Hyderabad News : హైదరాబాద్ లో భారీ మోసం - బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట రూ.200 కోట్లు టోకరా!
Hyderabad News : హైదరాబాద్ లో పరిధిలో మరో భారీ మోసం వెలుగుచూసింది. బొట్టు బిళ్లలు, వత్తుల పేరిట ఓ వ్యక్తి ఏకంగా సుమారు రూ.200 కోట్లు మోసం చేశాడు.
Hyderabad News : హైదరాబాద్ లో ఏఎస్ రావు నగర్ పరిధిలో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ పేరుతో సుమారు రూ.200 కోట్లు మోసం చేశాడో వ్యక్తి. సుమారు 1100 మంది మోసం పోయినట్లు తెలుస్తోంది. ఏఎస్ రావు నగర్‌లో రావులకొల్లు రమేశ్ అనే వ్యక్తి ఆర్‌ఆర్ ఎంటర్‌ప్రైజెస్ పేరుతో ఓ సంస్థను నిర్వహిస్తున్నాడు. దీపం వత్తులు, బొట్టు బిళ్లల తయారీ మిషన్లను విక్రయించాడు. దీపం వత్తుల యంత్రం రూ.1.70 లక్షలు, బొట్టు బిళ్లల యంత్రం రూ.1.40 లక్షలకు అమ్మాడు. వత్తులు, బొట్టు బిళ్లల తయారీకి ముడిసరకు అందించేవాడు. వత్తులు, బొట్టు బిళ్లలు తయారు చేస్తే వాటిని తానే కొనుగోలు చేసి డబ్బు చెల్లిస్తానని ప్రజల్ని నమ్మించాడు. కిలో బొట్టు బిళ్లలకు రూ.600, వత్తులకు రూ.300 చెల్లిస్తానని నమ్మించాడు. ముందు కొందరిని నమ్మించి యంత్రాలు విక్రయించాడు. వారికి నమ్మకం కుదిరే వరకూ నగదు చెల్లించాడు. యూట్యూబ్‌లో వీడియోలు పెట్టాడు రమేష్. తక్కువ పెట్టుబడితో ఎక్కువ సొమ్ము వస్తుందని నమ్మిన ప్రజలు రమేశ్ వద్ద యంత్రాలు కొనుగోలు చేశారు. 2021 నుంచి వాటిని బొట్టు బిళ్లలు, వత్తుల యంత్రాలు విక్రయిస్తున్న రమేశ్ ఇటీవల బోర్డు తిప్పేశాడు. విషయం తెలుసుకున్న బాధితులు కుషాయిగూడ పోలీస్‌స్టేషన్‌లో రమేష్ పై ఫిర్యాదు చేశారు.
దూది వత్తుల తయారీ మిషన్లు అమ్మి
హైదరాబాద్ లో ఇటీవల భారీ మోసం వెలుగులోకి వచ్చింది. వత్తుల తయారీ పేరుతో ఓ సంస్థ డిపాజిట్ దారులను నిట్టనిలువునా ముంచింది. తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే అత్యాశను ఆసరాగా చేసుకున్న ఓ సంస్థ డిపాజిట్ల పేరుతో భారీ మోసానికి పాల్పడింది. హైదరాబాద్ బోడుప్పల్‌లో ఇటీవల భారీ మోసం బట్టబయలైంది. దూది వత్తుల తయారీ పేరిట ఏబీజీ అనే సంస్థ పెద్దఎత్తున డిపాజిట్లు సేకరించింది. వత్తుల తయారీకి యంత్రాలు, దూది తామే ఇస్తామని నమ్మించి ఒక్కొక్కరి నుంచి రూ.1.70 లక్షలు సేకరించారు. కిలో దూదికి రూ.300 చెల్లించి తీసుకుని వత్తులు తయారు చేసి ఇస్తే రూ.600 చెల్లిస్తామని నమ్మించారు. ఆరు నెలల తర్వాత చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి చెల్లిస్తామని చెప్పారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు తిరిగి వస్తుందని నమ్మిన బాధితులు పెద్దఎత్తున డిపాజిట్లు కట్టారు. రెండు నెలల సజావుగా డబ్బు చెల్లించిన సంస్థ తర్వాత పత్తాలేకుండా పోయారు. దీంతో బాధితులు ఏబీజీ కంపెనీ యజమాని బాలస్వామి గౌడ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. సుమారు 600 మంది నుంచి డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు విచారణ తెలిపింది. రూ.20 కోట్ల మేర నిర్వాహకులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
కరక్కాయ పొడి పేరిట మోసం
ఇటీవల కరక్కాయ పొడి పేరిట ఓ గ్యాంగ్ భారీగా డిపాజిట్లు సేకరించి ముంచేసింది. తాజాగా వత్తుల మిషన్ పేరిట మరో సంస్థ మోసానికి పాల్పడింది. వత్తుల మిషన్లను బాధితులకు అంటగట్టి వారి నుంచి డిపాజిట్లు సేకరించారు. ఆ వత్తులు మళ్లీ తమకే అమ్మాలని నమ్మించారు. మొదట రెండు, మూడు నెలలు డబ్బులు సజావుగానే ఇచ్చారని బాధితులు చెబుతున్నారు. ఈ వత్తుల మిషన్ ద్వారా నెలకు రూ.30 నుంచి 50 వేలు సంపాదించవచ్చని బాధితులను నమ్మించారు. ఇందుకోసం యూట్యూబ్ లో బాలా స్వామిగౌడ్ వీడియోలు కూడా అప్లోడ్ చేశారని బాధితులు చెబుతున్నారు. ఒక్కో మిషన్ రూ.1.70 లక్షలకు కొనుగోలు చేశామని బాధితులు చెబుతున్నారు. మిషన్ తో పాటు ఒక్కొక్కరికీ 50 నుంచి 100 కేజీల దూది కూడా ఇచ్చారని చెబుతున్నారు. వత్తులు మళ్లీ బాలాస్వామి గౌడ్ కొంటామని చెప్పడంతో బాధితులు పూర్తిగా నమ్మారు. చాలా మంది మిషన్లు కొని వత్తులు చేయడం మొదలుపెట్టారు. ఒకరిద్దరికి డబ్బులు రావడంతో మరికొంత మంది మిషన్లకు అడ్వాన్స్ కూడా ఇచ్చారు. గత కొంతకాలంగా వత్తులు కొనడానికి రాకపోవడం, అడ్వాన్స్ ఇచ్చిన వాళ్లకు మిషన్లు ఇవ్వకపోవడంతో బాధితులు అనుమానం వచ్చింది. తీరా ఆరా తీస్తే సదరు సంస్థ బోర్డు తిప్పేసినట్లు తెలుస్తోంది. అడ్వాన్స్ డబ్బులిచ్చినోళ్లకు మిషన్ల లేవు. ఫోన్లు చేస్తే అప్పుడిస్తామని..ఇప్పుడిస్తామంటూ సాగదీస్తున్నారని ఆరోపించారు. దీంతో మోస పోయామని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మొత్తం 800 మంది బాధితులు మోస పోయినట్టు తెలుస్తోంది. దీంతో లబోదిబోమని బాధితులు పోలీసులను ఆశ్రయించారు.