(Source: ECI/ABP News/ABP Majha)
India's GDP Q3: నెమ్మదించిన వృద్ధిరేటు - భారత జీడీపీ వృద్ధి 4.4 శాతమే!
India's GDP Q3: కేంద్ర ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. భారత స్థూల జాతీయ ఉత్పత్తి (GDP) 4.4 శాతంగా ఉందని ప్రకటించింది.
India's GDP Q3:
కేంద్ర ప్రభుత్వం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికం జీడీపీ గణాంకాలను విడుదల చేసింది. భారత స్థూల జాతీయ ఉత్పత్తి (GDP) 4.4 శాతంగా ఉందని ప్రకటించింది.
'మూడో త్రైమాసికంలో నికర ధరల (2011-12) వద్ద జీడీపీని రూ.40.19 లక్షల కోట్లుగా అంచనా వేశాం. 2021-22లోని ఇదే సమయంతో పోలిస్తే ఇది రూ.38.51 లక్షల కోట్లు మాత్రమే. అంటే 4.4 శాతం వృద్ధి కనిపించింది. ఈ ఆర్థిక ఏడాది మూడో త్రైమాసికంలో ప్రస్తుత ధరల వద్ద జీడీపీని రూ.69.38 లక్షల కోట్లుగా అంచనా వేశాం. అంతకు ముందు ఇది రూ.62.39 లక్షల కోట్లు. మొత్తంగా 11.2 శాతం వృద్ధి కనిపించింది' అని కేంద్రం వెల్లడించింది.
ప్రస్తుత గణాంకాలను బట్టి భారత ఆర్థిక వ్యవస్థ 2023 ఆర్థిక ఏడాదిలో 7 శాతం వృద్ధిరేటుతో పయనిస్తోందని తెలుస్తోంది. 2021-22 ఆర్థిక వృద్ధిని 8.7 శాతం నుంచి 9.1 శాతానికి సవరించారు. కరోనా అడ్డంకులు తొలగిపోవడంతో చివరి త్రైమాసికంలో 13.5 శాతంగా ఉన్న జీడీపీ 2023 తొలి త్రైమాసికానికి 6.3 శాతానికి పరిమితమైంది.
చివరి త్రైమాసికంతో పోలిస్తే తయారీ రంగం వృద్ధిరేటు 1.1 శాతం సంకోచించిందని కేంద్రం తెలిపింది. అంతకు ముందు ఇది 3.6 శాతంగా ఉందని వెల్లడించింది. రెండో త్రైమాసికంలో 2.4 శాతంగా ఉన్న వ్యవసాయ రంగం వృద్ధి రేటు మూడో త్రైమాసికంలో 3.7 శాతానికి పెరిగిందని పేర్కొంది.
భారతీయ రిజర్వు బ్యాంకు (RBI) రెపోరేట్లను పెంచుతుండటం, డిమాండ్ సన్నగిల్లడంతో వృద్ధిరేటు మూమెంటమ్ పరిమితంగా ఉంటుందని నిపుణులు అంచనా వేసిన సంగతి తెలిసిందే. ద్రవ్యోల్బణం (Inflation) కారణంగా ఆర్బీఐ దూకుడుగా వడ్డీరేట్లను పెంచుతోంది. 2022 మే నుంచి ఇదే ఒరవడి కొనసాగిస్తోంది. విధాన వడ్డీరేటును 250 బేసిస్ పాయింట్ల మేర పెంచింది. ఇప్పటికీ ద్రవ్యోల్బణం లక్షిత రేటు 6 శాతం కన్నా ఎక్కువగా ఉండటంతో మళ్లీ రెపోరేట్ల (Repo Rates) పెంపు తప్పకపోవచ్చు.
చివరి త్రైమాసికం జీడీపీ వివరాలు
ప్రస్తుత త్రైమాసికంలో భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధిరేటు 4.4 శాతంగా ఉంటుందని ప్రభుత్వ సర్వేలో తెలిసింది. 2023-24 మొత్తంగా చూస్తే 6 శాతం వరకు ఉంటుందని పేర్కొంది. ఎస్‌బీఐ ఎకానమిస్టులు సైతం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు 4.6 శాతంగా ఉంటుందని అంచనా వేశారు.
ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో ఆర్థిక వ్యవస్థ 13.5 శాతం విస్తరించింది. కరోనా అడ్డంకులు తొలగిపోవడమే ఇందుకు కారణం. ఎకానమీలో స్థిరత్వం రావడంతో జులై - సెప్టెంబర్ క్వార్టర్లో 6.3 శాతానికి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక ఏడాది జీడీపీ వృద్ధి 7 శాతంగా ఉంటుందని జాతీయ గణాంక కార్యాలయం పేర్కొన్న సంగతి తెలిసిందే. సవరించిన గణాంకాల ప్రకారం అత్యంత వేగంగా ఎకానమీ పుంజుకోవడం లేదు. 2022, మార్చి 31తో ముగిసిన ఏడాదిలో భారత్ 8.7 శాతం వృద్ధి నమోదు చేసింది.
2023 ఆర్థిక ఏడాది ఆరంభంలో జీడీపీ వృద్ధిరేటును 7.8 శాతం నుంచి 7.2 శాతానికి ఆర్బీఐ తగ్గించింది. 2022, సెప్టెంబర్ నాటికి 7 శాతానికి కుదించింది. భౌగోళిక రాజకీయ అనిశ్చితి, ప్రపంచ దేశాలన్నీ ఆర్థిక మందగమనంలో ఉండటం, రష్యా -ఉక్రెయిన్ యుద్ధం వల్ల గత నెల్లో దీనిని 6.8 శాతానికి తగ్గించింది. కాగా 2022-23లో వాస్తవ జీడీపీ 6.8 శాతంగా ఉంటుందని ఆర్బీఐ ప్రొజెక్ట్ చేసింది. ప్రభుత్వం మంగళవారం గణాంకాలు విడుదల చేశాక స్టాక్ మార్కెట్లు ఎలా స్పందిస్తాయో చూడాలి.