Hyderabad News: రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్ - ప్రీ లాంచ్ పేరిట 20 కోట్లు స్వాహా
Hyderabad News: రియల్ ఎస్టేట్ పేరిట మేడ్చల్ జిల్లా ఆఫీసు తెరిచి మరీ మోసాలకు పాల్పడ్డాడో వ్యక్తి. ప్రీలాంచ్, ఆఫర్ల పేరిట అందినకాడికి దోచుకున్న అతడిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
Hyderabad News: మేడ్చల్ జిల్లా కూకట్ పల్లిలో రియల్ ఎస్టేట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ కు చెందిన కాకర్ల శ్రీనివాస్ అనే వ్యక్తి జైత్రి ఇన్ ఫ్రా పేరిట కేపీహెచ్బీ 6వ ఫేజ్ లో ఆఫీసు ఏర్పాటు చేశాడు. ఆపై హైదరాబాద్ శివార్లలోని ఖాళీ భూములను వెతికి ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి.. అది తన భూమేనని. అక్కడే తాను అపార్ట్ మెంట్లు కట్టబోతున్నట్లు బాధితులను నమ్మిస్తాడు. ప్రీ లాంచ్, ఆఫర్ల పేరిట 2, 3 బీహెచ్ కే ఇళ్లు ఫ్లాట్లు ఇస్తున్నానంటూ.. చాలా మంది బాధితులను మోసం చేశాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 5, 10, 15, 20, 25, 40 లక్షల వరకు వసూలు చేసి దాదాపు 20 కోట్ల రూపాయలు కాజేశాడు.
డబ్బులు కట్టిన బాధితులు.. ఏళ్లు గడుస్తున్నా ప్లాట్లు ఇవ్వకపోవడంతో బాధితులు శ్రీనివాస్ ను నిలదీశారు. రేపు, మాపని చెప్పగా కొన్నాళ్లు వేచి చూశారు. అప్పటికీ అతని నుంచి ఎలాంటి స్పందన లేకపోయే సరికి బాధితులు మరోసారి శ్రీనివాస్ ఆఫీసుకు వెళ్లి గొడవ చేశారు. ఆ తర్వాత నుంచి శ్రీనివాస్ ఆఫీసును మూసేసి మరీ తప్పించుకుని తిరుగుతున్నాడు. ఈ క్రమంలోనే బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేపీహెచ్బీ సమీపంలోని పీఎన్ఆర్ వద్ద అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. ఇప్పటికే నిందితుడిపై కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో 8 కేసులు నమోదు చేసినట్లు ఏసీపీ చంద్ర శేఖర్ తెలిపారు.
"కేపీహెచ్బీ పోలీస్ స్టేషన్ పరిధిలో కాకర్ల శ్రీనివాస్ అనే ఓ వ్యక్తి జైత్రి ఇన్ ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ అని రియల్ ఎస్టేట్ ఆఫీస్ పెట్టి జనాల దగ్గర పెద్ద ఎత్తున డబ్బులు తీసుకొని.. చివరకు వారిని మోసం చేశాడు. ఇతని మీద బాధితులు వచ్చి కేసులు నమోదు చేశారు. ఎనిమిది మంది ఫిర్యాదు చేయగా కాకర్ల శ్రీనివాస్ మీద కేసులు పెట్టాం. స్పెషల్ టీం ద్వారా విచారణ చేపట్టాం. కాకర్ల శ్రీనివాస్ హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో.. ఖాలీ ప్లేసెస్ ఐడెంటీపై చేసి పేక్ డాక్యమెంట్స్ క్రియేట్ చేయించుకొని... బాధితులకు తన పేరిట భూమి ఉన్నట్లుగా చూపిస్తాడు. ఆ తర్వాత వాటిలో అపార్ట్ మెంట్లు కడతాం, 2బీహెచ్ కే, 3 బీహెచ్ కేలు కట్టి విక్రయిస్తామని చెప్తూ.. బాధితుల వద్ద నుంచి డబ్బులు వసూలు చేస్తాడు. ప్రీ లాంచ్ పేరిట, ఆఫర్ల పేరిట 5, 10, 20, 25 లక్షలు వసూలు చేశాడు. మరికొందరి దగ్గర నుంచి అయితే 40 లక్షలు కూడా తీసుకున్నాడు. త్రీ ఇయర్స్ నుంచి ఇలాగే చాలా మంది దగ్గర నుంచి డబ్బులు వసూలు చేశాడు. మూడేళ్లు గడుస్తున్నా బిల్డింగ్ కన్ స్ట్రక్షన్ ప్రారంభం కాకపోవడంతో.. బాధితులు నిలదీశారు. రేపు మాపు అంటూ శ్రీనివాస్ వారిని మోం చేసుకుంటూనే వస్తున్నాడు. బాధితులంతా కలిసి గట్టిగా నిలదీయంతో ఆఫీసును కూడా క్లోజ్ చేసి పారిపోయాడు. దీంతో బాధితులు పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో మేం అరెస్ట్ చేశాం" - చంద్ర శేఖర్, కేపీహెచ్బీ ఏసీపీ