Forex Reserves: దేశంలో పెరిగిన విదేశీ కరెన్సీ, ఇప్పుడు ఇండియా దగ్గర 586.11 బిలియన్ డాలర్ల ఫారెక్స్
ఆర్‌బీఐ గోల్డ్ ఛెస్ట్ 499 మిలియన్ డాలర్లు పెరిగి 45.92 బిలియన్ డాలర్లకు రీచ్ అయింది.
Foreign Exchange Reserves: దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు పెరిగాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రిలీజ్ చేసిన రిపోర్ట్ ప్రకారం... అక్టోబర్ 27, 2023తో ముగిసిన వారంలో, విదేశీ నగదు 2.57 బిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో మొత్తం ఫారెక్స్ (Forex) ఖజానా 586.11 బిలియన్ డాలర్లకు చేరుకుంది. అంతకుముందు వారంలో, విదేశీ మారక నిల్వలు 583.53 బిలియన్ డాలర్లకు తగ్గాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుక్రవారం ఈ డేటాను విడుదల చేసింది. డేటా ప్రకారం, విదేశీ కరెన్సీ ఆస్తులు (Foreign Currency Assets) కూడా పెరిగాయి. విదేశీ కరెన్సీ ఆస్తులు 2.303 బిలియన్ డాలర్లు పెరిగి 517.504 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఫారిన్ కరెన్సీ అసెట్స్ అంటే.. విదేశీ మారక నిల్వల్లో ఉన్న యూరో, పౌండ్, యెన్ వంటి అమెరికాయేతర కరెన్సీ యూనిట్ల విలువలో పెరుగుదల లేదా తరుగుదల విలువ. అమెరికన్ డాలర్ల రూపంలో ఈ విలువను చెబుతారు.
ఈ వారంలో ఆర్‌బీఐ దగ్గర బంగారం నిల్వలు (Gold reserves In India) మరోమారు పెరిగాయి. ఆర్‌బీఐ గోల్డ్ ఛెస్ట్ 499 మిలియన్ డాలర్లు పెరిగి 45.92 బిలియన్ డాలర్లకు రీచ్ అయింది. SDRలో 15 మిలియన్ డాలర్లు తగ్గాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్‌లో (IMF) డిపాజిట్ చేసిన నిల్వలు 208 మిలియన్ డాలర్ల తగ్గుదలతో 4.77 బిలియన్ డాలర్లకు పరిమితం అయ్యాయి.
శుక్రవారం (03 నవంబర్ 2023), డాలర్‌తో రూపాయి మారకం విలువ (dollar to rupee exchange rate) మళ్లీ 2 పైసలు తగ్గి స్వల్పంగా బలహీనపడింది. కరెన్సీ మార్కెట్‌లో ఒక డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.28 వద్ద ముగిసింది. ఈ వారంలో, డాలర్‌తో రూపాయి ఎక్సేంజ్ వాల్యూ రికార్డు స్థాయిలో తగ్గింది, రూపాయి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 83.33కి పడిపోయింది. రూపాయి పతనాన్ని అరికట్టేందుకు కరెన్సీ మార్కెట్‌లో ఆర్‌బీఐ జోక్యం చేసుకుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గత కొన్ని వారాలుగా, విదేశీ పోర్ట్‌ఫోలియో పెట్టుబడిదార్లు (FPIలు) ఈక్విటీ మార్కెట్‌లో అమ్మకాలకు దిగడం వల్ల దేశంలో విదేశీ మారక నిల్వలు క్షీణించాయి. ఈ వారం మార్కెట్ కొంత తేరుకుంది. విదేశీ ఇన్వెస్టర్ల కొనుగోళ్ల కారణంగా ఈ వారం మార్కెట్ బుల్లిష్‌గా ఉంది. దీంతో దేశంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు మెరుగుపడ్డాయి.
ఆల్ టైమ్ హై లెవెల్ ఇది
భారతదేశ విదేశీ మారక నిల్వలు 2021 అక్టోబర్ నెలలో అత్యధిక స్థాయికి, 645 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. ఇది, ఆల్ టైమ్ హై రికార్డ్. అప్పటి నుంచి RBI వద్ద విదేశీ మారకద్రవ్య నిల్వలు తగ్గుముఖం పట్టాయి. 2022 సంవత్సరం ప్రారంభంలోనూ, మన దేశ విదేశీ మారక నిల్వలు 633 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వివిధ ప్రతికూల కారణాల వల్ల విదేశీ పెట్టుబడిదార్లు భారత్‌లోని తమ పెట్టుబడులను భారీగా ఉపసంహరించుకుని డాలర్ల రూపంలో ఆ డబ్బును వెనక్కు తీసుకెళ్లారు. ఏ దేశంలోనైనా, సౌకర్యవంతమైన స్థాయిలో ఉండే విదేశీ మారక నిల్వలు ఆ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని పెంచుతాయి. విదేశీ మారక నిల్వల్లో క్షీణతను ఆర్థిక వ్యవస్థపై పడుతున్న ఒత్తిడిగా చూడాలి. నిల్వలు పెరుగుతుంటే, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ పునాదులు బలపడుతున్నాయని భావించాలి.
మరో ఆసక్తికర కథనం: తెలుగు రాష్ట్రాల్లో మారిన పెట్రోల్, డీజిల్ ధరలు - ఈ రోజు రేట్లు ఇవి
Join Us on Telegram: https://t.me/abpdesamofficial