద్దరూ కలిసి ఆ తండ్రిని అంతమొందించారు.
అది కర్ణాటక రాష్ట్రం బెళగావి. నగరానికి చెందిన ప్రముఖ భూవ్యాపారి సుధీర్ కాంబళె ఇటీవల హత్యకు గురయ్యారు. గతంలో ఆయన దుబాయ్ లో పని చేసేవారు. కరోనా సమయంలో బెళగావిలోని క్యాంప్ ఏరియాలో ఉంటూ రియల్ ఎస్టేట్ లోకి దిగాడు. సుధీర భార్య రోహిణిలకు స్నేహ అనే కుమార్తె ఉంది. స్నేహ మహారాష్ట్రలోని పుణెలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సు చదువుతున్నప్పుడు అక్షయ్ విఠకర్ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది. స్నేహి నిత్యం విపరీతంగా ఫోన్ మాట్లాడుతుండేది. అది గమనించిన తండ్రి సుధీర్.. ప్రేమల జోలికి వెళ్లొద్దు, చక్కగా పెద్దలు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకుంటే జీవితం ఆనందంగా ఉంటుందని చెప్పి చూశాడు. అయినా స్నేహలో ఎలాంటి మార్పు లేదు. అలా పలుమార్లు సుధీర్ స్నేహకు ప్రేమ పూర్వకంగా చెప్పాడు. కానీ తండ్రి ప్రేమను స్నేహ అర్థం చేసుకోలేదు. తన ప్రేమకు తండ్రి అడ్డుగా ఉన్నాడని భావించింది. తండ్రి సుధీర్ ను అంతమొందిస్తే తనకు ఏ అడ్డూ ఉండదని భావించింది.
'దృశ్యం' 10సార్లు చూసి తప్పించుకునే ప్లాన్
తండ్రిని చంపాలనుకుంటున్నానని ఏకంగా తన తల్లికే చెప్పింది. వద్దని తండ్రి చెప్పే మాట వినాలని చెప్పాల్సిన ఆ తల్లి... హత్యకు బిడ్డను ప్రోత్సహించింది. తన ప్రియుడిని స్నేహ పుణె నుండి బెళగావికి రప్పించింది. సెప్టెంబరు 15న పక్కా ప్లాన్ ప్రకారం ఓ లాడ్జిలో ఉండమని చెప్పింది. ఈ లోపు తల్లీకూతుళ్లు, ప్రియుడు అక్షయ్ దృశ్యం సినిమాను 10 సార్లు చూశారు. అందులో హీరో పోలీసులకు దొరక్కుండా ఎలా తప్పించుకున్నాడో చూసి, తామూ అలాగే తప్పించుకోవచ్చని పథకం పన్నారు. తండ్రి ఇంటి పై అంతస్తులో నిద్రిస్తున్న సమయంలో తల్లీకూతుళ్లు కలిసి అదే సరైన సమయం అనుకున్నారు. సెప్టెంబర్ 17న తెల్లవారుజామున అక్షయ్ కు ఫోన్ చేసి పిలిపించారు. తల్లీకూతుళ్లు కలిసి నిద్రిస్తున్న సుధీర్ కాళ్లు చేతులు గట్టిగా పట్టుకోగా.. అక్షయ్.. కత్తితో సుధీర్ ను కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. కడుపు, గొంతు, చేతులు, మొహంపై కత్తి పోట్లు పొడిచాడు. తీవ్ర గాయాలతో రక్తస్రావమై సుధీర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. అనంతరం ప్రియుడు అక్షయ్ ను పుణెకు పంపించారు తల్లీ కూతుళ్లు.
అనంతరం తన భర్తను ఎవరో హత్య చేసి పరారయ్యాడని రోహిణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తల్లీ కూతుళ్లను ప్రశ్నించారు. పోలీసులు ఏ ప్రశ్న వేసినా.. ఏ మాత్రం తడుముకోకుండా తల్లీ కూతుళ్లు సమాధానం చెప్పసాగారు. విచారణలో భాగంగా ఫోన్ కాల్స్ పరిశీలించగా అసలు విషయం వెలుగు చూసింది.