Stolen Smart Phone: మీ ఫోన్ పోతే వెంటనే ఈ పని చేయండి - ఇక దానిని ఓపెన్ చేయడం ఎవరి వల్లా కాదు!
Sanchar Saathi Portal: మీ ఫోన్ దొంగతనానికి గురైతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు, భారత ప్రభుత్వానికి చెందిన ఈ పోర్టల్ ద్వారా దానిని సులభంగా ట్రాక్ చేయవచ్చు.

Blocking The Stolen Phone Through Sanchar Saathi Portal: ఈ కాలంలో మొబైల్ ఫోన్ లేని వ్యక్తి కనిపించడం అరుదుగా మారింది. ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ ఫోన్ ఒక ముఖ్యమైన భాగంగా మారింది. ఫోన్‌లో, కుటుంబ సభ్యులు & బంధుమిత్రుల కాంటాక్ట్ నంబర్లు, ఫొటోలు, క్రెడిట్ & డెబిట్ కార్డ్‌లు వంటి వ్యక్తిగత సమాచారంతో పాటు ఆఫీస్ లేదా వ్యాపారానికి సంబంధించిన సమాచారం కూడా ఉంటుంది. కాబట్టి, ఎవరైనా తన ఫోన్ పోగొట్టుకుంటే, దానితో పాటే మనశ్శాంతిని కూడా కోల్పోతారు. ఫోన్ నంబర్లు పోతాయని, కీలక సమాచారం ఇతరుల చేతికి చిక్కుతుందేమోనని టెన్షన్ పడతారు.
సాధారణంగా, సినిమా హాల్, మార్కెట్ వంటి రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు దొంగలు ఫోన్‌లు కొట్టేస్తుంటారు. కొంతమంది వ్యక్తులు తమ మతిమరుపు కారణంగా ఫోన్ పోగొట్టుకుంటారు. ఏ కారణం వల్ల ఫోన్ పోయినప్పటికీ, ఆందోళన తప్పదు. దురదృష్టవశాత్తు మీ మొబైల్ ఫోన్ పోతే, ముందు ఆందోళన చెందడం ఆపేయండి. భారత ప్రభుత్వ పోర్టల్ ద్వారా మీ ఫోన్‌ను ట్రాక్ చేసే వెసులుబాటు ఉంది, అదే పోర్టల్ ద్వారా దానిని బ్లాక్ కూడా చేయవచ్చు. తద్వారా, మీ వ్యక్తిగత & వృత్తిగత సమాచారం ఇతరుల చేతుల్లోకి వెళ్లకుండా నివారించవచ్చు.
పోలీసులకు ఫిర్యాదు చేయాలి
మీ మొబైల్ దొంగతనానికి గురైనా, మీరు పోగొట్టుకున్నా.. మొదట చేయాల్సిన పని పోలీస్‌లకు ఫిర్యాదు చేయడం. మీ ఫోన్ పోయిన వెంటనే, మీ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లండి. పోగొట్టుకున్న స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించి వివరాలను పోలీసులకు చెప్పండి. పోలీసులు FIR నమోదు చేస్తారు. ఒకవేళ మీరు పోలీస్ స్టేషన్‌కు వెళ్ళే స్థితిలో లేకుంటే ఆన్‌లైన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చు. మీ కంప్లైంట్‌ను రైజ్ చేసిన తర్వాత మీకు ఫిర్యాదు నంబర్ అందుతుంది. మీరు దానిని నోట్ చేసుకుని దాచుకోవాలి. ఆ తరువాత, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న 'సంచార్ సాథి పోర్టల్' (Sanchar Saathi Portal)ను సందర్శించడం ద్వారా మీ మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయగలుగుతారు.
మీ ఫోన్‌ను ఇలా బ్లాక్ చేయండి
'సంచార్ సాథి పోర్టల్'ను సందర్శించడానికి మీరు ఎంత ఆలస్యం చేస్తే మీ వ్యక్తిగత సమాచారానికి రిస్క్ అంత పెరుగుతుందని గుర్తుంచుకోవాలి. https://sancharsaathi.gov.in/ లింక్ ద్వారా మీరు సంచార్ సాథి పోర్టల్ అధికారిక పోర్టల్‌లోకి వెళ్లవచ్చు. హోమ్ పేజీలో, "Citizen Centric Service" ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అందులో.. "Block Your Lost/Stolen Mobile" బటన్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు, మీ స్క్రీన్ మీద ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. దానిలో.. Block Lost/stolen mobile headset ఆప్షన్‌ను ఎంచుకోవాలి. తర్వాత, మీరు పోగొట్టుకున్న మీ మొబైల్ ఫోన్‌కు సంబంధించిన అవసరమైన వివరాలను పూరించాలి. దీంతో, మీ మొబైల్ ఫోన్ బ్లాక్ అవుతుంది. ఒకవేళ మీ ఫోన్ దొరికితే, మీరు ఆ ఫోన్‌ను ఆన్‌లైన్‌లోనే అన్‌బ్లాక్ కూడా చేయవచ్చు.
మరో ఆసక్తికర కథనం: కోట్లాది సిమ్ కార్డులు బ్లాక్ కానున్నాయి - మీ మొబైల్ నంబర్ కూడా బ్లాక్ కావచ్చు!
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

