(Source: ECI/ABP News/ABP Majha)
Jio Financial Shares: రిలయన్స్ షేర్‌హోల్డర్లకు సూపర్ గిఫ్ట్, డీమ్యాట్ ఖాతాల్లోకి జియో ఫైనాన్స్ షేర్లు
అర్హత ఉన్నా కొందరి డీమ్యాట్ ఖాతాల్లోకి ఇంకా జియో ఫైనాన్షియల్ షేర్లు డిపాజిట్ కాలేదు.
Jio Financial Services Shares: రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్‌హోల్డర్లకు గుడ్ న్యూస్. రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయిన జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లు అర్హులైన రిలయన్స్ ఇండస్ట్రీస్ పెట్టుబడిదార్ల డీమ్యాట్ ఖాతాల్లో జమ అయ్యాయి. చాలా మంది ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లకు గురువారం (10 ఆగస్టు 2023) ఈ షేర్లు అందాయి.
అర్హత ఉన్నా కొందరి డీమ్యాట్ ఖాతాల్లోకి జియో ఫైనాన్షియల్ షేర్లు ఇంకా డిపాజిట్ కాలేదు. అయితే, వాళ్లు కంగారు పడాల్సిన పని లేదు. అతి త్వరలోనే, అర్హత ఉన్న ప్రతి ఒక్క షేర్ కూడా డీమ్యాట్ అకౌంట్‌లోకి వస్తాయి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్ల లిస్టింగ్ డేట్‌ను రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇంకా ప్రకటించలేదు కాబట్టి, ఈలోపులోనే అందరికీ షేర్లను జమ చేస్తారు.
రికార్డ్ డేట్ 20 జులై 2023
జియో ఫైనాన్షియల్ షేర్లు పొందడానికి రికార్డ్ డేట్‌గా 20 జులై 2023ను రిలయన్స్ ఇండస్ట్రీస్ (Reliance Industries) ప్రకటించింది. ఆ తేదీ నాటికి ఎవరి డీమ్యాట్ అకౌంట్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు ఉన్నాయో, వాళ్లందరికీ ఒకటి, రెండు రోజుల తేడాతో జియో ఫైనాన్షియల్ షేర్లు జమ అవుతాయి.
జియో ఫైనాన్షియల్ కంపెనీ డీమెర్జర్ ప్లాన్ ప్రకారం, 20 జులై 2023 నాటికి, ఎన్ని రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లను ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్లు కలిగి ఉన్నారో, అదే సంఖ్యలో జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ షేర్లను ఇస్తున్నారు.
లిస్టింగ్ డేట్ AGMలో ప్రకటన!
ఇన్వెస్టర్లు, షేర్‌హోల్డర్ల డీమ్యాట్ ఖాతాల్లోకి జియో ఫైనాన్షియల్ షేర్లు వచ్చినప్పటికీ, ఇప్పుడు వాటిని ట్రేడ్ చేయడం (కొనడం/అమ్మడం) సాధ్యం కాదు. స్టాక్ ఎక్స్ఛేంజ్‌లో జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ తర్వాత మాత్రమే షేర్ ట్రేడింగ్ సాధ్యం అవుతుంది. ఈ నెల 28న జరగనున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆన్యువల్ జనరల్ మీటింగ్ (AGM) జరుగుతుంది. RIL చైర్మన్ ముఖేష్ అంబానీ, జియో ఫైనాన్షియల్ లిస్టింగ్ తేదీని AGMలో ప్రకటించవచ్చని మార్కెట్ భావిస్తోంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ నుంచి విడిపోయిన ఆర్థిక సంస్థ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్ విలువను రూ. 261.85 గా నిర్ణయించారు. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేరు ప్రైస్ తేల్చడానికి, జులై 20, 2023న రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లలో ప్రత్యేక ట్రేడింగ్ సెషన్ నిర్వహించారు.
జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ మార్కెట్ క్యాప్ రూ. 1,66,000 కోట్లకు పైమాటే. డాలర్లలో చెప్పాలంటే దాదాపు 20 బిలియన్ డాలర్లు. ఈ విలువతో, మార్కెట్ క్యాప్ పరంగా దేశంలో 32వ అత్యంత విలువైన కంపెనీగా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ అవతరించింది. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, బజాజ్ ఆటో మార్కెట్ క్యాప్ కూడా జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కంటే తక్కువే.
మరో ఆసక్తికర కథనం: పసిడి రేటు పతనం - ఇవాళ బంగారం, వెండి కొత్త ధరలు ఇవి
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.