Coronavirus Cases India: ఆఫీసుకెళ్తున్నారా? ఆగండాగండి! ఇంకొన్ని రోజులు ఇంటివద్దే పని చేయమంటున్న కంపెనీలు
కొవిడ్ తీవ్రత తగ్గడంతో ఇక ఆఫీసులకు వెళ్లే టైమొచ్చిందని అంతా భావించారు. కానీ రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో భారత వ్యాపార వర్గాలు వేచిచూసే ధోరణికే కంపెనీలు ఓటేస్తున్నాయి.
WFH or WFO India Inc Decides To Wait and Watch as Covid-19 Cases Spike Again: మూడు వేవ్‌లు ముగిశాయి! కొవిడ్ తీవ్రత చాలా తగ్గిపోయింది. అందరికీ వ్యాక్సినేషన్ పూర్తైంది! ఇక ఆఫీసులకు వెళ్లే టైమొచ్చిందని అంతా భావించారు. కానీ రెండు రోజుల్లోనే పాజిటివ్ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో భారత వ్యాపార వర్గాలు వేచిచూసే ధోరణిని అనుసరించాలని నిర్ణయించుకున్నాయి. ఇప్పుటికప్పుడే ఉద్యోగులను ఆఫీసులకు పిలిపించే ఉద్దేశం తమకు లేదని చెబుతున్నాయి. మున్ముందు పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని అంటున్నాయి.
భారతీ ఎయిర్‌టెల్, ఎరిక్‌సన్, హ్యూందాయ్, ఫ్లిప్‌కార్ట్, జొమాటో, హోండా కార్స్, టెక్ మహీంద్రా, శామ్‌సంగ్, ఉబెర్, నెస్లే, ఎంఫాసిస్, పానసోనిక్ ఇండియా, క్యాష్ కరో, అప్‌గ్రేడ్, అపోలో టైర్స్, వొడాఫోన్ ఐడియా, కేపీఎంజీ వంటి కంపెనీలు ప్రభుత్వ ఆదేశాలు, కరోనా పరిస్థితులను అనుసరించి నిర్ణయం తీసుకుంటామని చెబుతున్నాయి.
'పరిస్థితులను ఎయిర్‌టెల్ నిశితంగా పర్యవేక్షిస్తోంది. అన్ని కార్యాలయాల్లో కొవిడ్ నిబంధనలను కఠినంగా అమలు చేయనుంది' అని ఆ కంపెనీ అధికార ప్రతినిధి తెలిపారు. తాము హైబ్రీడ్ పని విధానాన్ని అనుసరిస్తున్నామని హోండాకార్స్ ఇండియా పేర్కొంది. రెండేళ్లుగా ఇదే విధానం కొనసాగిస్తున్నామని, అవసరాన్ని బట్టి ఇంటివద్ద పనికే ప్రోత్సహిస్తున్నామని వివరించింది. తమ హెడ్‌క్వార్టర్స్, ఇతర ఆఫీసుల్లో తక్కువ మంది స్టాఫ్‌నే కొనసాగిస్తామని, మిగతావారికి వర్క్ ఫ్రం హోం ఇస్తామని హ్యుందాయ్ కార్స్ వెల్లడించింది. ఆఫీసులకు వచ్చేవారు మాస్కులు వేసుకోవాలని, టెంపరేచర్ చెకప్స్, సోషల్ డిస్టన్స్, చేతులను శుభ్రం చేసుకోవడం వంటివి కఠినంగా అమలు చేస్తామని తెలిపింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాలు, సూచనల మేరకు తాము కొవిడ్ ప్రొటోకాల్స్‌ను అనుసరిస్తామని ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. ఉద్యోగులు భయపడాల్సిందేమీ లేదని, లక్షణాలు ఉంటే ఇంటివద్దే ఉండి పనిచేయాలని జొమాటో తెలిపింది. మున్ముందు పరిస్థితులను బట్టి కొన్ని వారాలు ఇంటివద్దే పని చేసేందుకు అనుమతిస్తామని కంపెనీ సీఈవో దీపిందర్ గోయెల్ అన్నారు. నెస్లే సైతం హైబ్రీడ్ విధానానికే ఓటేస్తున్నామని వెల్లడించింది.
భారత్‌లో 24 గంటల్లోనే 2,380 కొవిడ్ కేసులు కొత్తగా నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 13,433కు చేరకుంది. రెండు రోజుల్లో 50 శాతానికి పైగా కేసులు పెరుగుతుండటంతో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కఠిన చర్యలు తీసుకోవాలని చెబుతున్నాయి. కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచిస్తున్నాయి. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి పెద్దపెద్ద ఐటీ కంపెనీలు ఉద్యోగులను ఇంటివద్దే ఉండి పనిచేయమంటున్నాయి. పూర్తి ఆఫీసులకు అనుమతించడం లేదు. హైబ్రిడ్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. మరికొన్ని కంపెనీలకు ఉద్యోగులు వెళ్తున్నారు. వారు మళ్లీ ఇప్పుడు హైబ్రీడ్, వర్క్ ఫ్రం హోం విధానం అనుసరిస్తామని చెబుతున్నారు.