HCL Technologies Q2 Results: తొడగొట్టిన హెచ్‌సీఎల్ టెక్, లాభంలో 7% వృద్ధి
ఆదాయం, లాభం రెండూ విశ్లేషకుల సగటు అంచనా అయిన రూ. 24,382 కోట్లు, రూ. 3,418 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ అంచనాను ఈ కంపెనీ బీట్ చేసింది.
HCL Technologies Q2 Results: సెప్టెంబర్ త్రైమాసిక ఆదాయాల్లో విప్రో తడబడితే, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ మాత్రం తొడగొట్టింది. సెప్టెంబర్ త్రైమాసికం ఫలితాలను ఆ కంపెనీ బుధవారం ప్రకటించింది. త్రైమాసిక ప్రాతిపదికన (QoQ).. ఏకీకృత ఆదాయం 5.2 శాతం పెరిగి రూ.24,686 కోట్లకు చేరుకుంది. ఏకీకృత నికర లాభం 6.3 శాతం పెరిగి రూ.3,489 కోట్లకు చేరుకుంది.
ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే (YoY ప్రాతిపదికన), నికర లాభం 7.1 శాతం పెరిగింది, ఆదాయం 19.5 శాతం వృద్ధి చెందింది.
ఆదాయం, లాభం రెండూ విశ్లేషకుల సగటు అంచనా అయిన రూ. 24,382 కోట్లు, రూ. 3,418 కోట్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్ అంచనాను ఈ కంపెనీ బీట్ చేసింది.
మొత్తం ఆదాయంలో అమెరికన్ మార్కెట్ వాటా 60 బేసిస్ పాయింట్లు పెరిగి 64.8 శాతానికి చేరుకుంది. యూరప్ మార్కెట్ వాటా 30 బేసిస్ పాయింట్లు తగ్గి 27.5 శాతానికి చేరుకుంది.
గైడెన్స్
రిజల్ట్స్ తర్వాత మేనేజ్‌మెంట్ గైడెన్స్‌తో ఈ కంపెనీ మార్కెట్‌ను ఆశ్చర్యపరిచింది. ప్రపంచ స్థాయిలో మాంద్యం భయాలను వెంటాడుతున్నా, స్థిర కరెన్సీ ప్రాతిపదికన పూర్తి ఆర్థిక సంవత్సరానికి ఆదాయ అంచనాలను గతంలో ప్రకటించిన 12-14% నుంచి 13.5-14.5 శాతానికి పెంచింది. అయితే, మొత్తం FY23 విషయంలో ఎబిట్ (EBIT) మార్జిన్ గైడెన్స్ అప్పర్ ఎండ్‌ను తగ్గించింది. గతంలో 18-20 శాతంగా ప్రకటించిన మార్జిన్‌ను, ఇప్పుడు 18-19 శాతం రేంజ్‌కు తగ్గించింది.
ఈ త్రైమాసికంలో 2,384 మిలియన్ డాలర్ల విలువైన 11 లార్జ్ డీల్స్‌ను హెచ్‌సీఎల్ టెక్ విన్ అయింది. ఇందులో 8 కాంట్రాక్టులు సర్వీసుల విభాగంలో, మరో 3 ప్రొడక్ట్స్ విభాగంలో ఉన్నాయి. మొత్తం కాంట్రాక్టుల్లో త్రైమాసిక ప్రాతిపదికన 16 శాతం, వార్షిక ప్రాతిపదికన 6 శాతం వృద్ధి ఉంది.
కంపెనీలో కొత్తగా 8,359 మంది ఉద్యోగులు చేరారు. దీంతో మొత్తం ఉద్యోగుల సంఖ్య 2,19,325కు పెరిగింది. ఇందులో 10,339 మంది ఫ్రెషర్లు. ఈ ఏడాది 30,000 మంది ఫ్రెషర్లను నియమించుకోవాలని కంపెనీ లక్ష్యం నిర్దేశించుకుంది.
ఆట్రిషన్ రేట్
గత 12 నెలల కాలంలో ఉద్యోగ వలసల రేటు (ఆట్రిషన్ రేట్) 23.8 శాతంగా నమోదైంది. ఇది ఆందోళనకర అంశం.
డివిడెండ్
2022-23 ఆర్థిక సంవత్సరానికి ఒక్కో ఈక్విటీ షేరుకు రూ.10 చొప్పున మధ్యంతర డివిడెండ్ చెల్లించేందుకు హెచ్‌సీఎల్ టెక్ డైరెక్టర్ల బోర్డ్ నిర్ణయించింది.
Disclaimer: ఈ వార్త కేవలం సమాచారం కోసం మాత్రమే. మ్యూచువల్ ఫండ్లు, స్టాక్ మార్కెట్, క్రిప్టో కరెన్సీ, షేర్లు, ఫారెక్స్, కమొడిటీల్లో పెట్టే పెట్టుబడులు ఒడుదొడుకులకు లోనవుతుంటాయి. మార్కెట్ పరిస్థితులను బట్టి ఆయా పెట్టుబడి సాధనాల్లో రాబడి మారుతుంటుంది. ఫలానా మ్యూచువల్ ఫండ్, స్టాక్, క్రిప్టో కరెన్సీలో పెట్టుబడి పెట్టాలని 'ఏబీపీ దేశం' చెప్పడం లేదు. పెట్టుబడి పెట్టే ముందు అన్ని వివరాలు పరిశీలించడం ముఖ్యం. అవసరమైతే సర్టిఫైడ్ ఫైనాన్షియల్ అడ్వైజర్ల నుంచి సలహా తీసుకోవడం మంచిది.