Global Trade War: ట్రంప్ సుంకాల దాడికి భారత్ నుంచి సరైన సమాధానం - EFTA ప్రారంభం
Trade and Economic Partnership Agreement: EFTA అనేది యూరోపియన్ యూనియన్ వెలుపల ఉన్న నాలుగు దేశాల భాగస్వామ్య సంస్థ. భారతదేశంతో జరిగే ఈ ఒప్పందాన్ని TEPA అని పిలుస్తారు.

European Free Trade Association: ప్రపంచ సుంకాల యుద్ధంలో, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన టారిఫ్ దాడి నేపథ్యంలో, భారతదేశం తగిన ప్రతిదాడితో సరైన సమాధానం చెప్పింది. ప్రపంచ సుంకాల యుద్ధం సవాళ్లను ఎదుర్కోవడానికి, భారతదేశం, నాలుగు యూరోపియన్ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్యాన్ని అమలు చేయబోతోంది. దీనివల్ల, భారతదేశం ఆ దేశాలతో ఎటువంటి ఆటంకం లేకుండా వాణిజ్యం నిర్వహించుకునేందుకు వీలు కలుగుతుంది. అంటే, అమెరికా విధించిన సుంకాల ప్రభావం భారత్‌పై పరిమితంగానే ఉండనుంది.
భారతదేశం - నాలుగు యూరోపియన్ దేశాలు కలిసి మాట్లాడుకుని, సుంకాల అడ్డంకులను పరిష్కరించడానికి సమర్థవంతమైన & ప్రభావంతమైన పరిష్కారాలను కనుగొంటాయి. దీనికోసం, భారతదేశం, కేంద్ర వాణిజ్య మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో EFTA డెస్క్‌ను ఏర్పాటు చేసింది. EFTA అంటే "యూరోపియన్ ఫ్రీ ట్రేడ్ అసోసియేషన్" (European Free Trade Association). ఇది సభ్య దేశాల మధ్య స్వేచ్ఛాయుత వాణిజ్యాన్ని సులభంగా మారుస్తుంది. గత ఏడాది (2024) మార్చి 10న, EFTA ఏర్పాటు కోసం ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ ఒప్పందాన్ని "వాణిజ్యం & ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం" (Trade and Economic Partnership Agreement - TEPA) అని పిలుస్తున్నారు. ఈ అగ్రిమెంట్ ఈ సంవత్సరం ముగింపు నాటికి అమల్లోకి వస్తుందని కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్ గోయల్ సోమవారం వెల్లడించారు. భారత్ మంటపంలో EFTA కోసం ప్రత్యేక డెస్క్‌ను కేంద్ర మంత్రి ప్రారంభించారు.
EFTA సభ్య దేశాలు ఇవీ..
EFTAలో నార్వే, స్విట్జర్లాండ్, ఐస్‌ల్యాండ్, లీచ్‌టెన్‌స్టెయిన్ సభ్య దేశాలు. ఇవి నాలుగు యూరోపియన్ యూనియన్ (EU) వెలుపల ఉన్న దేశాలు. EFTA కోసం ప్రత్యేక డెస్క్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో స్విట్జర్లాండ్ విదేశాంగ మంత్రి హెలెన్ బడ్లిగర్ ఆర్టెడా, నార్వే వాణిజ్య మరియు పరిశ్రమల మంత్రి టోమస్ నార్వోల్, ఐస్లాండ్ శాశ్వత విదేశాంగ మంత్రి మార్టిన్ ఐజోల్ఫ్సన్, లీచ్టెన్‌స్టెయిన్ విదేశాంగ మంత్రి డొమినిక్ హాస్లర్ పాల్గొన్నారు.
ప్రపంచ వాణిజ్య యుద్ధం మధ్య EFTA అవసరం ఇదీ..
డొనాల్డ్ ట్రంప్ సుంకాల దాడి తర్వాత, గ్లోబల్ బిజినెస్ లీడర్ల ఆందోళనల మధ్య, భారతదేశంలో EFTA డెస్క్ ఏర్పాటు కీలకంగా మారింది. వచ్చే 15 సంవత్సరాలలో, ఈ నాలుగు దేశాల నుంచి భారతదేశం 100 బిలియన్ అమెరికన్ డాలర్ల (రూ. 8.75 లక్షల కోట్లు) విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను అందుకోనుంది. స్విస్ గడియారాలు, చాక్లెట్లు, కట్ & పాలిష్ చేసిన వజ్రాలు వంటి అనేక ఉత్పత్తులు చాలా తక్కువ ధరలకు లభిస్తాయి. మన దేశంలో కార్యకలాపాలు ప్రారంభించాలని చూస్తున్న EFTA కంపెనీలకు EFTA డెస్క్ మద్దతు అందిస్తుంది.
EFTA ఒప్పందం వల్ల కొత్తగా సుమారు 10 లక్షల ఉద్యోగాల సృష్టి జరుగుతుందని అంచనా వేశారు. మరో 50 లక్షల నుంచి 60 లక్షల వరకు ప్రత్యక్ష & పరోక్ష ఉద్యోగాలకూ అవకాశం ఉందని పీయూష్ గోయల్ చెప్పారు. భారతదేశం ఇప్పటి వరకు కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందాల్లో EFTA ప్రత్యేకంగా నిలుస్తుంది. 27 దేశాల సమూహం అయిన యూరోపియన్ యూనియన్‌తో భారతదేశం విడిగా సమగ్ర స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతోంది.
మరో ఆసక్తికర కథనం: లోహాల దిగుమతులపై 25 శాతం సుంకం ప్రకటించిన ట్రంప్ - ఈ ఎఫెక్ట్ మామాలుగా ఉండదు!





















