Google: సుందర్ పిచాయ్ మామూలోడు కాదు - గూగుల్‌ను ఓ ఆట ఆడించాడు
Sundar Pichai: సుందర్ పిచాయ్ గూగుల్ చేరి 20 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ రెండు దశాబ్దాల కాలంలో, ఆయన కంపెనీకి దూరమయ్యే సందర్భాలు కొన్ని వచ్చాయి. ఆ సమయంలో గూగుల్ చాలా డబ్బు వెచ్చించింది.
Google CEO Sundar Pichai: గ్లోబల్ టెక్ జెయిట్ గూగుల్, దాని మాతృ సంస్థ ఆల్ఫాబెట్‌కు (Alphabet) చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్‌గా ఉన్న సుందర్ పిచాయ్ టాలెంట్‌కు ప్రపంచ స్థాయి కంపెనీలు ప్రణమిల్లాయి. అతనిని తమ కంపెనీలోకి ఆకర్షించడానికి తీవ్రంగా పోటీ పడ్డాయి. టాప్ పొజిషన్లు, వందల కోట్లు ఇవ్వడానికీ సిద్ధపడ్డాయి.
భారత సంతతికి చెందిన సుందర్ పిచాయ్ (Sundar Pichai) 2004లో గూగుల్‌లో చేరారు. ఆ కంపెనీలో చేరిన ఈ 20 సంవత్సరాల్లో, విజయాల మెట్లు ఎక్కి గూగుల్ టాప్ పొజిషన్‌ను ఆయన సాధించారు. అయితే, సుందర్ పిచాయ్ గూగుల్‌కే కట్టుబడి ఉండలేదు. ఆ కంపెనీని విడిచి పెట్టేందుకు కొన్ని ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. అతన్ని ఆపడానికి గూగుల్ కంపెనీ మిలియన్ల డాలర్లను ఖర్చు పెట్టింది.
2011లో పెద్ద ఆఫర్ ఇచ్చిన ట్విట్టర్
వాల్ స్ట్రీట్ జర్నల్, టెక్ క్రంచ్ రిపోర్ట్స్ ప్రకారం... సుందర్ పిచాయ్, 2011 సంవత్సరంలో, ట్విట్టర్ (ఇప్పుడు X) నుంచి పెద్ద ఆఫర్ అందుకున్నారు. ఆ సమయంలో అతను గూగుల్ క్రోమ్ (Google Chrome), క్రోమ్ ఓఎస్ (Chrome OS) బాధ్యతలు చూస్తున్నారు. ట్విటర్ అతనిని తీసుకుని ప్రొడక్ట్ హెడ్‌గా చేయాలని భావించింది. సుందర్ పిచాయ్‌తో పాటు నీల్ మోహన్‌కు (Neal Mohan) కూడా ట్విట్టర్ మంచి ఆఫర్ ఇచ్చింది.
మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఇచ్చిన గూగుల్
ట్విట్టర్ ఆఫర్‌ను ఎదుర్కోవటానికి గూగుల్‌కు మిలియన్ డాలర్లు ఖర్చయ్యాయని ఆఫర్ వాల్ స్ట్రీట్ జర్నల్, టెక్ క్రంచ్ వెల్లడించాయి. సుందర్ పిచాయ్, నీల్ మోహన్‌లను ఆపడానికి గూగుల్ సుమారు 150 మిలియన్ డాలర్ల విలువైన షేర్లను ఆఫర్ చేసిందని తమ నివేదికలో రాశాయి. సుందర్ పిచాయ్‌కి చీఫ్ ప్రొడక్ట్ ఆఫీసర్ పాత్రను ట్విట్టర్ ఆఫర్ చేసింది. అయితే, ఈ ఇద్దరు ఉద్యోగులను కోల్పోవడానికి గూగుల్ ఇష్టపడలేదు. టాలెంట్ బయటకు పోకుండా తనతోనే నిలబెట్టుకోవడానికి సుందర్ పిచాయ్‌కి సుమారు 50 మిలియన్ డాలర్లు, నీల్ మోహన్‌కు 100 మిలియన్ డాలర్ల విలువైన షేర్లు ఇచ్చింది. తర్వాత, సుందర్ పిచాయ్‌కు ట్విట్టర్ ఆఫర్ చేసిన పొజిషన్‌లోకి జాక్ డోర్సే (Jack Dorsey) వచ్చారు.
మైక్రోసాఫ్ట్ సీఈవో() పదవికి కూడా పోటీదారు
ఆ తర్వాత, సుందర్ పిచాయ్‌ను కోల్పోవాల్సిన మరో సందర్భాన్ని కూడా గూగుల్(Google) ఎదుర్కొంది. 2014 సంవత్సరంలో, మైక్రోసాఫ్ట్ సీఈవో (CEO of Microsoft) పదవికి కూడా అతను పోటీలోకి వచ్చారు. ఆ పదవి భారత సంతతికే చెందిన సత్య నాదెళ్లకు (Satya Nadella) దక్కింది. సుందర్ పిచాయ్‌ని తీసుకోవాడానికి ప్రయత్నించి 2011లో విఫలమైన ట్విట్టర్, 2015 సంవత్సరంలోనూ మరోమారు ప్రయత్నం చేసింది. ఈసారి సీఈవో పదవిని ఆఫర్ చేసిందని సమాచారం. అయితే.. అదే సంవత్సరం ఆగస్టులో సుందర్ పిచాయ్ గూగుల్ సీఈవో అయ్యారు. 2017 సంవత్సరంలో ఆల్ఫాబెట్ డైరెక్టర్ల బోర్డులోకి వచ్చారు. 2019లో సుందర్ పిచాయ్ ఆల్ఫాబెట్ CEO కూడా అయ్యారు.
మరో ఆసక్తికర కథనం: గంటకు రూ.46 కోట్లు, సెకనుకు రూ.1.27 లక్షలు - గౌతమ్ అదానీ సంపాదన ఇది