Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం, నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి!
Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. కరాటోయా నదిలో పడవ బోల్తా పడి 23 మంది మృతి చెందారు.
Bangladesh Ferry Accident : బంగ్లాదేశ్‌లోని కరాటోయా నదిలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణికులతో వెళ్తోన్న పడవ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 23 మంది దుర్మరణం చెందారు. ఇంకా పలువురు గల్లంతయ్యారు. ప్రమాదం సమాచారం అందుకున్న అధికారులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు వెలికితీసిన మృతదేహాల్లో మహిళలు, పిల్లలు ఉన్నారని స్థానిక అధికారులు తెలిపారు. గల్లంతైన వారి సంఖ్య కచ్చితంగా ఎంతనేది తెలియలేదన్నారు. ప్రమాదం జరిగిన సమయంలో బోటులో దాదాపు 70 మంది ఉన్నట్లు సమాచారం అన్నారు.
అసలేం జరిగింది?
బంగ్లాదేశ్‌లోని కరాటోయా నదిలో పడవ బోల్తా పడిన ఘటనలో 23 మంది మృతి చెందగా, పలువురు గల్లంతయ్యారు. “మేము 23 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అగ్నిమాపక సిబ్బంది, డైవర్లు మరిన్ని మృతదేహాల కోసం వెతుకుతున్నారు, ”అని వార్తా సంస్థ AFP స్థానిక పోలీసు అధికారి షఫీకుల్ ఇస్లాం తెలిపారు. ఇప్పటి వరకు లభ్యమైన మృతదేహాల్లో మహిళలు, చిన్నారులు ఉన్నారని ప్రమాదం జరిగిన ఉత్తర పంచాఘర్ జిల్లా పాలనాధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. గల్లంతైన వారి కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఆయన తెలిపారు.
తరచూ ప్రమాదాలు
స్థానిక వార్త సంస్థల సమాచారం ప్రకారం, తప్పిపోయిన వ్యక్తుల కచ్చితమైన సంఖ్య ఇంకా నిర్థారించలేదు. అయితే 70 మందికి పైగా పడవలో ఉన్నారని ప్రాణాలతో బయటపడిన ప్రయాణికులు చెప్పారు. శతాబ్దాల నాటి ఆలయానికి వెళుతున్న యాత్రికులతో పడవ బోల్తా నదిలో పడింది. ఉత్తర బంగ్లాదేశ్‌లోని బోడా పట్టణానికి సమీపంలో కరాటోయా నది మధ్యలో ఓడ అకస్మాత్తుగా ఒరిగిపోయి నీట మునిగిపోయింది. బంగ్లాదేశ్‌లో ఫెర్రీ ప్రమాదాలు సర్వసాధారణం అయిపోయాయి. నదుల ద్వారా ప్రయాణించినప్పుడు భద్రతా ప్రమాణాలు పాటించడంలేదని అధికారులు అంటున్నారు. అందుకే తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. మే నెలలో ఇదే విధమైన ప్రమాదం జరిగింది. బోటు ఇసుకతో నిండిన బల్క్ క్యారియర్‌ను ఢీకొని, పద్మ నదిలో మునిగిపోయింది. ఈ ప్రమాదంలో కనీసం 26 మంది మరణించారు. జూన్ 2020లో నౌకను ఢీకొనడంతో ఢాకాలో ఫెర్రీ బోల్తా పడింది. అప్పుడు 32 మంది మరణించారు. అదే ఏడాది ఆగస్టులో నేత్రకోనలోని మదన్ ఉపజిల్లాలో పడవ మునిగి 17 మంది మరణించారు. అంతకు ముందు ఫిబ్రవరి 2015లో బంగ్లాదేశ్‌లోని ఓ నదిలో రద్దీగా ఉండే ఓడ కార్గో నౌకను ఢీకొనడంతో సుమారు 78 మంది చనిపోయారు.
Also Read : North Korea: కిమ్ కవ్వింపు చర్యలు- సీరియస్‌గా స్పందించిన దక్షిణ కొరియా!
Also Read: UN Security Council: భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత హోదా- రష్యా మద్దతు!