Tata Cars Price Hikes: టాటా మోటార్స్ కార్ల ధరలు పెరుగుతున్నాయి, ఫిబ్రవరి నుంచి రేట్ల వాత
పెద్ద భారాన్ని కంపెనీయే భరిస్తోందని, వినియోగదార్ల మీద కొంత భారం మాత్రమే వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది.
Tata Cars Price Hikes: 2023 ఫిబ్రవరి నెల నుంచి సొంత కార్ కల మరింత ఖరీదు కాబోతోంది. దేశంలోని అతి పెద్ద ఆటోమొబైల్ కంపెనీల్లో ఒకటైన టాటా మోటార్స్ (Tata Motors), తన ప్యాసింజర్ వాహనాల (passenger vehicles) ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. వాహన తయారీ వ్యయం పెరగడంతో ఆ భారంలో కొంతమేర వాహన కొనుగోలుదార్ల మీదకు కూడా మళ్లించేందుకు రేట్ల పెంపు నిర్ణయం తీసుకున్నట్లు టాటా మోటార్స్ తెలిపింది.
2023 ఫిబ్రవరి 1 నుంచి కొత్త ధరలు
టాటా మోటార్స్ వాహనాల ధరల పెంపు నిర్ణయం ఫిబ్రవరి 1, 2023 (బుధవారం) నుంచి అమల్లోకి వస్తుందని టాటా మోటార్స్ ప్రకటించింది. ప్యాసింజర్ వాహనాల ధరలను దాదాపు 1.2% పెంచబోతున్నట్లు ఆ ప్రకటనలో తెలిపింది. మోడల్ & వేరియంట్‌ను బట్టి వాహనం ధరలు పెరగనున్నాయి. వాహనాల ధరల పెరుగుదలకు పెరిగిన ఖర్చులే కారణమని టాటా మోటార్స్ పేర్కొంది. రెగ్యులేటరీ బాడీ నిబంధనల్లో మార్పులు, ఇన్‌పుట్ కాస్ట్ పెరగడం వల్ల కార్ తయారీ ఖర్చులు పెరిగాయని కంపెనీ వెల్లడించింది. అయితే.. పెద్ద భారాన్ని కంపెనీయే భరిస్తోందని, వినియోగదార్ల మీద కొంత భారం మాత్రమే వేస్తున్నట్లు తన ప్రకటనలో వెల్లడించింది.
ప్యాసింజర్ వాహనాల ధరలను పెంచాలని డిసెంబర్ 2022లోనే టాటా మోటార్స్ ఒక అంచనాకు వచ్చింది. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ & ఎలక్ట్రిక్ వెహికల్స్ సెగ్మెంట్ ఎండీ శైలేష్ చంద్ర మాట్లాడుతూ.. కార్ ధరల పెంపు వల్ల కమొడిటీ ధరల పెరుగుదల ప్రభావం తగ్గుతుందని చెప్పారు. రెగ్యులేటరీ బాడీ నిబంధనల్లో మార్పు కూడా ధరలపై ప్రభావం చూపుతోందని అన్నారు. అలాగే, కొత్త ఉద్గార నిబంధనలకు అనుగుణంగా ఖర్చు కూడా పెరుగుతుందని చెప్పారు.
ఎలక్ట్రిక్ కార్ల మీద ప్రభావం లేదు
కార్ బ్యాటరీల ధరలు కూడా పెరిగాయని, వినియోగదారులపై ఇంకా ఆ భారం పడలేదని శైలేష్ చంద్ర చెప్పారు. బ్యాటరీ ధరలు, కొత్త నియంత్రణ ప్రభావం ఎలక్ట్రిక్ వాహనాలపై కనిపించదని అన్నారు. అంటే, ఎలక్ట్రిక్ కార్ల రేట్లను పెంచకుండా, యథాతథంగా ఉంచారు.
కొత్త ఉద్గార నిబంధనలు 2023 ఏప్రిల్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయి. BS 6 స్టేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా లేని వాహనాల విక్రయాలను నిలిపేస్తారు. కొత్త నిబంధనల ప్రకారం, ఇంధన సామర్థ్యం, CO2 ఉద్గారాలను తగ్గించడంలో సహాయపడే ఇంజిన్లను కార్లలో అమరుస్తారు.
టియాగో (Tata Tiago), పంచ్ (Tata Punch), నెక్సన్ (TATA Nexon), హారియర్ (TATA Harrier), సఫారీ (TATA Safari) బ్రాండ్లతో ప్యాసింజర్ వాహనాలను టాటా మోటార్స్ తయారు చేస్తోంది.
రెండోసారి రేట్లు పెంచిన మారుతి సుజుకీ
ఈ నెల 16వ తేదీ (జనవరి 16, 2023) నుంచి అన్ని మోడళ్ల ధరలను మారుతి సుజుకీ కూడా పెంచింది. కార్ రేట్లను ఈ కంపెనీ పెంచడం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి. 2022 ఏప్రిల్‌లో నెలలో రేట్లు పెంచింది. మోడల్‌ను బట్టి.. 1.1 శాతం వరకు మారుతి కారు ధర పెరిగింది. వాహనం తయారీకి ఉపయోగించే ముడి వస్తువుల ధరలు పెరగడంతో పాటు, కొత్త ఉద్గార ప్రమాణాలను అమలు చేయడం కోసం వాహనాల్లో మార్పులు చేయాల్సి వచ్చినందున మరోమారు పెంపు తప్పడం లేదని మారుతి సుజుకీ ప్రకటించింది.