Stock Market Closing: బ్యాంక్ స్టాక్స్‌లో కొనుగోళ్లు, ఐటీ షేర్లలో అమ్మకాలు - 25000 చేరువలో నిఫ్టీ క్లోజ్
Stock Market Updates: ఈ రోజు ఐటీ షేర్లలో భారీగా అమ్మకాలు జరిగాయి. టీసీఎస్, ఇన్ఫోసిస్, టెక్ మహీంద్రా వంటి షేర్ల భారీ పతనం కారణంగా నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 500 పాయింట్ల మేర నష్టపోయింది.
Stock Market Closing Today Oct 10: ఇండియన్ స్టాక్ మార్కెట్లు ఈ రోజు (గురువారం, 10 అక్టోబర్ 2024) సానుకూలంగా ముగిశాయి. బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు BSE సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా యాడ్ చేసుకుంటే, NSE నిఫ్టీ 25000 మార్క్‌కు అంగుళం దూరంలో స్థిరపడింది. బ్యాంక్ స్టాక్స్ ఈ రోజు బలాన్ని ప్రదర్శించి మార్కెట్‌ను పైకి తీసుకెళ్లినప్పటికీ, ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్ రంగాలు బలహీనంగా మారడంతో లాభాలు కోల్పోవాల్సి వచ్చింది.
మార్కెట్ ముగిసిన సమయానికి, BSE 144.30 పాయింట్లు లేదా 0.18% పెరిగి 81,611.41 వద్ద క్లోజ్ అయింది. NSE నిఫ్టీ 16.50 పాయింట్లు లేదా 0.06% తగ్గి 24,998.45 వద్ద ఆగింది. ఈ ఉదయం సెన్సెక్స్ 81,832.66 దగ్గర, నిఫ్టీ 25,067.05 దగ్గర ఓపెన్ అయ్యాయి.
పెరిగిన & పడిపోయిన షేర్లు
సెన్సెక్స్ 30 ప్యాక్‌లో 17 షేర్లు లాభాలను ఆర్జించాయి 13 షేర్లు నష్టాల్లో ముగిశాయి. కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వంటి పెద్ద షేర్లు 3.90 శాతం వరకు లాభపడ్డాయి. అదే సమయంలో, టెక్ మహీంద్రా, సన్ ఫార్మా వంటి షేర్లు 2.82 శాతం వరకు పడిపోయాయి.
నిఫ్టీ 50 ప్యాక్‌లో 23 స్టాక్స్ పైకి కదిలితే, 27 స్టాక్స్ జారిపోయాయి. సిప్లా, టెక్ మహీంద్రా, ట్రెంట్, సన్ ఫార్మా, ఇన్ఫోసిస్ షేర్లు 3.37 శాతం వరకు నష్టాలతో టాప్ లూజర్స్‌గా మారాయి. మరోవైపు... కోటక్ మహీంద్రా బ్యాంక్, జేఎస్‌డబ్ల్యు స్టీల్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్ గురువారం నాడు 3.84 శాతం వరకు లాభాలతో టాప్ గెయినర్స్‌గా మారాయి.
టాటా గ్రూప్ షేర్లలో మిక్స్‌డ్ ట్రేడింగ్
రతన్ టాటా మరణానంతరం, టాటా గ్రూప్ షేర్లు ఈరోజు మిక్స్‌డ్‌గా స్పందించాయి. టాటా గ్రూప్‌లోని 24 లిస్టెడ్ కంపెనీల్లో 16 లాభాలతో ముగియగా, 8 నష్టాలతో ముగిశాయి. టాటా ఇన్వెస్ట్‌మెంట్, టాటా కెమికల్స్, టాటా కాఫీ, టాటా మెటాలిక్స్, టాటా టెలిసర్వీసెస్ షేర్లు గెయిన్ అయ్యాయి. ఓల్టాస్, ట్రెంట్, టైటన్ వంటి షేర్లు క్షీణించాయి.
సెక్టార్ల వారీగా...
బ్యాంక్ నిఫ్టీ, పీఎస్‌యూ బ్యాంక్ సూచీలు అన్ని సెక్టార్ల కంటే ఎక్కువగా లాభపడ్డాయి, తలో 1 శాతానికి పైగా విలువను పెంచుకున్నాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆటో, మెటల్ షేర్లు కూడా గ్రీన్ కలర్‌లో ముగిశాయి. అదే సమయంలో... ఐటీ, ఫార్మా, ఎఫ్‌ఎమ్‌సీజీ, ఆరోగ్య సంరక్షణ రంగాల సూచీలు ఎక్కువగా నష్టపోయాయి, 2 శాతం వరకు విలువను కోల్పోయాయి.
నిఫ్టీ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.28 శాతం పడిపోతే, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.19 శాతం పెరిగింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
మరో ఆసక్తికర కథనం: రతన్ టాటాకు ఎంత ఆస్తి ఉందో తెలుసా? నిజంగా మీరు నమ్మలేరు