Andhra Couple Chain Snatching: ప్రేమించుకున్నారు..కానీ పెళ్లి ఖర్చుకు డబ్బుల్లేవ్ - జంటగా చైన్ స్నాచింగ్ చేసి దొరికిపోయారు!
Chain Snatching Love Couple: పెళ్లి ఖర్చుల కోసం దొంగతనానికి పాల్పడ్డ ఏపీ ప్రేమజంట దొరికిపోయారు. వనస్థలిపురంలో వృద్ధురాలి గొలుసు తెంచిన 24 గంటల్లోనే పోలీసులకు చిక్కారు.

Vanasthalipuram Police Arrest Andhra Lovers: ప్రేమించుకున్నారు.. గ్రాండ్ గా పెళ్లి చేసుకొని ఒకటవ్వాలనుకున్నారు. కానీ పెళ్లి ఖర్చులకు సరిపడా డబ్బులు లేకపోవడంతో, ఆ ఆర్థిక ఇబ్బందులను అధిగమించడానికి కష్టపడాల్సిన ఆ ప్రేమజంట దారుణమైన షార్ట్‌కట్ ఎంచుకుంది. ఆంధ్రా నుంచి హైదరాబాద్ మహానగరానికి చేరుకున్న ఆ జంట, ఉద్యోగం రాకపోవడంతో సులభంగా డబ్బు సంపాదించేందుకు చైన్ స్నాచింగ్ బాట పట్టింది. తీరా మొదటి నేరం చేసిన కొన్ని గంటల్లోనే పోలీసుల నిఘా నేత్రాలకు చిక్కి, ఏడు అడుగులు వేయాల్సిన కాళ్లకు సంకెళ్లు వేయించుకుని జైలు పాలయ్యారు.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఈ జంట చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. పెద్దలను ఒప్పించి లేదా స్వయంగా పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్న వీరు, హైదరాబాద్‌కు వచ్చి ఉద్యోగం వెతుక్కుని , పెళ్లి ఖర్చుల నిమిత్తం అత్యవసరంగా డబ్బు సమకూర్చుకోవాలని ప్లాన్ చేశారు. అయితే నగరంలో సరైన ఉద్యోగం లభించకపోవడంతో వనస్థలిపురం పరిధిలోని రాజరాజేశ్వరి దేవాలయాన్ని తమ నేరానికి వేదికగా ఎంచుకున్నారు. దేవుడి సన్నిధిలో సేవ చేసుకుంటున్న ఓ వృద్ధురాలిని టార్గెట్ చేసి, ఆమె మెడలోని 3 తులాల బంగారు గొలుసును బలవంతంగా తెంచుకుని పరారయ్యారు.
నేరం జరిగిన వెంటనే బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వనస్థలిపురం పోలీసులు, రాచకొండ, మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ ఉన్నతాధికారుల మార్గదర్శకత్వంలో కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు. ఆలయ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలను విశ్లేషించి నిందితుల కదలికలను క్షుణ్ణంగా పరిశీలించారు. పక్కా సమాచారంతో వారు ప్రయాణించిన మార్గాలను ఛేదిస్తూ.. చోరీ జరిగిన కేవలం 24 గంటల వ్యవధిలోనే కమలానగర్ సమీపంలో నిందితులను వలపన్ని అదుపులోకి తీసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న నిందితుల నుంచి చోరీకి గురైన 3 తులాల బంగారు గొలుసుతో పాటు రెండు సెల్‌ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల విచారణలో ఆ జంట విస్తుపోయే నిజాలను వెల్లడించింది. తాము పెళ్లి ఖర్చుల కోసమే ఈ నేరానికి ఒడిగట్టామని, తమపై ఇంత వరకూ ఎలాంటి క్రిమినల్ రికార్డులు లేవని విచారణలో ఒప్పుకున్నారు. దీంతో పోలీసులు ఇద్దరిపై కేసు నమోదు చేసి న్యాయస్థానంలో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు.
ప్రేమకు పెళ్లిని, పెళ్లికి డబ్బును ముడిపెడుతూ తప్పుదారి పట్టిన ఈ యువ జంట ఉదంతం అనేకమందికి ఒక కంటివిప్పుగా మారింది. ప్రేమ లేదా పెళ్లి కోరికలు గొప్పవే కావచ్చు, కానీ ఆర్థిక అవసరాల కోసం చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని నేరాలకు పాల్పడితే చట్టం ముందు ఏ సమర్థనా నిలబడదు అని పోలీసులు స్పష్టం చేశారు. బాధితురాలికి 24 గంటల్లోనే న్యాయం చేసిన పోలీసు బృందాన్ని ఉన్నతాధికారులు అభినందించారు.
ట్రెండింగ్ వార్తలు






















