US FED Interest Rate Hike: మరోసారి వడ్డీ రేటు పెంచిన యూఎస్ ఫెడ్, అయితే ఈసారి కాస్త ఊరట
ఈ ఏడాది నవంబర్‌లో బ్యాంకు వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు లేదా 0.75 శాతం పెంచగా, ఈసారి మాత్రం 0.50 శాతం పెంపుతో సరి పెట్టింది.
US FED Interest Rate Hike: అమెరికా సెంట్రల్ బ్యాంక్ అయిన ఫెడరల్ రిజర్వ్ (US FED) మరోసారి వడ్డీ రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రపంచ మార్కెట్లన్నీ ముందుగా ఊహించినట్లుగానే, తన వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు (bps) లేదా 0.50 శాతం (అర శాతం) పెంచింది. ఈసారి వడ్డీ రేట్ల పెంపులో యూఎస్ ఫెడ్ దూకుడు కొద్దిగా తగ్గింది. ఈ ఏడాది నవంబర్‌లో బ్యాంకు వడ్డీ రేటును 75 బేసిస్ పాయింట్లు లేదా 0.75 శాతం పెంచగా, ఈసారి మాత్రం 0.50 శాతం పెంపుతో సరి పెట్టింది.
అమెరికాలో గరిష్ట స్థాయులకు చేరిన ద్రవ్యోల్బణం మీద పోరాటంలో భాగంగా.. గత కొన్ని దఫాలుగా దూకుడుగా వడ్డీ రేట్లను పెంచుతూ వెళ్లింది US సెంట్రల్ బ్యాంక్. ఆ చర్యల ఫలితంగా గత నెలలో (నవంబర్‌లో) ద్రవ్యోల్బణం ఊహించిన దాని కంటే తగ్గింది. వరుసగా ఐదో నెల (నవంబర్) కూడా అగ్రరాజ్యంలో ద్రవ్యోల్బణం తగ్గి 7.1 శాతానికి (నవంబర్‌లో) పరిమితం అయింది. దీంతో వడ్డీ రేట్ల పెంపులో ఈసారి దూకుడు వైఖరిని తగ్గించింది.
15 సంవత్సరాల గరిష్ట స్థాయికి ఫెడ్ వడ్డీ రేటు
భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అమెరికా ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపు నిర్ణయం వెలువడింది. 2022 ప్రారంభంలో సున్నా స్థాయిలో ఉన్న వడ్డీ రేటును గత ఆరు దఫాల్లో పెంచుతూ, 3.75-4 శాతానికి చేర్చింది. ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు తాజాగా 0.50 శాతం పెరిగిన తర్వాత, దాని టార్గెట్ రేటు 4.25-4.50 శాతానికి చేరుకుంది. ఇది గత 15 ఏళ్లలో, అంటే 2007 తర్వాత గరిష్ట స్థాయి. 2023 సంవత్సరం చివరలో మరో 75 బేసిస్ పాయింట్లు లేదా 0.75 శాతం వడ్డీ పెంపు ఉండొచ్చని ఫెడ్ పేర్కొంది. ఇదే జరిగితే, వడ్డీ రేటు మరోమారు రికార్డ్ స్థాయిలో 5 శాతం పైకి చేరుకుంటుంది.
నవంబర్‌లో ద్రవ్యోల్బణం తగ్గింది కదాని వడ్డీ రేట్లను తగ్గిస్తే, ద్రవ్యోల్బణం మళ్లీ విజృంభించే అవకాశం ఉంది. కాబట్టి, 2023 సంవత్సరం చివరి వరకు వడ్డీ రేటును తగ్గించే ఆలోచనే ఫెడ్ చేయదని మార్కెట్ నిపుణులు విశ్వసిస్తున్నారు. పరిస్థితులన్నీ చక్కబడితే, 2024 సంవత్సరంలో వడ్డీ రేట్లు తగ్గే అవకాశం ఉంది. ప్రస్తుతం అమెరికాలో నిరుద్యోగిత రేటు 3.5 శాతానికి చేరుకోవడం గమనార్హం. దీనితో పాటు, ఆ దేశ GDP 2023 సంవత్సరంలో 0.50 శాతంగా ఉండే అవకాశం ఉంది, ఇది సెప్టెంబర్‌లో వేసిన అంచనా కంటే చాలా తక్కువ. అమెరికా GDP 1.2 శాతం వరకు ఉండవచ్చని సెప్టెంబరు 2022లో లెక్కలు వేశారు.
ఫెడ్ రిజర్వ్ తర్వాత ఇప్పుడు యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్ వంతు వచ్చింది. ఇవాళ ఆ రెండు బ్యాంకులు (వేర్వేరుగా) సమావేశం అవుతాయి. వడ్డీ రేట్లను పెంచాలని ఆ రెండు బ్యాంకులు నిర్ణయించుకున్నాయా, లేదా అనే దాని మీద ప్రపంచ మార్కెట్ల దృష్టి ఉంది.
ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేటు పెంపు నిర్ణయం ప్రభావం అమెరికన్ స్టాక్ మార్కెట్ల మీద పెద్దగా లేదు. వడ్డీ పెంపులో దూకుడు తగ్గుతుందని మొదట్నుంచీ ఊహిస్తున్న మార్కెట్లు, దానిని ముందుగానే డిస్కౌంట్ చేశాయి. దీంతో, ఫెడ్ నిర్ణయం తర్వాత కూడా అగ్రరాజ్య మార్కెట్లు పెద్దగా రియాక్ట్ కాలేదు. బుధవారం, డౌ జోన్స్ 0.42 శాతం క్షీణతను నమోదు చేసింది.