Zomato Layoff: ఉద్యోగులకు మళ్లీ కత్తేరేసిన జొమాటో! దేశవ్యాప్తంగా 3% మందిపై వేటు!
Zomato Layoff: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఉద్యోగులకు షాకిచ్చింది! దేశ వ్యాప్తంగా 3 శాతం మందిని తొలగించినట్టు తెలిసింది.
Zomato Layoff: ఫుడ్ డెలివరీ కంపెనీ జొమాటో ఉద్యోగులకు షాకిచ్చింది! దేశ వ్యాప్తంగా 3 శాతం మందిని తొలగించినట్టు తెలిసింది. టెక్, సోషల్ మీడియా కంపెనీల బాటనే అనుసరించింది. రోజువారీ పనితీరును అనుసరించి బయటకు పంపించేశారని సమాచారం.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం పరిస్థితులు పెరుగుతున్నాయి. ట్విటర్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా కంపెనీలు రాబడి తగ్గిపోవడంతో ఇబ్బంది పడుతున్నాయి. ఆదాయం పెంచుకొనే మార్గం కనిపించకపోవడంతో వేల సంఖ్యలో ఉద్యోగులను పంపించేస్తున్నాయి. ఇవే కాకుండా టెక్ దిగ్గజాలైన యాపిల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్ వంటి కంపెనీలూ లేఆఫ్‌లు అమలు చేస్తున్నాయి.
'రోజు వారీ పనితీరును అనుసరించి మా సంస్థలో 3 శాతం మందిని తొలగిస్తున్నాం. ఇంతకు మించి ఎవ్వర్నీ తీసేయం' అని జొమాటో అధికార ప్రతినిధి తెలిపారు. ఈ ఫుడ్ డెలివరీ యాప్ ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కాదు. ప్రస్తుతం కంపెనీలో 3800 మంది పనిచేస్తుండగా 2020 మేలో 13 శాతం మంది అంటే 520 మందిపై వేటు వేసింది. కరోనా వైరస్ ఆవిర్భవించడం, లాక్‌డౌన్లు అమలు చేయడంతో ఇలా చేసింది.
కొన్ని వారాల క్రితమే జొమాటో టాప్ లెవల్ ఉద్యోగులు బయటకు వెళ్లిపోయారు. వెంటనే లేఆఫ్‌లు మొదలయ్యాయి. కంపెనీ సహ వ్యవస్థాపకుడు మోహిత్ గుప్తా శుక్రవారం కంపెనీని వీడారు. ఆయన కన్నా ముందు న్యూ ఇనిషియేటివ్స్ అధినేత రాహుల్ గాంజూ, ఇంటర్‌సిటీ లెజెండ్స్ సర్వీస్ అధినేత సిద్ధార్థ్ జావర్ వెళ్లిపోయారు.
'కొన్నేళ్లుగా నేను దీపిందర్ గోయెల్ (MD, CEO)ను గమనిస్తున్నాను. కాలం గడిచే కొద్దీ ఆయన పరిణతి సాధించారు. ఇప్పుడు వ్యాపారం మొత్తాన్ని మెరుగైన భవిష్యత్తు వైపు నడిపించగల వ్యక్తిగా ఎదిగారు. ఆ నమ్మకం ఉంది కాబట్టే నేను జొమాటో నుంచి బయటకు వెళ్లి జీవితంలో సరికొత్త సాహసాలు చేసేందుకు సిద్ధమయ్యాను. జొమాటో, బ్లింకిట్, హైపర్ క్యూర్, ఫీడింగ్ ఇండియా విజన్ పట్ల ఆసక్తితో ఉన్నాను' అని మోహిత్ అన్నారు.
View this post on Instagram
View this post on Instagram