M.P Ahmed Success Story: 20 ఏళ్లకే వ్యాపారం, 27 వేల కోట్ల సామ్రాజ్యాధినేతగా ఎంపీ అహ్మద్
MP Ahammed Success Story | 20 ఏళ్ల వయసులో వ్యాపారం ప్రారంభించి, రూ. 27,000 కోట్ల విలువైన కంపెనీని నిర్మించిన వ్యక్తిగా M.P.అహ్మద్. 1978లో తన ప్రయాణాన్ని ప్రారంభించారు.
Malabar Gold and Diamonds Founder M.P. Ahmed | 20 ఏళ్ల వయసులో వ్యాపారాన్ని ప్రారంబించిన ఓ యువకుడు నేడు వేల కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని సృష్టించాడు. లక్ష్యం నిర్దేశించుకుని కృషి, పట్టుదల, సాధించాలన్న కసి ఉంటే చేపట్టిన పనిలో విజయాలు సొంతమవుతాయని చెప్పడానికి చరిత్రలో ఎంతోమంది విజయగాథలు కళ్ల ముందు కనిపిస్తున్నాయి. అలాంటి కథే M. P. అహ్మద్ జీవితం చక్కటి ఉదాహరణ.
సుగంధ ద్రవ్యాల పరిశ్రమతో మొదలై..
M. P. అహ్మద్ 1978లో సుగంధ ద్రవ్యాల పరిశ్రమలోకి ప్రవేశించడం ద్వారా తన వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించినప్పుడు అతని వయసు కేవలం 20 ఏళ్లు మాత్రమే. నేడు ప్రపంచంలోని అతిపెద్ద రిటైల్ జ్యువెలరీ గ్రూప్‌లలో ఒకటైన మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వ్యవస్థాపకుడిగా నిలిచారు. చిత్తశుద్ధి, కృషి, అభిరుచితో, వ్యాపారాన్ని నిర్వహించడంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించి ఆయన ఈ అద్భుతాన్ని ఆవిష్కరించారు. ఆయన తన 20 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు, 1978లో మసాలా పరిశ్రమలోకి ప్రవేశించడం ద్వారా తన స్వంత వ్యవస్థాపక ప్రయాణాన్ని ప్రారంభించారు. కేరళలోని కోజికోడ్‌లో నల్ల మిరియాలు, కొత్తిమీర, కొబ్బరిని విక్రయించే వ్యాపారాన్ని ప్రారంభించడంతో తన తొలి అడుగులు వేసారు. అక్కడి నుంచి మలబార్ గోల్డ్ వ్యవస్థాపకుడిగా మారడానికి ఆయనకు ఎక్కువ సమయం పట్టలేదు. అహ్మద్ కోజికోడ్‌లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివారు. తర్వాత కాలికట్ యూనివర్సిటీలో కామర్స్‌లో బ్యాచిలర్ డిగ్రీని అభ్యసించారు. అతని భార్య కె.పి. సుబైదా కాగా, ఈ దంపతులకు ఇద్దరు పిల్లలున్నారు.
1993లో మలబార్ గోల్డ్ ప్రారంభం
చేస్తున్న వ్యాపారంతో సంతృప్తి చెందని అహ్మద్.. ఏదైనా పెద్దది సాధించాలనే ఆశయంతో మార్కెట్ మీద అన్వేషణ మొదలుపెట్టారు. బంగారం, ఆభరణాల రంగంలో విస్తరణకు అవకాశాలున్నాయని గ్రహించారు. ఆ నమ్మకంతోనే 1993లో మలబార్ గోల్డ్ స్థాపించారు. ఆ సంస్థ నేడు ప్రపంచంలోని అతిపెద్ద ఆభరణాల రిటైలర్ గ్రూపుల్లో ఒకటిగా నిలిచింది. మలబార్ గోల్డ్ & డైమండ్స్ మొత్తం 350 అవుట్‌లెట్‌లతో 13 దేశాలలో విస్తరించి ఉన్నబలమైన రిటైల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉంది. అంతేకాకుండా, వారు భారతదేశం, మధ్యప్రాచ్యం, ఫార్ ఈస్ట్, యునైటెడ్ స్టేట్స్ అంతటా విస్తరించిన కార్యాలయాలు, డిజైన్ కేంద్రాలు, హోల్‌సేల్ యూనిట్లు, కర్మాగారాలను నెలకొల్పారు. ఈ సంస్థ ప్రధాన కార్యాలయం కేరళ రాష్ట్రంలోని కోజికోడ్‌లో ఉంది.
కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఇది ప్రపంచవ్యాప్తంగా USD 6.2 బిలియన్ల వార్షిక టర్నోవర్ (సుమారు రూ. 51907 కోట్లు) కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా 21,000 మంది మేనేజ్‌మెంట్ టీమ్ సభ్యులతో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న వ్యాపార సంస్థగా గుర్తింపు సంపాదించింది. ప్రస్తుతం ఈ కంపెనీ రూ.27,000 కోట్ల భారీ విలువను కలిగి ఉందని అంచనా.
గతేడాది ఈ సంస్థ తన 30 ఏళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఆ సందర్భంగా అలియా భట్‌ను ఈ సంస్థకు ప్రచారకర్తగా నియమించుకున్నారు. అనిల్ కపూర్, కరీనా కపూర్, కార్తీ, అలియా భట్, తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ వంటి ప్రముఖ నటులు ఈ ఆభరణాల సంస్థకు ప్రచారకర్తలుగా కొనసాగుతున్నారు.