Paytm News: పేటీఎం నుంచి రెండు శుభవార్తలు, 5% లాభంతో షేర్ దూకుడు
Paytm News: దేశంలోని యూపీఐ పేమెంట్స్ దిగ్గజం పేటీఎం స్టాక్ నేడు 5 శాతం లాభంతో ట్రేడింగ్ కొనసాగిస్తోంది. వాస్తవానికి కంపెనీ తన రుణ వితరణపై క్లారిటీ ఇవ్వటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు దిగారు.
Paytm Stock: పేటీఎం కంపెనీ ఫిన్‌టెక్ చరిత్రలో అత్యంత ప్రభావాన్ని చూపించినప్పటికీ.. దాని ప్రయాణం అంత భారీ ఒడిదొడుకులతో ఉంది. సాధారణ చిన్న ఉద్యోగి స్థాయి నుంచి దేశ డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో అత్యంత ప్రభావవంతమైన కంపెనీని స్థాపించారు. అయితే కంపెనీ ఎప్పుడు కష్టకాలంలో ఉన్నా దానిని తిరిగి గాడిలో పెట్టేందుకు ఆయన కొత్త ఆలోచనలతో ముందుకు వస్తూనే ఉన్నారు. కంపెనీ ఆదాయాన్ని పెంచి లాభదాయకంగా మార్చేందుకు మార్కెట్లో ఒక అడుగు ముందే ఉన్నారు.
వారం ప్రారంభంలో పేటీఎం కంపెనీ గురించి ఒక వార్త మార్కెట్లు పెద్ద సంచలనాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ లెండింగ్ భాగస్వామి ఆదిత్యా బిర్లా ఫైనాన్స్ రుణ గ్యారెంటీలు అందించేందుకు నిరాకరించినట్లు వచ్చిన వార్తలు తప్పుడు వార్తగా కంపెనీ శుక్రవారం ఉదయం వెల్లడించింది. మార్కెట్లో మీడియా సంస్థలు గతంలో ప్రచురించిన తప్పుడు కథనాలను సరిచేయాలని, కంపెనీ ఇచ్చిన వివరణతో వార్తను నవీకరించాలని కోరింది. తాము కేవలం రుణ వితరణకు భాగస్వామిగా మాత్రమే పనిచేస్తామని, రుణాల డీఫాల్ట్ విషయంలో ఎలాంటి గ్యారెంటీలు తాము ఇవ్వబోమని పేర్కొంది.
వాస్తవానికి గడచిన ఆరు నెలల కాలంలో పేటీఎం స్టాక్ ధర దాదాపు 63 శాతం కుప్పకూలింది. ఇటీవల తన జీవితకాల కనిష్ఠాలను తాకిన పేటీఎం షేర్లు నేడు మార్కెట్లు రుణాల పంపిణీ విషయంలో ఇచ్చిన క్లారిటీతో స్టాక్ లో కొనుగోళ్ల కోలాహలం కొనసాగింది. దీంతో పేటీఎం షేర్లు నేడు 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకి ఏకంగా రూ.16.65 లాభపడి ఎన్ఎస్ఈలో రూ.349.65 రేటు వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో పేటీఎం స్టాక్ 13 శాతం పెరిగింది.
ఇదే క్రమంలో పేటీఎం కొత్తగా ఆటో రైడ్ హెయిలింగ్ వ్యాపారంలోకి అడుగుపెడుతోంది. ఆర్బీఐ కఠిన ఆంక్షల తర్వాత పేటీఎం కొత్త ఆదాయ మార్గాలపై ప్రధానంగా ఫోకస్ పెట్టింది. దీంతో ఓలా, ఉబెర్ కంపెనీలకు పేటీఎం కొత్త బిజినెస్ పెద్ద పోటీదారుగా మారుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన దిల్లీ, ముంబై, బెంగళూరు వంటి చోట్ల తొలుత ఆటో బుకింగ్ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని కంపెనీ యోచిస్తోంది. భారత ప్రభుత్వం తీసుకొచ్చిన ఓఎన్డీసీ నెట్‌వర్క్ ద్వారా సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ముమ్మర ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఇది ఇంకా పేటీఎం చెల్లింపుల యాప్ లో టెస్టింగ్ దశలోనే ఉన్నట్లు సమాచారం.
పేటీఎం యాప్ తీసుకొస్తున్న రైడ్ హెయిలింగ్ సర్వీస్ ద్వారా ఎవరైనా వినియోగడారుడు ఆటో బుక్ చేసుకున్నట్లయితే అది పవర్డ్ బై నమ్మ యాత్రి ఫీచర్ అని వెల్లడిస్తుంది. ఎటువంటి కమిషన్ తీసుకోకుండా ఆటోవాలలకు పూర్తిగా డబ్బు మెుత్తాన్ని అందిస్తున్న నమ్మయాత్రి సేవలు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో విజయవంతం అయ్యాయి. దీనికి బదులుగా కంపెనీ తన ఫ్లాట్ ఫారమ్ పై నమోదు చేయబడిన ట్రైవర్ల నుంచి కొత్త సబ్‌స్క్రిప్షన్ రూపంలో సేవా రుసుమును తీసుకుంటోంది. రైడ్ సొమ్ము పూర్తిగా ఆటో నడిపే డ్రైవర్లకు అందుతున్నందున తక్కువ రేట్లు ప్రజలను సైతం భారీగా ఆకర్షిస్తున్నాయి. లక్షల సంఖ్యలో వినియోగదారులు కలిగిన పేటీఎం కంపెనీకి ఇది కొత్త ఆదాయ వనరుగా మారతుందని ఆర్బీఐ ఆంక్షల వల్ల కోల్పోయిన ఆదాయాన్ని భవిష్యత్తులో భర్తీ చేసుకునేందుకు ఈ ప్లాన్ కొంత సపోర్ట్ చేస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ఈ ఏడాది ప్రారంభంలో ఆర్బీఐ కఠిన చర్యలతో పేటీఎం అనుబంధ సంస్థ పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లైసెన్స్ కోల్పోయింది. ఆర్బీఐ పేటీఎంను వాలెట్ లేదా వినియోగదారుల ఖాతాల్లో తదుపరి డిపాజిట్లు, టాప్-అప్‌లు లేదా క్రెడిట్ లావాదేవీలను ఆమోదించకుండా నిలిపివేసింది. దీంతో యూపీఐ సేవల కోసం థర్డ్-పార్టీ యాప్ ప్రొవైడర్‌గా మారేందుకు పేటీఎం NPCI ఆమోదం పొందింది. సేవలను కొనసాగించేందుకు యాక్సిస్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యెస్ బ్యాంక్‌లతో జతకట్టింది. నాలుగు బ్యాంకులు పేటీఎమ్‌కి పేమెంట్ సిస్టమ్ ప్రొవైడర్ బ్యాంకులుగా పనిచేస్తున్నాయి.