Maruti Suzuki Q3 Results: స్పీడ్ ట్రాక్ ఎక్కిన మారుతి సుజుకీ, Q3లో రెట్టింపు లాభాలు
రూ.1,873 కోట్లను సాధించగలదన్న మార్కెట్ అంచనాలకు మించి భారీగా పెరిగింది.
Maruti Suzuki Q3 Results: 2022 డిసెంబర్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ నికర లాభం సంవత్సరానికి (YoY) రెండింతలు పెరిగి రూ. 2,351 కోట్లకు చేరుకుంది. రూ. 1,873 కోట్లను సాధించగలదన్న మార్కెట్ అంచనాలకు మించి భారీగా పెరిగింది.
కార్యకలాపాల ఆదాయం కూడా గత సంవత్సరం ఇదే కాలం కంటే (YoY) దాదాపు 25% పెరిగి రూ. 29,044 కోట్లకు చేరుకుంది. మార్కెట్ అంచనా వేసిన రూ. 27,162 కోట్ల కన్నా ఎక్కువ సంపాదించింది.
2022 సెప్టెంబర్ త్రైమాసికంతో పోలిస్తే (QoQ) బాటమ్ లైన్ (లాభం) 14% పెరిగింది, టాప్ లైన్ (ఆదాయం) దాదాపు 3% పడిపోయింది.
తగ్గిన ముడి సరకు ధరలు - పెరిగిన ఆపరేటింగ్ మార్జిన్
ఫలితాల్లో కీలకంగా చూడాల్సిన నిర్వహణ లాభం (EBITDA) సంవత్సరానికి 82% పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 304 బేసిస్ పాయింట్లు పెరిగి 9.75%కి చేరుకుంది. గత 2 సంవత్సరాల్లో మొదటిసారిగా మార్జిన్ 9.5%ని దాటింది.
చాలా త్రైమాసికాల తర్వాత, ముడి సరుకు ధరల్లో విషయంలో ఈ కార్ మేకర్ ఉపశమనం పొందింది. ఇన్‌పుట్ ఖర్చులు సంవత్సరానికి కేవలం 2% పెరిగాయి, రూ. 10,213 కోట్లకు చేరాయి. నికర అమ్మకాల్లో ముడి సరుకుల ధర వాటా గత సంవత్సరం కంటే ఇప్పుడు 310 bps తగ్గింది. కంపెనీ ఖర్చుల్లో ఇది అతి పెద్ద ఊరట.
మెరుగుపడిన రియలైజేషన్స్, అనుకూలంగా మారిన విదేశీ మారక ద్రవ్య విలువలు, కమొడిటీల ధరలు తగ్గడం, వ్యయ నియంత్రణల కారణంగా మార్జిన్లలో గణనీయమైన మెరుగుదల (YoY) కనిపించింది. ఫలితంగా ఆ త్రైమాసికంలో ప్రమోషన్ కోసం చేసిన భారీ ఖర్చులు భర్తీ అయ్యాయి.
అయితే, సీక్వెన్షియల్ (QoQ) ప్రాతిపదికన మాత్రం అధిక ప్రమోషన్ ఖర్చుల కారణంగా మార్జిన్లు పడిపోయాయి.
సమీక్ష కాల త్రైమాసికంలో మొత్తం అమ్మకాల సైజ్ సంవత్సరానికి 8% పెరిగి 4,65,911 యూనిట్లకు చేరుకుంది. అయితే, అంతకు ముందు త్రైమాసికంతో (2022 సెప్టెంబర్ త్రైమాసికం) పోలిస్తే దాదాపు 10% క్షీణించాయి.
డిసెంబర్ త్రైమాసికంలో కార్ల దేశీయ అమ్మకాలు గత సంవత్సరం ఇదే కాలం కంటే 10.5% పెరిగాయి, ఎగుమతులు మాత్రం 5% పడిపోయాయి.
19,40,067 యూనిట్ల విక్రయం
దేశంలోని అతి పెద్ద వాహన తయారీ కంపెనీ అయిన మారుతి సుజుకీ, 2022లో అత్యధికంగా 19,40,067 యూనిట్లను విక్రయించింది & 2,63,068 యూనిట్ల రికార్డ్ స్థాయి ఎగుమతులను సాధించింది. దీని మొత్తం ఉత్పత్తి ఆ ఏడాదిలో 25 మిలియన్ యూనిట్లను దాటింది.
కొత్తగా ఓపెన్ చేసిన ఔట్‌లెట్స్‌తో కలిపి మొత్తం నెట్‌వర్క్ 3,500 ఔట్‌లెట్‌లకు పెరిగింది. 2022లో రైల్వే రవాణాను ఉపయోగించి ఈ కంపెనీ రికార్డు స్థాయిలో 3.2 లక్షల వాహనాలను వివిధ ప్రాంతాలకు పంపింది.
బలమైన ఆదాయాల కారణంగా, మారుతి సుజుకి ఇండియా షేర్లు ఇవాళ (మంగళవారం, 24 జనవరి 2023) లాభాలను కంటిన్యూ చేశాయి. రూ. 8,685 వద్ద 1 నెల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ఇంట్రాడే ట్రేడ్‌లో.. నిఫ్టీలో ఈ స్టాక్ దాదాపు 3% పెరిగి రూ. 8,658.20 వద్ద రెండో అతి పెద్ద గెయినర్‌గా నిలిచింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.