Chittoor Road Accident: చిత్తూరులో ఘోర రోడ్డు ప్రమాదం - బైక్ ను ఢీకొన్న లారీ, యువకుడు సజీవ దహనం
మదనపల్లి - పుంగనూరు జాతీయ రహదారిలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది.
Chittoor Road Accident: చిత్తూరు జిల్లా మదనపల్లెలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి - పుంగనూరు జాతీయ రహదారిలోని బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న యువకుడిని గుర్తు తెలియని లారీ ఢీ కొట్టింది. దాంతో ద్విచక్ర వాహనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి ద్విచక్ర వాహనంతో పాటుగా యువకుడు సజీవ దహనం అయ్యాడు. శనివారం ఈ ఘటన జరిగింది. జాతీయ రహదారిపై పట్ట పగలు యువకుడిని లారీ ఢీకొన్న తరువాత అతడు సజీవ దహనం అవుతుంటే భయాందోళనకు గురైన లారీ డ్రైవర్ పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తాను అమ్మవారికి దండం పెట్టుకుంటుండగా ఓ లారీ వచ్చి బైకు పై వెళ్తున్న యువకుడ్ని ఢీకొట్టిందని ప్రత్యక్ష సాక్షి ఒకరు అన్నారు. కానీ కొన్ని నిమిషాల వ్యవధిలో మంటలు చెలరేగి వ్యక్తి సజీవ దహనం అయ్యారని తెలిపారు. మంటల్ని ఆర్పే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయిందని నిమిషాల సమయంలోనే ఘోరం జరిగిందని స్థానికులు వెల్లడించారు. లారీ ఢీకొట్టడంతో బైక్ ట్యాంక్ పగిలి పెట్రోల్ లీక్ కావడంతో నిప్పు రాజుకుని విషాదం చోటుసుకుందని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పట్టిసీమ శివరాత్రి ఉత్సవాల్లో అపశృతి
పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాల్లో అపశృతి చోటుచేసుకుంది. గోదావరి నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొకరి కోసం ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టిన అతడి మృతదేహం లభ్యమైంది. పోలవరం ఎస్ఐ పవన్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం దోసపాడు గ్రామానికి చెందిన ఓలేటి అరవింద్ (20 ) ఎస్కే లుక్మన్ (19) పెద్దిరెడ్డి రాంప్రసాద్ (18 ) మరో నలుగురు పట్టిసీమ మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చారు. పట్టిసీమలో స్నానాల కోసం కేటాయించిన రేవులకు దూరంగా అనధికార రేవులు వద్ద స్నానాలకు దిగారు యువకులు. నది లోతుగా ఉండడం గోదావరి ప్రవాహం వేగం ఎక్కువగా ఉండడంతో ముగ్గురూ కొట్టుకుపోయి నదిలో గల్లంతయ్యారు. సంఘటన ప్రాంతాన్ని పోలవరం డీఎస్పీ లతాకుమారి చేరుకుని పరిశీలించారు. మృతదేహాలను పోలవరం ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రానికి పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
నాగార్జునసాగర్ ఎడమకాల్వలో బాలుడు గల్లంతు
బంధువులతో కలిసి స్నానానికి వెళ్లిన ఓ బాలుడు నాగార్జునసాగర్ ఎడమకాల్వలో గల్లంతు అయ్యాడు. నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొక్కమంతలపహాడ్‌లో శుక్రవారం జరిగింది. చింతమళ్ల భాస్కర్, జ్యోతి దంపతలకు కుమారుడు, కుమార్తె ఉన్నారు. కవలల్లో పెద్దవాడైన అశోక్(14) నిడమనూరు జెడ్పీ హైస్కూలులో చదువుతున్నాడు. గ్రామంలో పండుగ ఉండడంతో భాస్కర్ ఇంటికి బంధువులు వచ్చారు. శుక్రవారం మధ్యాహ్నం అశోక్ తన బాబాయితో కలిసి గ్రామంలోని నాగార్జునసాగర్ ఎడమకాల్వలో స్నానానికి వెళ్లాడు. బంధువులు కాల్వలో ఈత కొడుతుండగా ఒడ్డున్న ఉన్న అశోక్ ప్రమాదవశాత్తు కాలువలో పడి నీటిలో కొట్టుకుపోయాడు. బాలుడిని కాపాడేందుకు బంధువులు ప్రయత్నించినా నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో బాలుడు గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు బాలుడి కోసం గాలిస్తున్నారు.