Hyderabad News: భర్తతో సహా తల్లిదండ్రులను వదిలేసి వెళ్లిన మహిళ, - ఆధార్ సాయంతో పట్టుకున్న పోలీసులు
Hyderabad News: భర్తతో సహా తల్లిదండ్రులను వదిలేసిందో వెళ్లిందో మహిళ. ఊరు, పేరు, మతం మార్చుకొని మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. హాయిగా జీవిస్తోంది. ఈక్రమంలోనే పోలీసులు ఆమెను ఆధార్ సాయంతో గుర్తించారు.
Hyderabad News: తల్లిదండ్రులు ధనవంతులు. డబ్బున్న వ్యక్తిని చూసి పెళ్లి కూడా చేశారు. కానీ ఆమెకు నచ్చిన జీవితం అక్కడ లేదు. తరచుగా భార్యాభర్తల మధ్య గొడవలు వస్తుండేవి. అవి తట్టుకోలేని మహిళ రెండు సార్లు ఎవరికీ చెప్పకుండా ఎక్కడికో వెళ్లిపోయింది. మళ్లీ ఇంటికి తిరిగొచ్చింది. కానీ మూడోసారి గొడవ జరిగిన తర్వాత మాత్రం ఆమె తన ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్లిపోయింది. తన ఆధారాలన్నింటినీ మార్చేసుకుంది. తనెక్కడుందో ఎవరికీ తెలియకుండా చేసుకుంది. ఊరు, పేరు, మతం మార్చుకొని.. మరో వ్యక్తిని పెళ్లి చేసుకొని జీవితం కొనసాగిస్తోంది. అయితే ఆమెను వెతుకుతూ వెళ్లిన పోలీసులు.. ఆధార్ సాయంతో ఆమెను గుర్తించారు.
అసలేం జరిగిందంటే..?
సంపన్న కుటుంబానికి చెందిన 36 ఏళ్ల వివాహిత.. 2018 జూన్ 29వ తేదీన నగరంలోని హుమాయున్ నగర్‌లోఅదృశ్యం అయింది. ఐదేళ్ల క్రితం అదృశ్యం అయిన ఈ మహిళ కుటుంబ సభ్యులకు కూడా ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఇంట్లోంచి వెళ్లిపోయింది. తన మొబైల్ ఫోన్ ను కూడా ఇంట్లోనే పెట్టేసింది. అయితే మొదటి నుంచి భర్తతో మనస్పర్థలు ఉన్న ఆమె 2014, 2015లో కూడా ఇంట్లోంచి వెళ్లిపోయింది. అప్పుడు తిరిగి మళ్లీ ఇంటికి వెళ్లింది. కానీ 2018లో భర్త వేధింపుల వల్లే ఆమె కనిపించకుండా పోయిందని ఆమె తండ్రి వరకట్న వేధింపుల కింద కేసు పెట్టారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆమె కావాలనే ఇంట్లోంచి వెళ్లిపోయినట్లు గుర్తించారు. 2019లో సదరు మహిళ తండ్రి హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈక్రమంలోనే మహిళల భద్రతా విభాగం, మానవ అక్రమ రవాణా విభాగం నుంచి సహాయం కోరాలని పోలీసులను ఆదేశించింది.
ఈ క్రమంలోనే దర్యాప్తు చేపిట్టిన మహిళా భద్రతా విభాగం ఎస్ఐ.. సదరు మహిళ క్యాబ్ బుక్ చేసుకోవడానికి మరో మొబైల్ ఫోన్ వినియోగించినట్లు గుర్తించారు. అంతేకాకుండా క్యాబ్ కంపెనీ నుంచి ఆమె వాయిస్ రికార్డింగ్ రికవరీ చేసుకొని విన్నారు. ఆమె పుణేకి వెళ్లిన్లు గుర్తించారు. అయితే ఆ తర్వాత ఆమె తన ఫోన్ అమ్మేసినట్లు పోలీసులు తెలుసుకున్నారు. ఇక ఆ తర్వాత నుంచి ఈ కేసు క్లిష్టతరంగా మారింది. ఇన్నాళ్లూ కేసు అలాగే ఉండిపోయింది. కానీ ఆమె ఆధార్ కార్డు గత నెలలో అప్ డేట్ చేసినట్టు గుర్తించిన పోలీసులు.. మళ్లీ వెతుకులాట ప్రారంభించారు. అప్ డేట్ చేసిన ఆధార్ కార్డులో ఊరు, పేరు సహా మతం, భర్త పేరు ఇలా అన్ని వివరాలు మార్చేశారు. ఆధార్ సాయంతోనే ఆమె బ్యాంకు వివరాలు కనుక్కొని.. దాని ద్వారా ఆమె సోషల్ మీడియా అకౌంట్ గుర్తించారు. దాని ద్వారా ఆమె గోవాలో ఉంటున్నట్లు తెలుసుకొని అక్కడికి వెళ్లారు.
సదరు మహిళను గుర్తించిన పోలీసులు.. ఆమెను హైదరాబాద్ తీసుకొచ్చారు. కోర్టులో హాజరు పరిచారు. ఈ క్రమంలోనే మహిళ తనకు తానుగా ఉండాలనుకొని.. ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు చెప్పింది. ప్రస్తుతం తాను చాలా సంతోషంగా ఉంటున్నట్లు స్పష్టం చేసింది. అయితే పోలీసులు వెళ్లే వరకు సదరు మహిళ రెండో భర్తకు... ఆమె గురించి తెలియదు. గతంలో పెళ్లి జరిగినట్లు కూడా తెలియకపోవడం గమనార్హం.