Petrol Diesel Prices: వెహికల్ ఓనర్స్‌కి కిక్ ఇచ్చే కబురు - పెట్రోల్, డీజిల్ రేట్లు భారీగా తగ్గొచ్చు!
ICRA Note: అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ రేటు సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు సగటున 74 డాలర్లకు చేరింది. ఈ ఏడాది మార్చిలో ఉన్న సగటు ధర 84 డాలర్ల కంటే ఇది చాలా తక్కువ.
Petrol Diesel Prices Can Be Reduced: దేశంలోని సాధారణ ప్రజలు ప్రస్తుతం ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలతో సంతోషంగా లేరని ఇటీవలి సర్వేలో తేలింది. అంతేకాదు, పెట్రో మంట నుంచి ఉపశమనం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం, అంతర్జాతీయ స్థాయిలో క్రూడ్ ఆయిల్ ధరలు గతంలో కంటే తక్కువగా ఉన్నాయి. కాబట్టి, మన దేశంలో కూడా పెట్రోల్, డీజిల్ వంటి ఇంధనాల ధరలు తగ్గించాలనే డిమాండ్ చాలాకాలంగా ఉంది. ఇప్పుడు, పెట్రో రేట్ల భారం తగ్గే సంకేతాలు కనిపిస్తున్నాయంటూ, రేటింగ్ ఏజెన్సీ ఇక్రా (ICRA) పండగ లాంటి వార్త చెప్పింది.
అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధర సెప్టెంబర్‌లో బ్యారెల్‌కు సగటున రూ.74కి తగ్గింది. ఈ ఏడాది మార్చిలో సగటు ధర బ్యారెల్‌కు 83-84 డాలర్లుగా ఉంది. అప్పటితో పోలిస్తే ఇప్పుడు రేటు చాలా తక్కువగా ఉందని ఇక్రా (ICRA) తన నోట్‌లో వెల్లడించింది. ఇది ఇలాగే కొనసాగి, ముడి చమురు ధరలు తక్కువగానే ఉంటే దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు (OMCs) ఇంధన ధరలను తగ్గించవచ్చు. దేశీయ మార్కెట్‌లో పెట్రోల్, డీజిల్ ధరలను లీటర్‌కు 2 రూపాయల నుంచి 3 రూపాయల వరకు తగ్గించే అవకాశం ఉందని రేటింగ్ ఏజెన్సీ ICRA ఒక నోట్‌లో పేర్కొంది. లీటర్‌కు 2-3 రూపాయలు తగ్గినా, నెలవారీగా చూస్తే సామాన్య వినియోగదార్లకు చాలా డబ్బు మిగులుతుంది. జనం జేబులపై పెరిగిన భారం కొంతవరకైనా తగ్గుతుంది.
ఇక్రా ఇంకా ఏం చెప్పింది?
ICRA ప్రకారం, క్రూడ్ ఆయిల్ రేట్లలో ఇటీవలి క్షీణత కారణంగా భారతదేశ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ప్రైవేట్ సంస్థలు సహా) మంచి మార్జిన్లు సంపాదిస్తున్నాయి. ఈ సమయంలో, ఈ ప్రభుత్వ నియంత్రిత OMCలు పెట్రోల్-డీజిల్ ధరలను తగ్గించడం వల్ల వాటికి ఎలాంటి నష్టం ఉండదు. ఎందుకంటే, అవి ఇప్పటికే గుట్టల కొద్దీ డబ్బును (లాభాలను) ఆర్జించాయి. ఇప్పుడు, ఆ ప్రయోజనాన్ని చమురు వినియోగదార్లకు ఉపశమనంగా పంచాల్సిన సమయం వచ్చింది.
2024 సెప్టెంబర్ 17 నాటికి, అంతర్జాతీయ ఉత్పత్తి ధరతో పోలిస్తే భారతీయ చమురు మార్కెటింగ్ కంపెనీలకు పెట్రోల్ నుంచి లీటరుకు రూ.15 - డీజిల్ నుంచి లీటర్‌కు రూ.12 చొప్పున రికవరీ అవుతోందని ICRA లెక్కగట్టింది.
చమురు ధరలు తగ్గించే అవకాశం ఎంత వరకు ఉంది?
ఈ ఏడాది మార్చి నుంచి ఇంధనం రిటైల్ ప్రైస్‌ల్లో ఎలాంటి మార్పు లేదు. లోక్‌సభ ఎన్నికలకు కొద్దిగా ముందు, మార్చి 15న, పెట్రోల్-డీజిల్ ధరలను లీటరుకు రూ.2 మేర సర్కారు తగ్గించింది. ICRA ప్రకారం, ఇదే పరిస్థితి కొనసాగితే, పెట్రోల్-డీజిల్ ధరలు లీటరుకు 2-3 రూపాయలు తగ్గించినా సమస్యే ఉండదు. చమురు కంపెనీలు లాభాల్లోనే ఉంటాయి.
ముడి చమురు ధరలు ఎందుకు తగ్గుతున్నాయి?
అమెరికాలో ముడి చమురు ఉత్పత్తి చాలా ఎక్కువగా ఉంది. కొన్నేళ్లుగా భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ప్రపంచ వృద్ధిపై నీలిమేఘాలు కమ్ముకున్నాయి. ఫలితంగా, కొన్ని నెలలుగా ముడి చమురు ధరలు భారీగా క్షీణించాయి. ఇది కాకుండా, ఒపెక్ & ఒపెక్+ దేశాలు ఉత్పత్తి కోతల నిర్ణయాన్ని మరో రెండు నెలలు వాయిదా వేశాయి. దీంతో, గ్లోబల్ మార్కెట్‌లో క్రూడ్ చౌకగా మారుతోంది.
మరో ఆసక్తికర కథనం: సౌదీ పంచ్‌కు చమురు రేట్ల పతనం - తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలు ఇవి