Atchutapuram Sez: ఏపీలో పేలిన రియాక్టర్, 11 మంది దుర్మరణం, అంతకంతకూ పెరుగుతున్న మృతులు
Vizag News: అనకాపల్లి జిల్లాలో సెజ్ లో జరిగిన ప్రమాద ఘటనపై హోం మంత్రి వంగలపూడి అనిత స్పందించారు. బాధితులకు తక్షణం వైద్య సేవలు అందించాని ఆదేశించారు.
Anakapalle Fire Accident: అచ్యుతాపురం సెజ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో 11 మంది చనిపోగా.. పదుల సంఖ్యలో కార్మికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. చాలా మంది పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్సియా కంపెనీలో రియాక్టర్ పేలి ప్రమాదం సంభవించింది. రియాక్టర్‌లోని ఇన్‌ఫ్లేమబుల్ సాల్వెంట్ మండడం కారణంగా రియాక్టర్ పేలినట్లుగా చెబుతున్నారు.
ఈ ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం అనకాపల్లి ఎన్టీఆర్ హాస్పిటల్ కి, స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. మధ్యాహ్నం భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెను ప్రమాదం కాస్త తప్పింది. ప్రమాదం కారణంగా చుట్టుపక్కల గ్రామాల్లో చుట్టూ పొగలు అల్లుకున్నాయి. దీంతో భయాందోళనలో ఉన్నారు. వెంటనే ఘటన స్థలానికి అనకాపల్లి జిల్లా కలెక్టర్, ఎస్పీ వెళ్లి పరిస్థితిని పరిశీలించారు.
మధ్యాహ్న భోజన సమయంలో రియాక్టర్ పేలి ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పింది. లేదంటే ఇతర సమయాల్లో ఎక్కువ మంది కార్మికులు అక్కడే ఉండేవారని అంటున్నారు.
హోం మంత్రి అనిత స్పందన
ఎసెన్సియా కెమికల్ ఫ్యాక్టరీ ప్రమాదంపై హోం మంత్రి వంగలపూడి అనిత కూడా స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్ తో ఫోన్ లో మాట్లాడి.. ఫార్మా ప్రమాదంపై ఆరా తీశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని హోం మంత్రి అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ తో మాట్లాడిన చంద్రబాబు
సెజ్ లో జరిగిన ప్రమాద ఘటనపై సీఎం చంద్రబాబు అనకాపల్లి కలెక్టర్ తో మాట్లాడారు. ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి చెందారు. బాధితులకు అందుతున్న వైద్యంపై ఆరా తశారు. మెరుగైన వైద్యం అందించాలని సీఎం ఆదేశాలు జారీ చేశారు. ఈ పేలుడు ఘటనపై కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కూడా స్పందించారు. భారీ పేలుడు ప్రమాదం దురదృష్టకరమని అన్నారు. కచ్చితంగా ఎంత మంది చనిపోయారో తెలియడానికి కొంత సమయం పడుతుందని అన్నారు. రియాక్టర్ బ్లాస్ట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగిందని.. కార్మిక శాఖ అధికారులు అంతా అక్కడే ఉన్నారని అన్నారు.