Retail Inflation: నాలుగు నెలల తర్వాత మళ్లీ పెరిగిన ద్రవ్యోల్బణం, అయితే ఈసారి కాస్త ఊరట
జులై నుంచి అక్టోబర్ వరకు తగ్గుతూ వచ్చిన CPI ఇన్‌ఫ్లేషన్ నంబర్, నవంబర్‌లో మాత్రం జంప్ చేసింది.
Retail Inflation Data For November 2023: వరుసగా నాలుగు నెలల పాటు తగ్గిన రిటైల్ ఇన్‌ఫ్లేషన్, ఈ ఏడాది నవంబర్ నెలలో పెరిగింది. 2023 నవంబర్‌లో, దేశంలో చిల్లర ద్రవ్యోల్బణం 5.55 శాతంగా నమోదైంది. భారీగా పెరిగిన రేట్లు, ముఖ్యంగా ఆహార పదార్థాల ధరల కారణంగా నవంబర్ ఇన్‌ఫ్లేషన్‌లో ఇంకాస్త పెద్ద నంబర్‌ను మార్కెట్ అంచనా వేసింది. మార్కెట్ ఊహించినదాని కంటే తక్కువగా ద్రవ్యోల్బణం పెరగడం కాస్త ఊరటనిచ్చే అంశం. దీంతోపాటు, రిజర్వ్ బ్యాంక్ (RBI) గరిష్ట లక్ష్యమైన 6 శాతం లోపే ఉండటం మరో ఉపశమనం.
గత నాలుగు నెలల డేటా
ఈ ఏడాది అక్టోబర్‌లో చిల్లర ద్రవ్యోల్బణం 4.87 శాతంగా ఉంది. సెప్టెంబర్‌లో 5.02 శాతంగా, ఆగస్టులో 6.83 శాతంగా ఉంది. జులైలో మరింత భారీగా 7.44 శాతంగా నమోదైంది. జులై నుంచి అక్టోబర్ వరకు తగ్గుతూ వచ్చిన CPI ఇన్‌ఫ్లేషన్ నంబర్, నవంబర్‌లో మాత్రం జంప్ చేసింది. ఏడాది క్రితం, 2022 నవంబరులో ఇది 5.88 శాతంగా ఉంది.
పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం (Food inflation rate in November 2023)
రిటైల్ ద్రవ్యోల్బణం వివరాలను జాతీయ గణాంకాల కార్యాలయం (NSO) విడుదల చేసింది. ఈ డేటా ప్రకారం, నవంబర్ నెలలోనూ ఆహార ద్రవ్యోల్బణం పెరిగింది, 8.70 శాతానికి చేరింది. ఇది 2023 అక్టోబర్‌లో 6.61 శాతంగా ఉంది. పండ్లు, కూరగాయలు, పప్పులు, సుగంధ ద్రవ్యాల ధరలు పెరగడం వల్ల ఆహార ద్రవ్యోల్బణం రేటు పెరిగింది. సీపీఐ ఇండెక్స్‌లో మొత్తం ఆహార పదార్థాల వాటానే 60 శాతం ఉంటుంది. కాబట్టి, ద్రవ్యోల్బణం రేటులో ఆహార పదార్థాలది అతి పెద్ద పోర్షన్.
ఇంటి బడ్జెట్ పెంచుతున్న పప్పు దినుసులు
సామాన్య ప్రజలను పప్పు దినుసులు ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని రిటైల్ ద్రవ్యోల్బణం గణాంకాలు కూడా స్పష్టం చేస్తున్నాయి. పప్పు దినుసుల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లోని 18.79 శాతంగా ఉంటే, నవంబర్‌లో 20.23 శాతానికి పెరిగింది. ధాన్యాలు & సంబంధిత ఉత్పత్తుల ద్రవ్యోల్బణం గత నెలలోని 10.65 శాతం నుంచి నవంబర్‌లో 10.27 శాతానికి చేరింది. సుగంధ ద్రవ్యాల ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో 23.06 శాతంగా ఉంది, నవంబర్‌లో 21.55 శాతంగా నమోదైంది. పండ్ల ద్రవ్యోల్బణం 9.34 శాతం నుంచి 10.95 శాతం ప్రియమైంది. కూరగాయల ద్రవ్యోల్బణం 17.70 శాతానికి పెరిగింది. తృణ ధాన్యాలు ధరల్లో 10.27 శాతం పెరుగుదల కనిపిస్తే, నూనెలు-కొవ్వుల ద్రవ్యోల్బణం 15 శాతానికి తగ్గింది.
నవంబర్ నెలలో, దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ద్రవ్యోల్బణం (Rural Inflation) 5.85 శాతంగా నమోదైతే, పట్టణ ప్రాంతాల్లో (Urban Inflation) 5.26 శాతంగా ఉంది.
ఈ ఏడాది సరైన వర్షాలు లేక సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గింది. దీనికితోడు, పండుగ సీజన్‌లో డిమాండ్ వల్ల కూరగాయలు, కిరాణా సామగ్రి రేట్లు పెరిగాయి. అందువల్ల, కొన్ని నెలలుగా ఆహార ద్రవ్యోల్బణం రేట్ పెరుగుతోంది.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి