Infosys Q1 Results: ఇన్ఫీ నికర లాభంలో 11% గ్రోత్! రెవెన్యూ గైడెన్స్‌లో కోత - మళ్లీ నిరాశే!!
Infosys Q1 Results: దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ గురువారం సాయంత్రం జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది.
Infosys Q1 Results:
దేశంలోనే రెండో అతిపెద్ద సాఫ్ట్‌వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ (Infosys) గురువారం సాయంత్రం జూన్‌తో ముగిసిన త్రైమాసికం ఫలితాలను విడుదల చేసింది. 2024 క్యూ1లో వార్షిక ప్రాతిపదికన రూ.5,945 కోట్ల నికర లాభం నమోదు చేసింది. మార్కెట్ అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. అయితే వార్షిక ప్రాదిపదికన 10 శాతం వృద్ధితో రూ.37,933 కోట్ల ఆదాయం ఆర్జించింది.
అంతర్జాతీయంగా సాఫ్ట్‌వేర్ రంగం అనిశ్చితిలో ఉండటంతో 2024 ఆర్థిక ఏడాది ఆదాయ వృద్ధి అంచనాలను ఇన్ఫోసిస్ కత్తిరించింది. కాన్‌స్టాంట్ కరెన్సీ విధానంలో గతంలో 4-7 శాతంగా ఉన్న ఆదాయం వృద్ధిరేటును 1-3.5 శాతానికి తగ్గించింది. ఆపరేటింగ్ మార్జిన్ గైడెన్స్‌ను మాత్రం అందిపుచ్చుకుంది.
వార్షిక ప్రాతిపదికన ఇన్ఫోసిస్ ఆదాయం బాగున్నప్పటికీ చివరి త్రైమాసికంతో పోలిస్తే సాధారణంగానే ఉంది. అమ్మకాల్లో వృద్ధిరేటు 1.3 శాతమే ఉంది. ఇక నికర ఆదాయం మూడు శాతం మేర తగ్గింది. కాన్‌స్టాంట్ కరెన్సీ విధానంలో అయితే ఆదాయం కేవలం ఒక శాతమే పెరిగింది. ఆపరేటింగ్ మార్జిన్ 20 బేసిస్ పాయింట్లు తగ్గి 20.8 శాతానికి చేరుకుంది.
'స్థూల ఆర్థిక పరిస్థితులు అనిశ్చితిలో ఉన్నప్పటికీ తొలి త్రైమాసికం ఆపరేటింగ్ మార్జిన్లు బాగున్నాయి. నిరంతరం ఖర్చుల్ని తగ్గించుకోవడమే ఇందుకు కారణం. నిర్వాహక క్రమశిక్షణ, ఉత్పత్తిలో మెరుగుదల, వనరుల్ని అత్యుత్తమంగా వినియోగించుకోవడం వంటివి ఇందుకు సాయపడ్డాయి' అని ఇన్ఫోసిస్ సీఎఫ్‌వో నిలంజన్ రాయ్ అన్నారు.
జూన్ త్రైమాసికంలో ఇన్ఫోసిస్ 2.3 బిలియన్ డాలర్ల మేర ఒప్పందాలు కుదుర్చుకుంది. మార్చి త్రైమాసికంలోని 2.1 బిలియన్ డాలర్లతో పోలిస్తే కొంతే ఎక్కువ. 'తొలి త్రైమాసికంలో మా ఒప్పందాలు విలువ 4.2 శాతం మేర పెరిగి రూ.2.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. భవిష్యత్తు వృద్ధికి ఇవి పునాదిగా నిలిచాయి' అని ఇన్ఫోసిస్ కంపెనీ ఎండీ, సీఈవో సలిల్ పారేఖ్ అన్నారు. తమ నాయకత్వ బృందం ఐదు కీలక అంశాలపై స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక దృష్టి సారించిందన్నారు.
మిగతా కంపెనీల మాదిరిగానే ఇన్ఫోసిస్ అట్రిషన్ సైతం తగ్గింది. చివరి త్రైమాసికంలోని 20.9 శాతంతో పోలిస్తే ప్రస్తుతం 17.3 శాతానికి చేరుకుంది. గతేడాది జూన్‌లో అట్రిషన్ రేటు అత్యధికంగా 28.4 శాతం ఉండటం గమనార్హం. అయితే చివరి త్రైమాసికంతో పోలిస్తే ఉద్యోగుల సంఖ్య 6,940 తగ్గి 3,36,294కు చేరుకుంది.
ఇన్ఫోసిస్ షేరు ధర గురువారం క్షీణించింది. 2.18 శాతం అంటే రూ.32 వరకు తగ్గి రూ.1442 వద్ద ముగిసింది. స్టాక్ మార్కెట్ ఆరంభం నుంచీ ఇన్వెస్టర్లు ఈ షేర్లను అమ్మేస్తూనే ఉన్నారు. అయితే చివరి ఐదు రోజుల్లో షేరు 55 రూపాయల మేర పెరిగింది. ఏడాది నుంచి రూ.1300-1600 మధ్యలోనే కదలాడుతోంది.
Also Read: ఉద్యోగుల్ని భయపెట్టేందుకు! టాప్ పెర్ఫార్మర్‌ను పీకేసిన కంపెనీ!
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని లేదా ఉపసంహరించుకోవాలని 'abp దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు, లేదా ఉపసంహరించుకునే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial