Automobile: పెరిగిన ప్యాసింజర్ వెహికల్ ఎగుమతులు, పోల్ పొజిషన్‌లో మారుతి సుజుకి
ఎగుమతుల్లో 2.5 లక్షల యూనిట్లకు పైగా డిస్పాచ్‌లతో మారుతి సుజుకి ఇండియా (MSI) టాప్ గేర్‌లో ఉంది.
Passenger Vehicle Exports: గత ఆర్థిక సంవత్సరంలో (2022-23 లేదా FY23), భారతదేశం నుంచి ప్రయాణికుల వాహనాల (Passenger vehicles) ఎగుమతులు 15 శాతం పెరిగాయి, 6,62,891 యూనిట్లకు చేరాయి. 2021-22లో భారతదేశం నుంచి 5,77,875 వాహనాలు బయటి దేశాలకు వెళ్లాయి.
ఇండస్ట్రీ బాడీ సియామ్ (SIAM) తాజా డేటా ప్రకారం... FY23లో జరిగిన ప్రయాణికుల వాహనాల ఎగుమతుల్లో 2.5 లక్షల యూనిట్లకు పైగా డిస్పాచ్‌లతో మారుతి సుజుకి ఇండియా (MSI) టాప్ గేర్‌లో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో హ్యుందాయ్ మోటార్ ఇండియా, కియా ఇండియా ఉన్నాయి.
గత ఆర్థిక సంవత్సరంలో ప్యాసింజర్ కార్ షిప్‌మెంట్లు 10 శాతం వృద్ధితో 4,13,787 యూనిట్లకు చేరుకోగా, యుటిలిటీ వెహికల్స్ ఎగుమతులు 23 శాతం పెరిగి 2,47,493 యూనిట్లకు చేరుకున్నాయని 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరర్స్' (SIAM) గణాంకాలు వెల్లడించాయి. అయితే వ్యాన్‌ల ఎగుమతులు 2021-22 ఆర్థిక సంవత్సరంలోని 1,853 యూనిట్ల నుంచి గత ఆర్థిక సంవత్సరంలో 1,611 యూనిట్లకు తగ్గాయి.
పోల్ పొజిషన్‌లో మారుతి సుజుకి
దేశంలోని అతి పెద్ద కార్ల తయారీ సంస్థ అయిన మారుతి సుజుకి ఇండియా (Maruti Suzuki India), గత ఆర్థిక సంవత్సరంలో 2,55,439 ప్రయాణీకుల వాహనాలను ఎగుమతి చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోని 2,35,670 యూనిట్లతో పోలిస్తే ఇప్పుడు ఎగుమతులు 8 శాతం పెరిగాయి. లాటిన్ అమెరికా, ఆసియాన్, ఆఫ్రికా, మిడిల్ ఈస్ట్ సహా సహా వివిధ మార్కెట్‌లకు తన కార్లను మారుతి సుజుకి ఎగుమతి చేస్తుంది.
మిగిలిన కార్ కంపెనీల ఎగుమతి లెక్కలు
హ్యుందాయ్ మోటార్ ఇండియా (Hyundai Motor India) ప్యాసింజర్ వెహికల్ ఓవర్సీస్ డిస్పాచ్‌లు గత ఆర్థిక సంవత్సరంలో 1,53,019 యూనిట్లుగా ఉన్నాయి. 2021-22లోని 1,29,260 యూనిట్ల నుంచి 18 శాతం పెరిగాయి. అదే విధంగా, 2021-22లోని 50,864 యూనిట్లతో పోలిస్తే 2022-23లో కియా ఇండియా (Kia India) గ్లోబల్ మార్కెట్లలోకి 85,756 యూనిట్లను ఎగుమతి చేసింది.
నిస్సాన్ మోటార్ ఇండియా (Nissan Motor India) 60,637 యూనిట్లను రవాణా చేసింది; రెనాల్ట్ ఇండియా (Renault India) 34,956 యూనిట్లు; వోక్స్‌వ్యాగన్ ఇండియా (Volkswagen India) 27,137 యూనిట్లను FY23లో ఎగుమతి చేశాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంలో హోండా కార్స్ ఇండియా (Honda Cars India) 22,710 యూనిట్లను ఎగుమతి చేయగా, మహీంద్ర & మహీంద్ర (Mahindra & Mahindra) 10,622 యూనిట్లను ఎగుమతి చేసింది.
గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం నుంచి మొత్తం ఆటోమొబైల్ (అన్ని సెగ్మెంట్ల కార్లు కలిపి) ఎగుమతులు 47,61,487 యూనిట్లుగా ఉన్నాయి. 2021-22లోని 56,17,359 యూనిట్లతో పోలిస్తే ఈసారి 15 శాతం ఎగుమతులు తగ్గాయి.
ఎలక్ట్రిక్ వెహికల్ సేల్స్‌లో వృద్ధి
భారదదేశంలో విద్యుత్ వాహనాల (Electric vehicles లేదా EVలు) విక్రయాలు భవిష్యత్ ఆశాజనకంగా ఉన్నట్లు ఒక నివేదిక వెలువడింది. KPJM, CII కలిసి ఈ నివేదిక రూపొందించాయి. ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్మకాల్లో వృద్ధి ఈ దశాబ్దం మొత్తం కొనసాగుతుందని అవి నివేదికలో వెల్లడించాయి. ప్రస్తుతం అధిక స్థాయిలో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ప్రజలు ఈవీల వైపు చూస్తున్నారని, ఇదే ట్రెండ్ ఇకపైనా కొనసాగుతుందని పేర్కొన్నాయి. వాహనాల్లో ఎలక్ట్రానిక్ పరికరాల సంఖ్య గతంలోని 16 శాతం నుంచి ప్రస్తుతం 55 శాతానికి పెరిగింది. సాంకేతికత, ఉత్పత్తి నియమాలు మారుతున్న కొద్దీ మరిన్ని ఎలక్ట్రానిక్ పరికరాలు వచ్చి చేరతాయని నివేదిక వెల్లడించింది. 2030 నాటికి, టు-వీలర్, త్రి-వీలర్ విభాగంలో 80 శాతం, వాణిజ్య వాహనాల విభాగంలో 70 శాతం, బస్సుల్లో 40 శాతం, కార్లలో 30 శాతం విద్యుత్ వాహనాలు రోడ్లపై తిరగాలన్నది భారత ప్రభుత్వం లక్ష్యం. దీనికి అనుగుణంగా ఎప్పటికప్పుడు నియమాలు మారుతున్నాయి.