Reliance: రిలయన్స్ Q4 ఫలితాలకు మూహుర్తం ఖరారు, డేట్ ఫిక్స్ చేసిన అంబానీ
ఆర్థిక ఫలితాలను పరిశీలించడానికి, ఆమోదించడానికి సంస్థ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం, ఏప్రిల్ 21, 2023న సమావేశం అవుతుంది
Reliance Q4 Results: రిలయన్స్ ఇండస్ట్రీస్ నాలుగో త్రైమాసికం (2023 జనవరి-మార్చి కాలం లేదా Q4) ఆదాయాలను ప్రకటించేందుకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన, శుక్రవారం నాడు తన వ్యాపార ఫలితాలను ఈ కంపెనీ ప్రకటించనుంది.
"2023 మార్చి 31తో ముగిసిన త్రైమాసికం, ఆర్థిక సంవత్సరంలో కంపెనీ స్వతంత్ర, ఏకీకృత ఆడిట్ చేసిన ఆర్థిక ఫలితాలను పరిశీలించడానికి, ఆమోదించడానికి సంస్థ డైరెక్టర్ల బోర్డు శుక్రవారం, ఏప్రిల్ 21, 2023న సమావేశం అవుతుంది" అని BSE ఫైలింగ్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ పేర్కొంది.
మూడో త్రైమాసికంలో ఫలితాలు ఇవి
Q3FY23లో (2022 అక్టోబర్-డిసెంబర్ కాలం), రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏకీకృత నికర లాభం రూ. 15,792 కోట్లకు పడిపోయింది, YoYలో 15% తగ్గింది. ఆదాయం ఏడాది ప్రాతిపదికన 15.3% పెరిగి రూ. 2.20 లక్షల కోట్లకు చేరుకుంది. ఏకీకృత నిర్వహణ లాభం (EBITDA) సంవత్సరానికి 13.5% పెరిగి రూ. 38,460 కోట్లకు చేరుకుంది.
అదే కాలంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ ప్రధాన విభాగమైన చమురు-రసాయనాల (O2C) వ్యాపారం ఏకీకృత ఆదాయం సంవత్సరానికి 10% పెరిగి రూ. 1.44 లక్షల కోట్లకు చేరుకుంది. ఆ త్రైమాసికంలో, RIL ఏకీకృత ఆదాయంలో 65% కంటే ఎక్కువ వాటా ఈ వ్యాపారం నుంచే వచ్చింది.
సేమ్ పిరియడ్‌లో, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ ఏకీకృత నికర లాభం 6.2% YoY వృద్ధితో రూ. 2,400 కోట్లకు చేరింది. ఆదాయం ఏడాదికి 17% పెరిగి రూ. 67,623 కోట్లకు చేరుకుంది. నిర్వహణ లాభం సంవత్సరానికి 25% పెరిగి రూ. 4,773 కోట్లకు చేరుకుంది. ఈ రిటైల్ మేజర్‌కు రికార్డ్ స్థాయి త్రైమాసిక ఆదాయాలివి.
జియో ప్లాట్‌ఫామ్స్ ఏకీకృత నికర లాభం 28.6% పెరిగి రూ. 4,881 కోట్లకు చేరుకుంది, ఆదాయం 21% పెరిగి రూ. 24,892 కోట్లకు చేరుకుంది.
షేర్ ధర - టార్గెట్ ప్రైస్
గురువారం (13 ఏప్రిల్ 2023) నాటి ట్రేడింగ్‌లో, BSEలో, RIL షేర్ 0.4% లాభంతో రూ. 2,355.6 వద్ద ముగిసింది. అయితే.. ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు ఈ స్టాక్ 8% పైగా క్షీణించింది, గత నెల రోజుల్లో 5% పైగా పెరిగింది.
Trendlyne డేటా ప్రకారం, RIL సగటు టార్గెట్ ప్రైస్ రూ. 2,852. ప్రస్తుత మార్కెట్ ధరల కంటే 21% పెరుగుదలను ఇది చూపుతోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్‌ను ట్రాక్ చేస్తున్న ఎనలిస్ట్‌ల్లో 29 మంది "స్ట్రాంగ్ బయ్", "బయ్" సిఫార్సు చేశారు. ఇద్దరు మాత్రమే "స్ట్రాంగ్ సెల్", "సెల్" సూచన ఇచ్చారు. మరో ముగ్గురు "హోల్డ్" రేటింగ్ ప్రకటించారు.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.