Gold ETF vs Gold Mutual Fund: బంగారంలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా.. గోల్డ్ ETF, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ లలో ఏది బెటర్
మీరు బంగారం నేరుగా కాకుండా డిజిటల్ గోల్డ్ కొనాలి అనుకుంటున్నారా.. అయితే గోల్డ్ ETF లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ వంటి డిజిటల్ ఎంపికలను ఎంచుకోవచ్చు.

Digital Gold Investment: ఇటీవల దసరా, దీపావళి పండుగల సీజన్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఆ తర్వాత బంగారం ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడిదారులు బంగారం లో పెట్టుబడి పెట్టాలని ఆలోచించవచ్చు. అయితే పెట్టుబడి పరంగా బంగారం ఎల్లప్పుడూ వారికి మేలు చేస్తుంది. బంగారం మార్కెట్ హెచ్చుతగ్గులు, ప్రపంచ అనిశ్చితుల నుండి పెట్టుబడిదారులను రక్షిస్తుంది.
గత కొన్ని సంవత్సరాలలో బంగారం చాలా మంచి రాబడిని ఇచ్చింది. మీరు బంగారం కొనడానికి, దానిని మెయింటైన్ చేయడానికి ఇబ్బంది పడకూడదనుకుంటే, అటువంటి పరిస్థితిలో మీరు గోల్డ్ ETF లేదా గోల్డ్ మ్యూచువల్ ఫండ్ డిజిటల్ ఎంపికలలో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. 2 ఎంపికలలోనూ మీ బంగారం డిజిటల్ రూపంలో అందుబాటులో ఉంటుంది. ఈ రెండింటిలో ఏది మీకు సరైనదో తెలుసుకుందాం.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్
గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కింద మీరు SIP ద్వారా చిన్న మొత్తాలలో బంగారంలో పెట్టుబడి పెట్టవచ్చు. దీని కోసం మీకు డీమ్యాట్ ఖాతా అవసరం లేదు. మీ ఫండ్ మేనేజర్ నేరుగా బంగారం లేదా గోల్డ్ ETFలలో మీ డబ్బును పెట్టుబడి పెడతారు.
గోల్డ్ మ్యూచువల్ ఫండ్ కొత్త పెట్టుబడిదారులకు అనుకూలమైన ఎంపిక అని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. రియల్ టైమ్ ట్రేడింగ్ చేయకూడదనుకునే వారు తమ పెట్టుబడిపై మంచి రాబడిని పొందాలనుకునే వారికి ఇది అనుకూలంగా ఉంటుంది.
గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETF)
గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టడం ద్వారా, మీరు బంగారం ధరలను రియల్ టైమ్ లో ట్రాక్ చేస్తారు. దీని కోసం డీమ్యాట్ ఖాతా అవసరం, ఎందుకంటే మీరు మీ బంగారం కొనుగోలు మరియు అమ్మకాలను స్టాక్ మార్కెట్లో చేస్తారు. గోల్డ్ ETFల ధరలు రోజంతా మారుతూ ఉంటాయి. మీకు ఎక్కువ లిక్విడిటీ కావాలనుకుంటే మరియు మార్కెట్ గురించి మీకు అవగాహన ఉంటే, మీరు గోల్డ్ ETFలలో పెట్టుబడి పెట్టవచ్చు అని మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. గోల్డ్ ETF కోసం మీరు బ్రోకరేజ్ మరియు డీమ్యాట్ ఖాతా ఛార్జీలు చెల్లించాలి.
గోల్డ్ ETF, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రెండింటిలోనూ పెట్టుబడి పెట్టడం వల్ల మీ బంగారం పోయే లేదా దొంగతనానికి గురయ్యే అవకాశం ఉండదు. రెండుంటిపై విధించే పన్ను విషయానికి వస్తే.. గోల్డ్ ETF, గోల్డ్ మ్యూచువల్ ఫండ్ రెండింటిలోనూ మీరు పన్ను చెల్లించాలి. మీరు 3 సంవత్సరాలలోపు మీ పెట్టుబడిని విక్రయిస్తే, మీరు స్వల్పకాలిక మూలధన లాభాల పన్ను (Short Term Tax) చెల్లించాలి.
అదే సమయంలో 3 సంవత్సరాల తర్వాత మీరు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను చెల్లించక తప్పదు. మీరు మీ సౌలభ్యం, అవసరాలకు అనుగుణంగా రెండింటిలో ఏదైనా ఎంచుకోవచ్చు. ఏదైనా పెట్టుబడి పెట్టే ముందు, మీరు మీ ఆర్థిక సలహాదారునితో మాట్లాడి నిర్ణయాలు తీసుకోవాలి. సోషల్ మీడియాలో పోస్టులు చూసి ఇన్వెస్ట్ చేయడం అంత మంచిది కాదు. మీకు అవగాహన ఉంటే ఇన్వెస్ట్ చేయాలి. లేదా ఆర్థిక నిపుణులు, సలహాదారుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోవడం బెటర్.






















