Holiday: మార్చిలో స్టాక్ మార్కెట్లకు 12 సెలవులు, మూడు సుదీర్ఘ వారాంతాలు
మన దేశంలోని ప్రధాన పండుగల్లో ఒకటైన మహా శివరాత్రి మార్చి 8న వచ్చింది.
Stock Market Holidays in March 2024: అతి తక్కువ ట్రేడింగ్ రోజులు ఉన్న నెలల్లో ఒకటిగా మార్చి నెల మారబోతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరం చివరి నెలలో భారతీయ స్టాక్ మార్కెట్లు ఏకంగా 12 రోజులు పని చేయవు. మొత్తం 31 రోజుల్లో కేవలం 19 ట్రేడింగ్ రోజులు మాత్రమే ఉన్నాయి.
మార్చి నెలలో రెండు పెద్ద పండుగలు, ఒక సంతాప దినం
మార్చిలో రెండు పెద్ద పండుగలు, ఒక సంతాప దినం రాబోతున్నాయి. ఆ సందర్భాల వల్ల నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (NSE), బాంబే స్టాక్ ఎక్సేంజ్ (BSE) పని చేయవు. మన దేశంలోని ప్రధాన పండుగల్లో ఒకటైన మహా శివరాత్రి మార్చి 8న వచ్చింది. మార్చి 25న, హోలీ (ధులెండి) ఉంది. సంతాప దినమైన గుడ్ ఫ్రైడే కూడా మార్చి నెలలోనే ఉంది.
మార్చి 8 నుంచి లాంగ్ వీకెండ్
మహా శివరాత్రి, పరమశివుని పూజించే మహా పండుగ మహా శివరాత్రి మార్చి 8న శుక్రవారం రోజున వచ్చింది. ఆ రోజు స్టాక్ మార్కెట్ పని చేయదు. ఆ తర్వాత.. 9వ తేదీన శనివారం, 10వ తేదీన ఆదివారం ఉన్నాయి. అందువల్ల, స్టాక్ మార్కెట్ వరుసగా 3 రోజుల పాటు బంద్ అవుతుంది. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కూడా మార్చి 8న జరుపుకుంటారు.
మార్చి 23, 24, 25 తేదీల్లో సెలవులు
రంగుల పండుగ హోలీ ఈ సంవత్సరం మార్చి 25న వచ్చింది, ఆ రోజు సోమవారం. దీనికి ముందున్న శని, ఆదివారాలు (మార్చి 23, 24 తేదీలు) కూడా సెలవులు కాబట్టి, వరుసగా 3 రోజులు నాన్ ట్రేడింగ్ డేస్ ఉంటాయి. ఈ వారాంతం కూడా లాంగ్ వీకెండ్‌గా మారుతుంది.
మార్చి 29న గుడ్ ఫ్రైడే
యేసు ప్రభువును శిలువ వేసిన జ్ఞాపకార్థం, సంతాప దినంగా పరిగణించే గుడ్ ఫ్రైడే మార్చి 29న ఉంది. ఈ రోజున ఏసుక్రీస్తును శిలువ వేశారని నమ్ముతారు. ఆ రోజు గ్లోబల్ మార్కెట్లు కూడా మూతబడతాయి. అమెరికన్ మార్కెట్లతో పాటు భారతీయ మార్కెట్లకు కూడా సెలవు ఉంటుంది. దీని తర్వాత శని, ఆదివారాలు కూడా కలుపుకుంటే, వరుసగా.. మార్చి 29, 30, 31 తేదీల్లో మార్కెట్‌కు సెలవులు ఉంటాయి.
ఈ శనివారం మార్కెట్ పని చేస్తుంది
మార్చి 2, శనివారం రోజున, NSE & BSE ప్రత్యేక ట్రేడింగ్ సెషన్‌ను నిర్వహిస్తున్నాయి. అందువల్ల, ఈ శనివారం నాడు స్టాక్ మార్కెట్లు పని చేస్తాయి. ఈక్విటీ, ఈక్విటీ డెరివేటివ్స్ విభాగంలో ట్రేడింగ్ జరుగుతుంది. ఈ రోజున, డిజాస్టర్ రికవరీ సైట్ (DR సైట్) వద్ద ఇంట్రాడే జరుగుతుంది. రెండు ప్రత్యేక సెషన్లలో ట్రేడింగ్ ఉంటుంది. మొదటి ట్రేడింగ్ సెషన్ ఉదయం 9.15 నుంచి 10 గంటల వరకు, రెండో ట్రేడింగ్ సెషన్ ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 12.30 వరకు జరుగుతుంది.
ఈ ప్రత్యేక సెషన్ జనవరి 20న జరగాల్సి ఉంది. అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట కారణంగా ప్రత్యేక సెషన్ వాయిదా పడింది. విగ్రహ ప్రాణప్రతిష్ట రోజున ఈక్విటీ మార్కెట్‌కు సెలవు ఇచ్చారు. దీనికి బదులుగా, అదే వారంలోని శనివారం నాడు పూర్తి స్థాయిలో మార్కెట్లను నిర్వహించారు.
మరో ఆసక్తికర కథనం: ఒక్కసారిగా తగ్గిన వెండి రేటు - ఈ రోజు బంగారం, వెండి కొత్త ధరలు ఇవే!