Everest Masala: ఎవరెస్ట్ మసాలాలో ప్రమాదకర రసాయనం!, వాడొద్దంటూ ప్రజలకు హెచ్చరిక
ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఒక పురుగుమందు (Pesticide). దానిని ఆహార పదార్థాల్లో ఉపయోగించకూడదు. అయితే, మసాలా దినుసులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.
Everest Fish Curry Masala: మన దేశంలో నెస్లే (Nestle) కంపెనీ అమ్ముతున్న పిల్లల ఆహార ఉత్పత్తుల మీద చెలరేగిన వివాదం కొనసాగుతూనే ఉంది, ఇంతలోనే మరో పిడుగు లాంటి వార్త బయటకు వచ్చింది. దేశంలోని ప్రముఖ మసాలా దినుసుల కంపెనీ ఎవరెస్ట్ ఈసారి వార్తల్లో నిలిచింది.
ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాపై (Everest Fish Curry Masala) సింగపూర్‌లో నిషేధం విధించారు. సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ (SFA) గురువారం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలాలో ఇథిలీన్ ఆక్సైడ్ (Ethylene Oxide) చాలా ఎక్కువగా ఉందని SFA వెల్లడించింది. ఆ మసాలా పౌడర్‌ను మనుషులు తినకూడదని చెప్పింది.
ఇథిలీన్ ఆక్సైడ్ అనేది ఒక పురుగుమందు (Pesticide). దానిని ఆహార పదార్థాల్లో ఉపయోగించకూడదు. అయితే, మసాలా దినుసులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు.
ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా ప్యాకెట్ల రీకాల్
ఎవరెస్ట్ ఫిష్ కర్రీ మసాలా దిగుమతులు, వినియోగాన్ని నిషేధిస్తూ సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ మసాలాలో ఇథిలిన్ ఆక్సైడ్ నిర్దేశిత పరిమాణం కంటే ఎక్కువగా ఉందని అధికారికంగా ప్రకటించింది. ఈ మసాలా బ్రాండ్ సింగపూర్‌లోని SP ముత్తయ్య & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా దిగుమతి జరిగింది. మార్కెట్ నుంచి ఆ మసాలా మొత్తాన్ని వెనక్కు తీసుకోవాలని (Recall) SP ముత్తయ్య & సన్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను SFA ఆదేశించింది.
ఎవరెస్ట్ మసాలా తినొద్దని ప్రజలకు SFA విజ్ఞప్తి
ఎవరెస్ట్ మసాలాను ఆహారంలో ఉపయోగించవద్దని సింగపూర్ ఫుడ్ ఏజెన్సీ ప్రజలకు విజ్ఞప్తి చేసింది. దీనిని ఇప్పటికే కొనుగోలు చేసి ఉంటే, ప్రస్తుతానికి దాన్ని ఉపయోగించవద్దని సూచించింది. ఇథిలీన్ ఆక్సైడ్‌ను ఎక్కువ కాలం వినియోగిస్తే ఆరోగ్య సమస్యలు వస్తాయని ఫుడ్ ఏజెన్సీ తెలిపింది. ఇప్పటికే దానిని వినియోగిస్తే, ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతుంటే, వైద్యుడిని సంప్రదించవచ్చని సూచించింది.
స్పందించిన ఎవరెస్ట్ కంపెనీ
వియోన్ రిపోర్ట్ ప్రకారం, ఈ వివాదంపై ఎవరెస్ట్ కంపెనీ స్పందించింది. తమది 50 ఏళ్ల ప్రసిద్ధ బ్రాండ్ అని చెబుతూ కంపెనీ ఒక ప్రకటన విడుదల చేసింది. తమ ఉత్పత్తులన్నీ కఠినమైన పరీక్ష తర్వాత మాత్రమే తయారవుతాయి, ఎగుమతి అవుతాయని తెలిపింది. తాము పరిశుభ్రత & ఆహార భద్రత ప్రమాణాలను ఖచ్చితంగా పాటిస్తామని కంపెనీ వెల్లడించింది. తమ ఉత్పత్తులు ' స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా', FSSAIతో సహా అన్ని ఏజెన్సీల ఆమోదం పొందాయని ప్రకటించింది. ఎగుమతి చేసే ప్రతిసారీ ఎవరెస్ట్ మసాలా ఉత్పత్తులను స్పైస్ బోర్డ్ ఆఫ్ ఇండియా పరీక్షిస్తుందని తెలిపింది. ప్రస్తుతం అధికారిక సమాచారం కోసం ఎదురుచూస్తున్నామని, తమ నాణ్యత నియంత్రణ బృందం ఈ విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తుందని ఎవరెస్ట్ కంపెనీ ప్రకటించింది.
నెస్లే ఉత్పత్తుల పైనా వివాదం
నెస్లే కంపెనీ మన దేశంలో విక్రయించే చిన్న పిల్లల ఆహారంలో ఎక్కువ చక్కెర కలుపుతున్నట్లు ఇటీవల ఆరోపణలు వచ్చాయి. ఈ కంపెనీ సెరెలాక్ (CERELAC) వంటి ప్రసిద్ధ ఆహార ఉత్పత్తులను అమ్ముతోంది. నెస్లే ఉత్పత్తులపై వచ్చిన ఆరోపణలపై విచారణ జరపాల్సిందిగా భారత ఆహార భద్రత & ప్రమాణాల అథారిటీని (FSSAI) 'సెంట్రల్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ' (CCPA) కోరింది. భారతదేశంతో పాటు ఆసియా, ఆఫ్రికా దేశాల్లో విక్రయించే శిశువుల ఆహారంలో ఎక్కువ మోతాదులో చక్కెర కలుపుతున్నారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి.
భారత్‌లో తయారయ్యే తమ ఉత్పత్తులు అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతాయని, అదనపు చక్కెర సహా అన్ని పోషకాలు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయని గురువారం నెస్లే ఇండియా ప్రకటించింది.
మరో ఆసక్తికర కథనం: కేవలం ఐదు క్లిక్స్‌తో SBI ప్రి-అప్రూవ్డ్ లోన్ పొందండి!