Hindenburg Research: కుప్పకూలనున్న మార్కెట్లు- మరో సంచలనానికి సిద్ధమైన హిండెన్‌బర్గ్..!! అదానీ తర్వాత..
Adani:హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై షాకింగ్ రిపోర్ట్ తర్వాత ప్రస్తుతం భారత్‌కు సంబంధించిన మరో ముఖ్యమైన బహిర్గతం గురించి త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు సోషల్ మీడియా ఎక్స్ ద్వారా వెల్లడించింది
Hindenburg Research: అమెరికాకు చెందిన షార్ట్ సెల్లర్ హిండెన్‌బర్గ్ ఏడాది కిందట జనవరిలో భారతీయ బిలియనీర్ అదానీ గ్రూప్ వ్యాపారాలను టార్గెట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అదానీ కంపెనీ షేర్లలో అవకతవకలు జరిగాయని చేసిన సంచలన ఆరోపణలు కంపెనీ షేర్లలను కుప్పకూల్చాయి. ఆ సమయంలో అదానీ తన అతిపెద్ద ఓఎఫ్ఎస్ విజయవంతంగా ముగించినప్పటికీ ఇన్వెస్టర్లకు డబ్బును వెనక్కి తిరిగి ఇచ్చేసిన సంగతి భారతీయ ఇన్వెస్టర్లకు ఇప్పటికీ గుర్తుంది.
యూఎస్ రీసెర్చ్ సంస్థ Hindenburg Research అదానీపై చేసిన ఆరోపణల్లో తర్వాతి కాలంలో కోటక్ మహీంద్రా బ్యాంకును సైతం లాగింది. ఇది సర్ధుమణికి దాదాపు కొన్ని నెలలు కూడా ఇంకా గడవక ముందరే మరో సంచన ట్వీట్ చేసిన యూఎస్ షార్ట్ సెల్లర్. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ అదానీ గ్రూప్‌పై షాకింగ్ రిపోర్ట్ తర్వాత ప్రస్తుతం భారతదేశానికి సంబంధించిన మరో ముఖ్యమైన బహిర్గతం గురించి త్వరలోనే ప్రకటన చేయనున్నట్లు తన సోషల్ మీడియా ఖాతా ఎక్స్ ద్వారా వెల్లడించింది. ఇందులో హిండెన్‌బర్గ్, "సమ్ థింగ్ బిగ్ థౌన్ ఇండియా" అని పేర్కొంది.
Something big soon India
— Hindenburg Research (@HindenburgRes) August 10, 2024
దీంతో ప్రస్తుతం భారతీయ ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టిన ఇన్వెస్టర్లు ఈసారి హిండెన్‌బర్గ్ ఏ భారతీయ కార్పొరేషన్ టార్గెట్ కావచ్చు అనే దానిపై విస్తృతమైన ఊహాగానాలు నడుస్తున్నాయి. ఇప్పటికే జపాన్ యెన్ కారణంగా ఈవారం ప్రారంభంలో భారతీయ స్టాక్ మార్కెట్లు కుప్పకూలిన సంగతి తెలిసిందే. అయితే ఆ సమయంలో బెంచ్ మార్క్ సూచీలు భారీ పతనాన్ని చూశాయి. ఇన్వెస్టర్లు ఇప్పటికీ దాని నష్టాల నుంచి తేరుకోక ముందరే మరోసారి దేశీయ స్టాక్ మార్కెట్లలో హిండెన్‌బర్గ్ వల్ల అలజడి సృష్టించటానికి సిద్ధం కావటం బేర్స్ పంజా ఉండొచ్చనే అంచనాలు దలాల్ స్ట్రీట్ వ్యాప్తంగా పెరుగుతున్నాయి.
గత సంవత్సరం జనవరి మాసంలో అదానీ గ్రూప్ హిండెన్‌బర్గ్ ఆరోపణల కారణంగా మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 86 బిలియన్ డాలర్ల మేర ఆవిరైపోయింది. దీనికి తోడు ఆరోపణలతో గ్రూప్ విదేశీ-లిస్టెడ్ బాండ్స్ గణనీయమైన అమ్మకాలను ఎదుర్కొన్నాయి. దీని తర్వాత 2024 జూన్‌లో హిండెన్‌బర్గ్ రీసెర్చ్, న్యూయార్క్ హెడ్జ్ ఫండ్ మేనేజర్ మార్క్ కింగ్‌డన్ మధ్య సంబంధాలను వెల్లడిస్తూ, కొనసాగుతున్న అదానీ-హిండెన్‌బర్గ్ సాగాలో కొత్త పరిణామాలను సెబీ వెల్లడించింది. దీని ద్వారా హిండెన్‌బర్గ్ వ్యూహాత్మక ట్రేడింగ్ ద్వారా గణనీయమైన లాభాలను పొందవచ్చని సెబీ పేర్కొంది. ఈ క్రమంలో రెగ్యులేటర్ సెబీ అమెరికా రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్‌కు భారతీయ చట్టాలను అతిక్రమించిందంటూ నోటీసులు సైతం పంపింది. కానీ సెబీ నోటీసులను యూఎస్ సంస్థ "nonsense" అని పేర్కొంది.
హిండెన్‌బర్గ్ సంస్థను నాథన్ ఆండర్సన్ 2017లో స్థాపించారు. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా వివిధ కార్పొరేట్ కంపెనీలను టార్గెట్ చేసి వివరణాత్మక పరిశోధనలు నిర్వహించిన ట్రాక్ రికార్డ్ కలిగి ఉంది. దాదాపు 10 మంది ఉద్యోగులతో సంస్థ కార్పొరేట్ "గోలియత్స్"ని తీసుకుని షార్ట్ సెల్లింగ్ "డేవిడ్"గా పేరు తెచ్చుకుంది. ఇప్పటి వరకు హిండెన్‌బర్గ్ ద్వారా టార్గెట్ చేయబడిన ప్రసిద్ధ కంపెనీల జాబితాలో Adani Group, Nikola, Clover Health, Block Inc, Kandi, Lordstown Motors ఉన్నాయి.