India Inc CEOs: వామ్మో, ఇంత జీతమా? అవి డబ్బులా, చిల్లపెంకులా?
FY22లో విప్రో కంపెనీ CEO డెలాపోర్టే తీసుకున్న జీతం 48 కోట్ల రూపాయలు. అంటే, ఒక్క నెలకు 4 కోట్ల రూపాయల జీతం అన్నమాట.
![India Inc CEOs: వామ్మో, ఇంత జీతమా? అవి డబ్బులా, చిల్లపెంకులా? India Inc's CEOs took home on average 4 Percent higher pay in the last fiscal year India Inc CEOs: వామ్మో, ఇంత జీతమా? అవి డబ్బులా, చిల్లపెంకులా?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/19/d5bbfd620e8e3c47ac6ba6ee00b9e7341666160166960545_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
India Inc CEOs: మన దేశంలో, ఒక సగటు ఉద్యోగి నెల జీతం వెయ్యి రూపాయలు పెరగాలంటే ఒక ఏడాది మొత్తం కష్టపడాలి. నెల జీతంలో ఒక్క వెయ్యి రూపాయలైన మిగులుద్దామన్న ఆశయంతో, ఒక సాధారణ వేతన జీవి ఆటోలు, బస్సులు ఎక్కకుండా ఎన్నేసి కిలోమీటర్లు నడుస్తాడో, ఎన్నెన్ని అవసరాలను ఆపేస్తాడో ఎవరికీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇది అందరికీ అనుభవైక్య విషయమే.
ఇప్పుడు అసలు విషయంలోకి వెళ్దాం. గ్లాసుడు మంచినీళ్లు తాగి, గుండె చిక్కబట్టుకుని ఇది చదవండి. గుండె సంబంధ ఇబ్బందులు ఉన్నవాళ్లు ఈ వార్త చదవకపోవడమే ఉత్తమం అన్నది మా సూచన.
సగటు హైక్ 4%
భారతీయ పరిశ్రమ కెప్టెన్లు, అదేనండీ ఇండియన్ కార్పొరేట్ కంపెనీల CEOలు గత ఆర్థిక సంవత్సరంలో (FY22) సగటున 4 శాతం హైక్‌తో కాంపన్సేషన్‌ను ఇంటికి పట్టుకెళ్లారు. CEOలకు జీతం కాకుండా బోనస్, అలవెన్సులు, కమీషన్, ఇతర రివార్డ్స్ ఉంటాయి. వాటన్నింటినీ కలిపి కాంపన్సేషన్‌గా కార్పొరేట్ వర్గాలు పిలుస్తాయి. మన వాడుక భాష ప్రకారం దానిని జీతంగా చెప్పుకుందాం.
కార్పొరేట్ కంపెనీల మీద పాండమిక్ ఎఫెక్ట్, కంపెనీ పనితీరుకు-జీతానికి ముడి పెట్టడం వంటి కారణాల వల్ల FY22లో చాలా తక్కువ పెంపును (సగటున 4 శాతం) CEOలు తీసుకున్నారని కార్పొరేట్ ఇండస్ట్రీ చెబుతోంది.
కార్పొరేట్ CEOల జీతాలను శాతాల్లో కాకుండా రూపాయల్లో ఇప్పుడు చూద్దాం. FY22లో విప్రో (Wipro) కంపెనీ CEO థైరీ డెలాపోర్టే (Thierry Delaporte) తీసుకున్న జీతం 48 కోట్ల రూపాయలు. అంటే, ఒక్క నెలకు 4 కోట్ల రూపాయల జీతం అన్నమాట. FY21 కంటే ఇది 82 శాతం హైక్.
CEOల జీతాలు
డెలాపోర్టే తర్వాతి స్థానం హిందాల్కో ఇండస్ట్రీస్ (Hindalco Industries) నౌక కెప్టెన్ సతీష్ పాయ్‌ది (Satish Pai). ఈయన తీసుకున్న జీతం ఏడాదికి 46.52 కోట్ల రూపాయలు. నెలకు 3.88 కోట్ల జీతం అందుకున్నారు. FY21 కంటే ఇది 89 శాతం ఎక్కువ జీతం ఇది.
లార్సెన్ & టర్బో (Larsen & Toubro) CEO ఎస్.ఎన్. సుబ్రహ్మణ్యం (SN Subrahmanyan) ఏడాది జీతం రూ.30.71 కోట్లు. FY22లో ఈయనకు దక్కిన హైక్ ఏకంగా 120 శాతం.
టీసీఎస్ (TCS) CEO రాజేష్ గోపినాథన్ (Rajesh Gopinathan) FY22 జీతం 25.77 కోట్లు. FY21 కంటే దాదాపు 27 శాతం ఎక్కువ ఇంటికి పట్టుకెళ్లారు.
టాటా స్టీల్ (Tata Steel) CEO టి.వి. నరేంద్రన్ (TV Narendran) 2021-22 ఆర్థిక సంవత్సరంలో అందుకున్న జీతం 19.5 కోట్ల రూపాయలు. అంతకుముందు ఏడాది కంటే ఇది 25 శాతం ఎక్కువ.
హెచ్‌డీఎఫ్‌సీ (HDFC) ముఖ్య కార్యనిర్వహణ అధికారి కేకి మిస్త్రీ (Keki Mistry) FY22 కోసం తీసుకున్న జీతం 19.02 కోట్ల రూపాయలు. అంతకుముందు ఏడాది కంటే ఇది 13 శాతం అధికం.
FY22లో, యావరేజ్‌న చూస్తే MDలు, CEOల సగటు జీతం ₹6.54 కోట్లు. అంతకు ముందు సంవత్సరంలో (FY21) ఈ సగటు ₹6.31 కోట్లుగా ఉండగా, FY20లో ₹6.22 కోట్లుగా ఉంది.
ఇప్పుడు చెప్పండి... నెలకు 15 వేల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగికి 4 శాతం హైక్ అంటే చాలా తక్కువగా భావించాలి గానీ, పదుల కోట్ల రూపాయలు తీసుకుంటున్న వాళ్లకు 4 శాతం హైక్ తక్కువ అంటారా?. ఎవరి స్థాయికి తగ్గట్లుగా వాళ్లకు జీతం వస్తోందని అంటున్నారా.. సరే, అలాగే కానీయండి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)